Telugu Global
Cinema & Entertainment

మళ్ళీ కట్స్ రాణిగా దీపికా పడుకొనే!

ఈ సెన్సారింగ్ లో గమనార్హమేమిటంటే, దీపికా పడుకొనే సీన్లకి మళ్ళీ కత్తెర పడడం. దీపికా పడుకొనే - దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌లకి వరుసగా రెండవసారి ఈ అనుభవం.

మళ్ళీ కట్స్ రాణిగా దీపికా పడుకొనే!
X

రిపబ్లిక్ డే కానుకగా హృతిక్ రోషన్ నటించిన ‘ఫైటర్’ జనవరి 25 న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలవుతోంది. గత మూడేళ్ళుగా ఈ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడెప్పుడాని హృతిక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2021 జనవరి 10 న ఈ మూవీని ఎనౌన్స్ చేసినా, కోవిడ్ కారణంగా మేకింగ్ వాయిదాపడి 2022 నవంబర్ లో ప్రారంభమైంది. దీని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. ఇదే దర్శకుడు షారుఖ్ ఖాన్ తో 2020 నవంబర్ లో ప్రారంభించిన ‘పఠాన్’ 2023 జనవరి 25న రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలై వెయ్యి కోట్ల రూపాయలకి పైగా సంపాదించి పెట్టింది. తిరిగి ఇప్పుడు 2024 రిపబ్లిక్ డేకి మళ్ళీ వచ్చేశాడు సిద్ధార్థ్ ఆనంద్. ఇతడి తాజా మూవీ ‘ఫైటర్’ 25 న విడుదలవుతోంది. దీని అడ్వాన్స్ బుకింగులు బంపర్ గా వున్నాయి. ఈ రోజు ఉదయానికల్లా 81, 516 టికెట్లు బుక్కై, సుమారు రూ. 3 కోట్లు కలెక్టు చేసింది.

బాక్సాఫీసు ట్రాకర్ సాచ్నిక్ ప్రకారం, ‘ఫైటర్’ ఇప్పటికే మొదటి రోజు 86,516 అడ్వాన్స్ బుకింగులు నమోదు చేసి, రూ. 2.84 కోట్లు సంపాదించింది. ఇందులో 2డీ హిందీ వెర్షన్ 33,624 టిక్కెట్లు, 3డీ హిందీ వెర్షన్‌ 46,790 టిక్కెట్లు, ఐమాక్స్ 3డీ యాక్షన్ 4,881 టిక్కెట్లు, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్ 1,221 టిక్కెట్లూ అమ్ముడుబోయాయి. ఢిల్లీలో రూ. 67.39 లక్షలు , మహారాష్ట్రలో రూ. 75.02 లక్షలు, తెలంగాణలో రూ. 40.73 లక్షలు, కర్ణాటకలో రూ.43.54 లక్షలూ అడ్వాన్సు బుకింగుల ద్వారా సమకూరాయి.

అధికారిక సమాచారం ప్రకారం ‘ఫైటర్’ సినిమా కథ ఇలా వుంది... శ్రీనగర్ లోయలో తీవ్రవాద కార్యకలాపాలని నిరోధించడానికి ఎయిర్ హెడ్‌క్వార్టర్స్ కి చెందిన ఎలైట్ యూనిట్ ఎయిర్ డ్రాగన్స్ ఫైటర్ విమానాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇండియన్ ఏర్ ఫోర్స్ అత్యుత్తమ ఫైటర్ విమానాల్ని కలిగి వున్న సమర్ధ యూనిట్. ఏదైనా ప్రతికూల కార్యకలాపాలు జరిగితే తక్షణ రియాక్షన్ తో పనిచేస్తుంది. ఇలా ఈ మూవీ ఎయిర్ డ్రాగన్‌ల కథని వివరిస్తుంది. వైమానిక దళం అంతర్గత, బాహ్య యుద్ధాల ప్రక్రియని నావిగేట్ చేస్తూ, దేశం కోసం సర్వస్వాన్ని అందించడానికి కట్టుబడి వుండే ఏర్ ఫోర్స్ దళం కథగా ఇది వుంటుంది.

సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన హై-ఆక్టేన్, పవర్-ప్యాక్డ్ యాక్షన్ తో, పంచ్ డైలాగులతో, బలమైన దేశభక్తి భావోద్వేగాల సమాహారమైన ఈ మూవీకి- ఫైటర్ జెట్స్ ని, హెలికాప్టర్స్ నీ ఉపయోగించి, ఐఏఎఫ్ సిబ్బంది సహాయంతో నిజ లొకేషన్స్ లో చిత్రీకరణ జరిపారు. తేజ్‌పూర్‌లోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో, తమిళనాడు లోని దిండిగల్‌ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో, పుణేలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఉత్కంఠభరిత యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.

దీని పవర్ ప్యాక్డ్ ట్రైలర్ జనవరి 15 న విడుదలైంది. ఇది ఫ్యాన్స్ ని పిచ్చెత్తించింది. రక్తపోటుని పెంచే యాక్షన్ సీక్వెన్సులు, హృతిక్- దీపికా పదుకొణెల అద్భుత కెమిస్ట్రీ, శక్తివంతమైన నేపథ్య సంగీతం- చక్కగా ప్యాక్ చేసిన ఈ ట్రైలర్ ఫ్యాన్స్ లో విజయోత్సాహాన్ని నింపింది. స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియాగా హృతిక్, స్క్వాడ్రన్ లీడర్ మినాల్ రాథోడ్ గా దీపికా, గ్రూప్ కెప్టెన్ రాకేష్ జై సింగ్ గా అనిల్ కపూర్ దేశం కోసం పోరాడుతూ ఈ ట్రైలర్ లో కనపడ్డారు.

ఇదిలా వుండగా, నిన్న దీని సెన్సారింగ్ పూర్తయింది. కట్స్ లేకుండా కాదు. కట్స్, మార్పు చేర్పులు బాగానే పడ్డాయి. ధూమపాన వ్యతిరేక చట్టబద్ధ హెచ్చరికని హిందీలో పేర్కొనమని అడిగారు. సెన్సార్డ్ ప‌దాలు ఉప‌యోగించార‌ని రెండు డైలాగ్‌ల్లో వాటిని మ్యూట్ చేయ‌మ‌ని కోరారు. ఒకటి 53 నిమిషాలకి, మరొకటి గంటా 18 నిమిషాలకి డైలాగుల్ని మ్యూట్ చేశారు. యువతని లైంగికంగా ప్రేరేపించే విజువల్స్ ని కట్ చేశారు. ఈ 8 సెకన్ల విజువల్స్ వేడెక్కించే షాట్స్ తో వున్నాయి. ఇక టీవీ వార్తలు చ‌దివే దృశ్యంలో 25 సెకన్ల ఆడియో తొల‌గించారు. ఈ మార్పులు చేసిన తర్వాత సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ సర్టిఫికేట్‌లో పేర్కొన్న విధంగా సినిమా నిడివి 166 నిమిషాలు. అంటే రన్ టైమ్ రెండు గంటలా 46 నిమిషాలు.

ఈ సెన్సారింగ్ లో గమనార్హమేమిటంటే, దీపికా పడుకొనే సీన్లకి మళ్ళీ కత్తెర పడడం. దీపికా పడుకొనే - దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్‌లకి వరుసగా రెండవసారి ఈ అనుభవం. ఇంత‌కి ముందు 2023 రిపబ్లిక్ డేకి విడుదలైన ‘ప‌ఠాన్’ లో వివాదాస్పద సాంగ్ `బేషరం రంగ్’ లో దీపికా అభ్యంతరకర మూవ్ మెంట్స్ తో కూడిన క్లోజప్ షాట్, సైడ్ పోజ్ షాట్లు, రెచ్చగొట్టే విజువల్సూ తొల‌గించిన తర్వాతే సెన్సార్ సర్టిఫికేట్ మంజూరైంది. ఇప్పుడు కూడా ఆమెతో ఇదే పరిస్థితి- ఆమెతో యువతని లైంగికంగా ప్రేరేపించే, వేడెక్కించే విజువల్స్ కి కఠినంగా కట్స్ పడ్డాయి! దీపికా మరోసారి ఇది రిపీట్ చేస్తుందేమో చూడాలి. దేశం కోసం పోరాడే సినిమాలో సిద్ధార్థ్ ఆనంద్ కి సక్సెస్ కోసం సెక్స్ అవసరపడుతోంది!



First Published:  22 Jan 2024 8:14 AM GMT
Next Story