Telugu Global
Cinema & Entertainment

గోద్రా : గుజరాత్ అల్లర్ల ఆధారంగా సినిమా విడుదల తేదీ ఫిక్స్

Godhra Movie release date: ‘యాక్సిడెంట్ ఆర్ కాన్‌స్పిరసీ : గోద్రా’ టైటిల్ తో 2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన మత అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన సినిమా విడుదలకి సిద్ధమైంది.

గోద్రా : గుజరాత్ అల్లర్ల ఆధారంగా సినిమా విడుదల తేదీ ఫిక్స్
X

‘యాక్సిడెంట్ ఆర్ కాన్‌స్పిరసీ : గోద్రా’ టైటిల్ తో 2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన మత అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన సినిమా విడుదలకి సిద్ధమైంది. మేకర్స్ కొత్త పోస్టర్‌ ని విడుదల చేసి సినిమా విడుదల తేదీని వెల్లడించారు. కొత్త పోస్టర్‌లో, బయటి నుంచి మంటల్లో వున్న రైలు కిటికీ వెలుపల కొంతమంది చేతులు కనిపిస్తాయి. ఆ రైలు పేరు సబర్మతి ఎక్స్ ప్రెస్. ఈ రైలులో మంటల కాహుతైన అయోధ్య కరసేవకుల రియల్ స్టోరీగా చెబుతున్న ఈ సినిమా మార్చి 1, 2024న పెద్ద తెరపై విడుదల కానుంది. ఇందులో రణబీర్ షోరే, పంకజ్ జోషి వంటి ప్రతిభావంతులు నటించారు.

సబర్మతి ఎక్స్ ప్రెస్ లో జరిగిన అగ్నిప్రమాదం- ప్రమాదమా, లేక కుట్రా (యాక్సిడెంట్ ఆర్ కాన్‌స్పిరసీ) అనే అంశాన్ని లోతుగా పరిశోధించి తెరకెక్కించినట్టు మేకర్స్ చెప్పారు. ఇందులో రణ్‌వీర్ షోరే లాయర్ పాత్ర పోషించాడు. అతను గోద్రా రైలు అగ్నిప్రమాద బాధితుల తరపున ఉద్వేగభరితంగా పోరాటం చెస్తాడని మేకర్స్ వివరించారు. ఈ మూవీకి ఎంకే శివాక్ష్ దర్శకత్వం వహించారు. బీజే పురోహిత్ నిర్మించారు.

2002 ఫిబ్రవరి 27 న గోద్రా నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్ ప్రెస్ రైలులో జరిగిన అగ్ని ప్రమాదంలో 59 మంది కరసేవకులు మరణించారు. అయితే ఈ మూవీ గురించి వార్తలు గత మే నెలలోనే వెలువడ్డా, 'ది కేరళ స్టోరీ' సందడిలో పెద్దగా చర్చ జరగలేదు.

‘ది కేరళ స్టోరీ’ ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఇది రికార్డ్ బ్రేకింగ్ వసూళ్ళు సాధించింది. అయితే ఒక మతం పట్ల ప్రతికూల వైఖరి కారణంగా చాలా విమర్శల్ని ఎదుర్కోవలసి వచ్చింది. దీని తర్వాత ఇలాటిదే విభజన రాజకీయాల మతపరమైన ఎజెండాతో వచ్చిన ‘72 హూరియా’ 'అజ్మీర్ 92' రెండిటినీ ప్రేక్షకులు పట్టించుకోలేదు.

ఇప్పుడు గోద్రా సినిమా కూడా ఇదే ఎజెండాతో సరీగ్గా ఎన్నికల సమయంలో మార్చిలో విడుదలవుతోంది. ఒకవైపు ఎన్నికల్ని గెలవడానికి అయోధ్య టెంపుల్ ప్రారంభోత్సవ ఉత్సవాల్ని ఎన్నికల సమయం వరకూ కొనసాగించి భక్తివాతవరణాన్ని నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, మరోవైపు దీనికి తోడ్పాటుగా అదే సమయంలో వివాదాస్పద సినిమాతో వేడి పుట్టించాలని గోధ్రా సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ రెండిటి మధ్య సామాజిక- ఆర్ధిక- రాజకీయ న్యాయం కోరుతూ రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ న్యాయ్ యాత్ర మార్చి 10 వరకూ కొనసాగుతుంది.

