Telugu Global
Cinema & Entertainment

‘యానిమల్’ తో వస్తున్న వంగా!

సందీప్ రెడ్డి రెండో తెలుగు సినిమా ఇంకా తీయలేదుగానీ, రెండో ‘అర్జున్ రెడ్డి’ మాత్రం హిందీలో తీశాడు. రెండో తెలుగు సినిమా కోసం టాలీవుడ్ లో విసిగిపోయి, బాలీవుడ్ వెళ్ళి ప్రసిద్ధ బ్యానర్ టీ సిరీస్ తో షాహీద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ రీమేకుగా ‘కబీర్ సింగ్’ తీశాడు.

‘యానిమల్’ తో వస్తున్న వంగా!
X

2017లో అతి పెద్ద హిట్ సినిమా ‘అర్జున్ రెడ్డి’ తీసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి రెండో తెలుగు సినిమా కోసం ఆరేళ్ళుగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. విజయ్ దేవరకొండతో అంత పెద్ద హిట్ కొట్టిన‌ దర్శకుడికి విచిత్రంగా టాలీవుడ్ లో ఆదరణ కరువైంది. స్టార్ లెవరూ సందీప్ రెడ్డితో సినిమా చేయడానికి ముందుకు రాలేదు. ఇదే సమయంలో కథలతో నిర్మాతల్ని సంప్రదించే దర్శకులకి ‘అర్జున్ రెడ్డి’ లాంటి కథే కావాలన్న డిమాండ్లు ఎదురయ్యాయి. ఒక సినిమా సంచలన హిట్టయితే అలాంటి సినిమానే తీయాలని నిర్మాతలకు ఉబలాటం ఉంటుంది. కానీ, ఇంకో ‘అర్జున్ రెడ్డి’ ఈ ఆరేళ్ళలో రాలేదు. అయితే ఒక కొత్త దర్శకుడు ‘అర్జున్ రెడ్డి’ లాంటి కథనే పట్టుకుని సుమారు ఐదేళ్లు ప్రయతించినా నిర్మాతలు దొరకలేదు. చివరికి ఒక చిన్న నిర్మాతతో కలిసి తానే నిర్మాతగా మారి సినిమా పూర్తి చేశాడు. దాని పేరు ‘సిద్ధార్థ్ రాయ్’ ఇదింకా విడుదల కావాల్సి వుంది. ఇదీ ‘అర్జున్ రెడ్డి’ తీసిన సందీప్ రెడ్డికి, ‘అర్జున్ రెడ్డి’ తో ఇతర దర్శకులకి అయిన అనుభవాలకీ సంబంధించిన పురాణం.

అలా సందీప్ రెడ్డి రెండో తెలుగు సినిమా ఇంకా తీయలేదుగానీ, రెండో ‘అర్జున్ రెడ్డి’ మాత్రం హిందీలో తీశాడు. రెండో తెలుగు సినిమా కోసం టాలీవుడ్ లో విసిగిపోయి, బాలీవుడ్ వెళ్ళి ప్రసిద్ధ బ్యానర్ టీ సిరీస్ తో షాహీద్ కపూర్ హీరోగా ‘అర్జున్ రెడ్డి’ రీమేకుగా ‘కబీర్ సింగ్’ తీశాడు. 2019 లో ఇది కళ్ళు తిరిగి కింద పడేంత హిట్టయింది. 60 కోట్ల బడ్జెట్ కి 380 కోట్ల బాక్సాఫీసు వచ్చింది! దీంతో సందీప్ రెడ్డి టాప్ బాలీవుడ్ దర్శకుడైపోయాడు.

బాలీవుడ్ లోనే 2021లో రెండో హిందీ సినిమా ‘యానిమల్’ ప్రారంభించాడు. ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో వుంది పబ్లిసిటీ పరంగా. ఆ తర్వాత ఇది నిర్మాణంలో వుండగానే ప్రభాస్ తో ‘స్పిరిట్’ ప్రకటించాడు. ఇది భారీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ. తెలుగు, హిందీతో బాటు ఇతర భాషల్లో వుంటుంది. దీని విడుదల 2024 లో వుంటుంది. అంటే సందీప్ రెడ్డి రెండో తెలుగు సినిమా ఏడేళ్ళ తర్వాత వస్తుందన్న మాట. అంతవరకూ తెలుగు ప్రేక్షకులు డిసెంబర్ లో రాబోతున్న హిందీ ‘యానిమల్’ తో సరిపెట్టుకోక తప్పదు. ‘యానిమల్’ హిందీతో బాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వుంటుంది.

రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ ఆగస్టులోనే విడుదల కావాలి. సీజీ వర్క్ సంతృప్తి కరంగా రానందువల్ల వాయిదా పడింది. సీజీ వర్క్ సంతృప్తి కరంగా రాలేదని విడుదల వాయిదా వేసి సీజీ రీవర్క్ చేయడం పరిపాటి అయింది. ‘ఆదిపురుష్’ తో, ‘సాలార్’ తో ఇదే జరిగింది. ఆలస్యానికి మరో కారణం పాటల డబ్బింగ్ అని చెప్తున్నారు.

సినిమాలో 7 పాటలున్నాయి. అన్ని పాటల్ని ఐదు భాషల్లోకి డబ్ చేయాలంటే అవి 35 పాటలవుతాయి. అవి డబ్బింగ్ పాటలన్పించకుండా ఏ భాషకా భాష ఒరిజినల్ పాటలన్పించేలా సాహిత్యం, గానం వుండేలా శ్రద్ధ తీసుకుంటున్నాడు సందీప్ రెడ్డి.

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ తీసి మళ్ళీ దాన్నే హిందీలో రీమేక్ చేసిన తర్వాత సందీప్ రెడ్డి నుంచి ఫ్రెష్ కథ ఎలా వుంటుందన్న ఆసక్తితో ప్రస్తుతం గమనిస్తోంది బాలీవుడ్. తెలుగు ప్రేక్షకులు కూడా. ఇది పూర్తిగా హార్డ్ కోర్ యాక్షన్ మూవీ. గ్యాంగ్ స్టర్ డ్రామా. అండర్ వరల్డ్ లో తీవ్ర హింసా రక్తపాతాల నేపథ్యంలో తండ్రీ కొడుకుల సంబంధం చుట్టూ తిరిగే కథ. ఇది చివరికి హీరో (రణబీర్ కపూర్) సైకోపాత్ గా మారడానికి దారి తీస్తుంది. ఎటు తిరిగీ ఇతను కూడా ఒక రకమైన అర్జున్ రెడ్డినే అన్నమాట.

ఇందులో రణ్‌బీర్ కపూర్ తో బాటు రష్మిక మందన్న, అనిల్ కపూర్, బాబీ డియోల్, శక్తి కపూర్ తదితరులు నటించారు. సంగీతం మనన్ భరద్వాజ్- హర్షవర్ధన్ రామేశ్వర్; ఛాయాగ్రహణం అమిత్ రాయ్, బ్యానర్స్ టీ సిరీస్, భద్రకాళీ సినిమాస్, సినీ 1 స్టూడియోస్; నిర్మాతలు భూషణ్ కుమార్, కృషన్ కుమార్, మురాద్ ఖేతానీ, అశ్విన్ వర్దే, ప్రణయ్ రెడ్డి వంగా, సందీప్ రెడ్డి వంగా. విడుదల డిసెంబర్ 1, ౨౦౨౩


First Published:  21 Sep 2023 7:17 AM GMT
Next Story