Telugu Global
Cinema & Entertainment

3 వేల కోట్ల నష్టంతో బాలీవుడ్ @ 2022

Bollywood flop movies list in 2022: 2022 లో బాలీవుడ్ నష్టం 3 వేల కోట్ల రూపాయలుగా తేలింది! పీవీఆర్ మల్టీప్లెక్స్ గ్రూపు సైతం సెప్టెంబర్ 30 త్రైమాసికానికి 53 కోట్లు నష్టాలు ప్రకటించింది.

Bollywood flop movies list in 2022
X

3 వేల కోట్ల నష్టంతో బాలీవుడ్ @ 2022 

2022 లో హిందీలో విడుదలైన 102 సినిమాల్లో ఐదే హిట్ కాగా మిగిలిన 97 ఫ్లాప్ అయ్యాయి. వీటిలో పేరున్న హీరోలవి 15. చిన్నాచితక 82. అమీర్ ఖాన్ నుంచీ ఆయుష్మాన్ ఖురానా వరకూ పేరున్న హీరోల బిగ్ బడ్జెట్ ప్రతిష్టాత్మక సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి.

2022 లో బాలీవుడ్ నష్టం 3 వేల కోట్ల రూపాయలుగా తేలింది! పీవీఆర్ మల్టీప్లెక్స్ గ్రూపు సైతం సెప్టెంబర్ 30 త్రైమాసికానికి 53 కోట్లు నష్టాలు ప్రకటించింది. 2020 నుంచీ 2022 వరకూ మూడేళ్ళూ బాలీవుడ్ నావ నష్టాల నదిలో మునకలేస్తూనే వుంది. మొదటి రెండేళ్ళూ కరోనా లాక్ డౌన్ తో, ఈ యేడు తెరుచుకున్న మార్కెట్లో భారీ ఫ్లాపులతో.

చాలా వరకూ లాక్ డౌన్ల పూర్వం ప్లాన్ చేసిన సినిమాలివి. మూడేళ్ళ తర్వాత ఈ కంటెంట్ రుచించలేదు ప్రేక్షకులకి. లాక్ డౌన్లలో వాళ్ళు ప్రపంచ సినిమాలు చూసి అభిరుచులు మార్చుకోవడంతో రెగ్యులర్ కమర్షియల్ హంగామాలు బోల్తా కొట్టాయి. వాటి వివరాలు చూద్దాం.

1. లాల్ సింగ్ చద్దా : ఇది 2022లో అత్యధికంగా ఆశలు పెట్టుకున్న ప్రతిష్టాత్మకాల్లో ఒకటి. అమీర్ ఖాన్, కరీనా కపూర్ లు నటించిన ఈ మూవీ హాలీవుడ్ క్లాసిక్, 'ఫారెస్ట్ గంప్' కి రీమేక్. బడ్జెట్ 180 కోట్లు, బాక్సాఫీసు 59.58 కోట్లు. దీని ఫ్లాప్ కి ప్రధానంగా బాయ్ కాట్ కాటు కారణమయింది.

2. సామ్రాట్ పృథ్వీరాజ్ : అక్షయ్ కుమార్ తో 175 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన చారిత్రకం 'సామ్రాట్ పృథ్వీరాజ్' 68.06 కోట్లు మాత్రమే రాబట్టి ఫ్లాపయ్యింది. పృథ్వీరాజ్ పాత్రకి మీసాలు తీసేయమంటే అక్షయ్ తీసేయలేదని ఫ్లాప్ కి కారణం చెబుతూ వాపోయాడు దర్శకుడు చంద్రప్రకాశ్ ద్వివేది.

3. రక్షా బంధన్ : అక్షయ్ కుమార్ ఖాతాలో రెండో ఫ్లాప్. బడ్జెట్ 100 కోట్లు, బాక్సాఫీసు 45.23 కోట్లు. ఇది రాఖీ పండగతో సిస్టర్ సెంటి మెంటు సినిమా. ఈ కాలంలో ఔట్ డెటెడ్ అయిపోయింది.

4. బచ్చన్ పాండే : అక్షయ్ కుమార్ మూడో ఫ్లాప్. కృతీ సానన్ హీరోయిన్ గా నటించిన ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ 165 కోట్లతో తీస్తే 49 కోట్లు ఆర్జించి పెట్టింది.

5. రామ్ సేతు : అక్షయ్ కుమార్ ఖాతాలో నాలుగో ఫ్లాప్. రామసేతు కాల్పనిక కథతో యాక్షన్ అడ్వెంచర్ గా తీసి రామ సేతు నిజమని నిరూపించారు. బడ్జెట్ 150 కోట్లు, బాక్సాఫీసు 92.94 కోట్లు. మొన్న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం రామ సేతు లేదని కొట్టి పారేసి, గౌతమ్ అదానికి శ్రీలంకకి సముద్ర మార్గం వేయడానికి కాంట్రాక్టు ఇచ్చేశామని ప్రకటించేసింది. దీనిమీద సోషల్ మీడియా భగ్గుమనలేదు. తమ ప్రభుత్వం కదా.

