Telugu Global
Cinema & Entertainment

గుట్కా యాడ్స్‌తో రూ.కోట్లు.. సినిమాలపై వారికిష్టం లేదు.. బాలీవుడ్ హీరోలపై డైరెక్టర్ ఫైర్..!

బాలీవుడ్‌లో ఐదారుగురు పెద్ద హీరోలు ఉన్నారని.. వీరికి ఒక గుట్కా యాడ్ చేస్తే రూ.50 కోట్లు వస్తాయని దర్శకుడు ప్రకాష్ ఝా సెటైర్ వేశారు. అందువల్ల వారు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు.

గుట్కా యాడ్స్‌తో రూ.కోట్లు.. సినిమాలపై వారికిష్టం లేదు.. బాలీవుడ్ హీరోలపై డైరెక్టర్ ఫైర్..!
X

బాలీవుడ్ హీరోలకు సినిమాలు చేయడం కన్నా గుట్కా యాడ్స్‌లో నటించడమే ఇష్టమని.. ఆ యాడ్స్‌తో రూ. కోట్లు వస్తుంటే సినిమాలపై ఆసక్తి ఎలా ఉంటుందని బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా సెటైర్ వేశారు. సమాజంలోని సమస్యలు ఇతివృత్తంగా సినిమాలు చేస్తాడని ప్రకాష్ ఝాకు ఇండస్ట్రీలో పేరుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన రాజ్ నీతి, అరక్షణ్, గంగాజల్ సినిమాలు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్నాయి. కాగా ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. వరుసగా ప్లాప్‌లు వస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి.

సరైన సినిమాలు తీయలేకపోతున్నారని బాలీవుడ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ హీరోలపై విమర్శలు చేశాడు. బాలీవుడ్ లో ఐదారుగురు పెద్ద హీరోలు ఉన్నారని.. వీరికి ఒక గుట్కా యాడ్ చేస్తే రూ.50 కోట్లు వస్తాయన్నారు. అందువల్ల వారు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదన్నారు. గుట్కా యాడ్స్ చేయడానికే వాళ్లకు సమయం సరిపోతోంది.. ఇక సినిమాలు చేయడానికి సమయం ఎక్కడిదని విమర్శించారు.

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి కార్పొరేట్స్ ప్రవేశించారని.. వారు ముందు కథ సిద్ధం చేసుకోకుండా స్టార్ హీరోల డేట్స్ తీసుకొని సంతకాలు చేయించుకుంటున్నారన్నారు. హీరోలు ఒప్పుకున్న తర్వాత కథల కోసం వెతుకుతున్నారని.. వారికి సమయానికి ఏ కథ దొరక్క ఇతర భాషల నుంచి రీమేక్ రైట్స్ కొనుగోలు చేస్తున్నారన్నారు. గత కొన్నేళ్లుగా పరిస్థితి ఇదే విధంగా ఉందన్నారు.

ఇలా హీరోల డేట్స్ దొరికాయని.. హడావుడిగా సినిమాలు చేస్తే ఫలితం ప్లాప్ కాక మరేమిటని ప్రశ్నించారు. గతంలో ఈ ఫీల్డ్‌లో ఉన్నవారు సినిమా కోసం ఏమైనా చేసేవారని, ఎంతో ఉత్సాహంగా పని చేసేవారన్నారు. ప్రస్తుతం ఆ రోజులు లేవన్నారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ అంతా కూర్చుని ఆలోచిస్తే బాలీవుడ్ పరిస్థితి మారే అవకాశం ఉందని ప్రకాష్ ఝా వ్యాఖ్యానించారు.

First Published:  19 Sep 2022 12:21 PM GMT
Next Story