Telugu Global
Cinema & Entertainment

ఆస్కార్ ఎంట్రీగా 'చెల్లో షో' సంచలనం!

2023 -95వ ఆస్కార్ అవార్డుల ఎంట్రీకి ఎవరికీ తెలియని, ఇంకా విడుదల కాని గుజరాతీ చలన చిత్రం 'చెల్లో షో' (చివరి షో) ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

ఆస్కార్ ఎంట్రీగా  చెల్లో షో సంచలనం!
X

2023 -95వ ఆస్కార్ అవార్డుల ఎంట్రీకి ఎవరికీ తెలియని, ఇంకా విడుదల కాని గుజరాతీ చలన చిత్రం 'చెల్లో షో' (చివరి షో) ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సంవత్సరం విడుదలై విజయవంతమైన అనేక భారీ, చిన్న, మధ్య తరహా సినిమాలతో పోటీ పడి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ఆశ్చర్యమే. రణబీర్ కపూర్-ఆలియా భట్ నటించిన 'బ్రహ్మాస్త్ర', ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన 'ఆర్ ఆర్ ఆర్', మాధవన్ దర్శకత్వం వహించిన 'రాకెట్రీ – ది నంబి ఎఫెక్ట్', అమితాబ్ బచ్చన్ నటించిన 'ఝుండ్', రాజ్‌కుమార్ రావ్-భూమీ పెడ్నేకర్ నటించిన 'బధాయి దో', ఆయుష్మాన్ ఖురానా నటించిన 'అనేక్' లతో బాటు వివేక్ అగ్నిహోత్రి నిర్మించిన 'కాశ్మీర్ ఫైల్స్', తమిళ థ్రిల్లర్ 'ఇరవిన్ నిళల్', (నాన్-లీనియర్ మలయాళ డ్రామా 'అరియిప్పు', బెంగాలీ బయోగ్రాఫికల్ 'అపరాజితో'- మొదలైన 10 సినిమాలనూ వెనక్కి నెట్టేసి నెగ్గింది.

సినిమా పరిశ్రమకి చెందిన 17 మంది విభిన్న స్వరాలతో కూడిన జ్యూరీ ఈ ఏకగ్రీవ ఎంపిక చేసింది. జ్యూరీ సభ్యులుగా నిర్మాత టిఎస్ నాగభరణ (అధ్యక్షుడు), నిర్మాత సంగీత్ శివన్, సంగీత దర్శకుడు జతిన్ పండిత్, కాస్ట్యూమ్ డిజైనర్లు నిఖత్ -నీరూషా, నిర్మాత అంజన్ బోస్, సౌండ్ రికార్డిస్ట్ మందర్ కమలాపుర్కర్, ఎడిటర్ ప్రతీక్ గుప్తా తదితరులు వున్నారు.

'చెల్లో షో' ని ఎంపిక చేయడానికి కారణం, ఇది దేశంలో వందలాది సింగిల్-స్క్రీన్ సినిమాహాళ్ళు కనుమరుగై పోతున్న సంక్షుభిత పరిస్థితిని కళ్లెదుట వుంచడమేనని జ్యూరీ భావించడం. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ గుజరాతీ ప్రాంతీయ సినిమాలో భవిన్ రాబరి, వికాస్ బాటా, రిచా మీనా, భవేష్ శ్రీమాలి, డిపెన్ రావల్, రాహుల్ కోలీ నటించారు.

2021 జూన్లో న్యూయార్క్ లో నిర్వహించిన 20 వ రాబర్ట్ డెనిరో ట్రిబెకా చలన చిత్రోత్సవంలో దీన్ని ప్రదర్శించారు. అక్టోబర్ 2021లో స్పెయిన్ లో జరిగిన 66వ వల్లాడోలిడ్ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. ఇది దేశంలో ఇంకా విడుదల కాలేదు. ఓటీటీల్లో కూడా లేదు. అక్టోబర్ 14న ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో థియేటర్లలో విడుదలవుతుంది.

ఇప్పటివరకు ఏ భారతీయ సినిమా కూడా ఆస్కార్‌ అవార్డు గెలుచుకోలేదు. ఈ రెండు దశాబ్దాల్లో ఉత్తమ అంతర్జాతీయ మూవీ కేటగిరీలో ప్రవేశం సంపాదించిన భారతీయ సినిమా 2001లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అమీర్ ఖాన్-నటించిన 'లగాన్' ఒక్కటే. దీనికి ముందు 'మదర్ ఇండియా' (1958), 'సలామ్ బాంబే' (1989) ఎంట్రీ సంపాదించుకున్నాయి.

