Telugu Global
Cinema & Entertainment

డీజే టిల్లూ సీక్వెల్ టైటిల్ ఇదే

డీజే టిల్లూ హంగామా చూశాం, ఇప్పుడు దానికి డబుల్ హంగామాను చూడబోతున్నాం. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈ సినిమాకు సీక్వెల్ వస్తోంది.

డీజే టిల్లూ సీక్వెల్ టైటిల్ ఇదే
X

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన 'డీజే టిల్లు' ఈ ఏడాది ప్రారంభంలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత నాగవంశీ, సిద్ధుతో 'డీజే టిల్లు' సీక్వెల్ చేస్తామని చెప్పాడు. చెప్పినట్టుగానే 'డీజే టిల్లు' సీక్వెల్ ని రూపొందిస్తూ మాట నిలబెట్టుకున్నాడు.

'డీజే టిల్లు' సీక్వెల్ కి 'టిల్లు స్క్వేర్' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సీక్వెల్ లో సిద్ధుకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

'టిల్లు స్క్వేర్' షూటింగ్ ఇప్పటికే మొదలైంది. 2023 మార్చిలో సీక్వెల్ థియేటర్లలో సందడి చేయనుంది. 'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తూ దీపావళి కానుకగా ఒక ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. అందులో టిల్లు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ తో వాదన పెట్టుకోవడం నవ్వులు పూయించింది. రెండు నిమిషాల నిడివి గల వీడియోతో సీక్వెల్ లో 'డీజే టిల్లు'ని మించిన వినోదాన్ని పంచబోతున్నట్టు చెప్పకనే చెప్పేశారు.

'డీజే టిల్లు' టైటిల్ సాంగ్ ని స్వరపరిచి విశేషంగా ఆకట్టుకున్న రామ్ మిరియాల, సీక్వెల్ కు కూడా సంగీతం అందించే ఛాన్స్ కొట్టేశాడు. సినిమాటోగ్రాఫర్ గా సాయి ప్రకాష్, ఎడిటర్ గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్ గా ఏఎస్ ప్రకాష్ వ్యవహరిస్తున్నారు.



First Published:  24 Oct 2022 11:34 AM GMT
Next Story