Telugu Global
Cinema & Entertainment

గాడ్ ఫాదర్ ట్రయిలర్ రివ్యూ

చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీ ట్రెయిలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ మెగా అభిమానులకు నచ్చిందా..

గాడ్ ఫాదర్ ట్రయిలర్ రివ్యూ
X

మలయాళంలో లూసిఫర్ సినిమా చూసిన ప్రేక్షకులకు గాడ్ ఫాదర్ ట్రయిలర్ కొత్తగా అనిపించకపోవచ్చు. ట్రయిలర్ చూసి సన్నివేశాలు కూడా ఊహించుకోవచ్చు. పైగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో లూసిఫర్ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉండడంతో చాలామంది ఆ సినిమా చూసేశారు. కానీ గాడ్ ఫాదర్ ట్రయిలర్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ కనిపించడంతో తెలుగు రీమేక్ పై ఆసక్తి పెరిగింది. మోహన్ లాల్ పాత్రలో చిరంజీవిని చూడాలనే కోరిక, తాజాగా రిలీజైన గాడ్ ఫాదర్ ట్రయిలర్ తో మరింత పెరిగింది.


సౌత్ లో ఇటు చిరంజీవి, అటు మోహన్ లాల్ ఇద్దరూ, దాదాపు ఒకే తరంలో సూపర్ స్టార్స్ గా ఎదిగారు. అటు మలయాళంలో మోహన్ లాల్ మెగాస్టార్ అయితే, ఇటు తెలుగులో చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. మోహన్ లాల్ చేసిన సినిమాను, తెలుగులో చిరంజీవి రీమేక్ చేయడం ఒక విధంగా గాడ్ ఫాదర్ ప్రాజెక్టుకు మంచి మైలేజ్ తీసుకొచ్చింది. ట్రయిలర్ రిలీజ్ తో ఆ క్రేజ్ మరింత పెరిగింది.


ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. రీమేక్ ప్రాజెక్టు అయినప్పటికీ తనదైన స్టయిల్, గ్రేస్ తీసుకొచ్చారు చిరంజీవి. ఆయన డ్రెస్సింగ్ స్టయిల్, లుక్స్ ట్రయిలర్ కు ఓ ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాయి. ఇక సల్మాన్ ఖాన్ ఎంట్రీతో ట్రయిలర్ నెక్ట్స్ లెవెల్ కు చేరుకుంది. చిరంజీవికి దారిస్తూ, సల్మాన్ ఖాన్ ఫైట్ చేసిన షాట్.. టోటల్ ట్రయిలర్ కు హైలెట్ గా నిలిచింది.


ట్రయిలర్ లో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చిరంజీవి డైలాగ్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉన్నాయి. రీమేక్ ప్రాజెక్ట్ అయినప్పటికీ, అమెజాన్ లో తెలుగు వెర్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ.. థియేటర్లకు వెళ్లి గాడ్ ఫాదర్ సినిమాను చూడాలనే ఉత్సుకతను పెంచింది ట్రయిలర్. మేకర్స్ ఉద్దేశం కూడా ఇదే. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి వస్తున్నాడు గాడ్ ఫాదర్.



First Published:  29 Sep 2022 8:40 AM GMT
Next Story