2002 లో గుజరాత్ లో మతపరమైన అల్లర్లకి కూడా దారి తీసిన ఈ గోద్రా ఘటన ఉన్మాదం వల్ల జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా పక్కా ప్రణాళికతో జరిపించిన కుట్రనా అనేది సినిమా ద్వారా బయటపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు మేకర్స్ చెప్పారు. ఈ సినిమాని నానావతి కమీషన్ రిపోర్టు ఆధారంగా రూపొందించినట్టు తెలిపారు. మేకర్స్ అధికారిక నోట్‌లో ఇలా వుంది : ‘ఈ సినిమా అయిదేళ్ళూ చాలా కష్టపడి రీసెర్చి చేసి నిర్మించాం. మా రీసెర్చిలో చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి, వాటిని రుజువులతో సహా సినిమాలో చూపించాం’

అయితే కుట్ర కోణాన్ని నిర్ధారించిన నానవతి-షా కమిషన్ రిపోర్టు విమర్శలపాలైంది. అది ప్రమాదమని సూచించే ఫోరెన్సిక్ నివేదికకూ కమిషన్ రిపోర్టుకూ పొంతన లేదని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు తిప్పికొట్టాయి. క్రిస్టఫర్ జాఫ్రెలాట్ వంటి విద్యావేత్తల నుంచి కమిషన్ న్యాయ మార్గాన్ని అడ్డుకోవడం, కుట్ర సిద్ధాంతాన్ని చాలా త్వరగా సమర్ధించడం, సంఘటనలో ప్రభుత్వ సహకారపు సాక్ష్యాల్ని విస్మరించడం తీవ్ర విమర్శలకి దారితీశాయి. తీస్తా సెతల్వాడ్ నేతృత్వంలోని సిటిజన్స్ ట్రిబ్యునల్ సహా అనేక ఇతర స్వతంత్ర వ్యాఖ్యాతలు కూడా అగ్నిప్రమాదం దాదాపుగా ప్రమాదవశాత్తూ జరిగిందేనని నిర్ధారించారు. అప్పట్లో ‘తెహల్కా’ పత్రిక ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా చేసిన పరిశోధనతో వెలువరించిన 100 పేజీల ప్రత్యేక సంచికలో కూడా కుట్ర కోణాన్ని అంగీకరించలేదు.

2011 ఫిబ్రవరిలో, ట్రయల్ కోర్టు 31 మందిని దోషులుగా నిర్ధారించింది. 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ సంఘటనని ‘ముందస్తు ప్లాన్డ్ కుట్ర’ గా పేర్కొంది. దోషులుగా నిర్ధారించిన వారందరూ ముస్లింలు. నానావతి-షా కమిషన్ రిపోర్టుపై కోర్టు తీర్పు కొంత భాగం ఆధారపడి వుంది. అయినప్పటికీ, కమిషన్ ప్రధాన కుట్రదారుగా సమర్పించిన మౌల్వీ ఉమర్జీని, తగిన సాక్ష్యం లేని కారణంగా 62 మందితో పాటు అన్ని అభియోగాల నుంచి కోర్టు తొలగించింది. వీటన్నిటి దృష్ట్యా సినిమా ఇంకేం షాకింగ్ నిజాల్ని బయట పెట్టిందో చూడాలి.

‘కాశ్మీర్ ఫైల్స్’ సహా ఇలాటి ఎజెండా సినిమాలు విశ్వసనీయతకి దూరంగా అర్ధసత్యాలతో తీస్తున్నారని ఎక్కువ మంది విమర్శిస్తున్నారు.



First Published:  31 Dec 2023 8:48 AM GMT
Next Story