6. సర్కస్ : డిసెంబర్ చివరి వారంలో విడుదలైన 'సర్కస్' రణవీర్ సింగ్ తో రోహిత్ శెట్టి తీసిన ఫ్లాప్. 115 కోట్లు బడ్జెట్. నష్టం ఇంకా తేలలేదు. మొదటి రోజు 6.25 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సోమవారానికి 2.50 కోట్లు మాత్రమే వసూలు చేసి అతి పెద్ద ఫ్లాప్ గా తేలింది. రోహిత్ శెట్ట గరిష్ట సినిమాలు బ్లాక్ బస్టర్స్. 'గోల్ మాల్' సిరీస్ నుంచీ 'సింగం' వగైరా. పాత కథల్నే ఎవ్వరూ వూహించని కమర్షియల్ గిమ్మిక్కులు చేసి హిట్ చేస్తాడు. 'సర్కస్' 1960 ల నాటి పీరియడ్ కథతో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంతో తీశాడు. ఈసారి ఎందుకో గిమ్మిక్కులు తగ్గాయి.

7. జయేష్‌భాయ్ జోర్దార్ : రణ్‌వీర్ సింగ్ రెండో ఫ్లాప్. 86 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తే 16.59 కోట్లు వసూలు చేయగలిగింది.

8. రన్ వే 34 : అజయ్ దేవగన్ దర్శకత్వం వహించిన ఈ విమానయాన థ్రిల్లర్ లో ఈ అమితాబ్ బచ్చాన్, రకుల్ ప్రీత్ సింగ్ నటించారు. ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపు 65 కోట్లు ఖర్చు పెట్టారు. కేవలం 33.51 కోట్లు ఆర్జించారు.

9. షంషేరా : నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రణబీర్ కపూర్ తిరిగి వస్తూ నటించిన ఈ పీరియాడికల్ డ్రామా బడ్జెట్ 150 కోట్లు. అయితే కేవలం 41.5 కోట్ల రూపాయలు వసూలు చేసి 2022లో అతి పెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా తేలింది.

10. ఏన్ యాక్షన్ హీరో : వెరైటీ సినిమాలతో ఆయుష్మాన్ ఖురానా పాపులర్ అయ్యాడు. అయితే 'ఏన్ యాక్షన్ హీరో' తో రొటీన్ మసాలా నటించేసరికి 30 కోట్ల బడ్జెట్ కి 15.8 కోట్లు మాత్రమే రాబట్టి ఫ్లాపయ్యింది.

11. హీరో పంతి : అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన 'హీరోపంతి' లో యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, తారా సుతారియా నటించారు. దీని బాక్సాఫీసు 24.91 కోట్లు మాత్రమే నమోదైంది. బడ్జెట్ వచ్చేసి 70 కోట్లు.

12. ఢాకడ్ : ఇక వివాదాల రాణి కంగనా రణవత్ నటించిన 'ఢాకడ్' విషయం మరీ దారుణం. తన ట్విట్టర్ ఫాలోవర్స్ అయినా అందరూ చూడలేదని రుజువయింది. 85 కోట్లతో అట్టహాసంగా తీస్తే, రెండంటే 2.3 కోట్లు మాత్రమే జేబులో వేసుకుని దండం పెట్టారు నిర్మాతలు!

ఇంకా జాన్ అబ్రహాం 'ఎటాక్', రాజ్ కుమార్ రావ్ 'హిట్', వరుణ్ ధావన్ 'భేడియా' ఫ్లాప్స్ లిస్టులో వున్నాయి. మొత్తం 15 సినిమాలు పేరున్న హీరోలకి అప్రదిష్ట మిగిల్చాయి. టాప్ ఫ్లాప్ మాస్టర్ అవార్డు అక్షయ్ కుమార్ కివ్వొచ్చు అంటున్నారు. ఇంకా లాక్ డౌన్ పూర్వపు బ్యాక్ లాగ్ తో వస్తాడేమోనని భయపడుతున్నారు. అమీర్ ఖాన్ ప్రస్తుతానికి రాడు.

జనవరిలో కొత్త సంవత్సరాన్ని 'పఠాన్' తో ప్రారంభిస్తాడు. షారూఖ్ ఖాన్. దీనికి బాయ్ కాట్ గ్యాంగ్ కాటు వేయడానికి కాచుకుని వున్నారు. వీళ్ళ కోరికలు తీర్చడానికే బాలీవుడ్ సినిమాలు తీస్తున్నట్టుంది. 2023 ఎలా వుండబోతోందన్నది చూస్తేగానీ తెలియదు.

Bollywood hit movies in 2022: 2022 లో ఐదే హిందీ హిట్లు!

First Published:  29 Dec 2022 10:18 AM GMT
Next Story