ఇంతకీ 'చెల్లో షో' లో కథ ఏమిటి? కథ ఏదైనా, ఇది 1988 లో విడుదలైన సుప్రసిద్ధ క్లాసిక్, ఆస్కార్ తో బాటు ఇంకా అనేక అవార్డులు సాధించుకున్న ఇటలీ మూవీ 'సినిమా పారడిసో' కి అనుసరణలా వుంది. ఈ ఇటాలియన్ మూవీలో సినిమాలంటే పడిచచ్చే చిన్న కుర్రాడు ఇంట్లో కొట్టినా తిట్టినా బడి ఎగ్గొట్టి, సినిమా హాల్లో దూరుతూంటాడు. ఫ్రీగా సినిమాలు చూసేందుకు ప్రొజెక్షన్ అతనితో స్నేహం చేసి, ప్రొజెక్షన్ రూమ్ లొంచే సినిమాలు చూస్తాడు. కాల క్రమంలో పెద్ద సినిమా దర్శకుడై, చిన్నప్పటి తన అభిమాన థియేటర్ ని చూసుకోవడానికి వస్తే, ఆ థియేటర్ ని షాపింగ్ కాంప్లెక్స్ కోసం కూల్చేస్తూంటారు.

ఈ సినిమా భవిష్య వాణి చెప్పింది. చూపించినట్టుగానే తర్వాతి కాలంలో టీవీ విప్లవం వల్ల థియేటర్లు కూల్చివేసి, లాభసాటి ఆదాయ వనరులుగా షాపింగ్ కాంప్లెక్సులు కట్టుకోవడం మొదలైంది. మన దగ్గర కూడా 2000 తర్వాత టీవీ దెబ్బకి చాలా థియేటర్లు షాపింగ్ కాంప్లెక్సులుగా, కళ్యాణ మండపాలుగా మారిపోయిన దృశ్యాలు చూశాం. ఇదొక దశ.

దీని తర్వాత ఇప్పుడు మల్టీప్లెక్సుల దెబ్బకి మిగిలిన సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళు కూడా మూతబడ్డం మొదలెట్టాయి. ఈ దశనే 'చెల్లో షో' చిత్రిస్తోంది...ఇందులో సమయ్ (భవిన్ రాబారి) అనే తొమ్మిదేళ్ళ కుర్రాడు సినిమాల పిచ్చితో చదువుకోకుండా థియేటర్ని పట్టుకు వేలాడుతూంటాడు. రోజూ సినిమా చూసేందుకు డబ్బుల్లేక ప్రొజెక్షనిస్ట్ ఫజల్ (భావేష్ శ్రీమాలి) తో స్నేహం చేస్తాడు. స్కూలుకని తల్లి (రిచా మీనా) కట్టిచ్చే టిఫిను తెచ్చి ఫజల్ కిచ్చి మస్కా కొడుతూంటాడు. గుజరాతీ వంటకాలు తినమరిగిన ఫజల్, సమయ్ ని ప్రొజెక్షన్ బూత్ లో కూర్చోబెట్టుకుని సినిమాలు చూపిస్తూంటాడు.

ఇలా సమయ్ సినిమా ప్రదర్శనలో సాంకేతికాలు తెలుసుకుని సొంతంగా థియేటర్ ప్రారంభించుకోవాలని నేస్తాలని కూడగడతాడు. ఎవరికీ తెలియని చోట శివారు పాడుబడ్డ భవనంలో పని ప్రారంభిస్తారు. పారేసిన పరికరాలూ అవీ సేకరించి ప్రొజెక్టరు సృష్టిస్తారు. అందులో రీళ్ళు వేసి నడిపించడానికి రైల్వే స్టేషన్ మీద పడతారు. రైల్వే స్టేషన్లో పంపిణీ దారులకి వచ్చే సినిమా రీళ్ళు దొంగిలించి షోలు వేసుకుని ఎంజాయ్ చేస్తూంటారు.

ఇలా ఆనందిస్తూ ఆనందిస్తూ వుండగా రీళ్ళు రావడం మానేస్తాయి. ఫిలిమ్ రీళ్ళు మాయమై డిజిటల్ సినిమాలు వచ్చేస్తున్నాయన్న మాట! ఈ పరిణామం సమయ్ తో బాటు ఫజల్ జీవితాన్నీ ప్రశ్నార్ధకం చేస్తుంది. గుండెలు పగిలి విలపిస్తారు. మన ఉన్నత కులస్థులకి సినిమాలు అప్రదిష్టరా అని తండ్రి మందలించినా సమయ్ గుండె తట్టుకోదు...

అంతరించిపోతున్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్ళ పట్ల ప్రజలకుండే అనుబంధాల్నీ, జ్ఞాపకాలనీ, తీపి గుర్తుల్నీ హృద్యంగా కళ్ళ ముందుంచుతుందీ సినిమా! ఇలాటి సినిమాలు తెలుగులో ఎప్పుడొస్తాయో ఆస్కార్స్ కి వెళ్ళి తెలుగు ప్రతిభని ప్రపంచానికి చాటాడానికి...

Next Story