Telugu Global
Cinema & Entertainment

TFCC Elections | హోరాహోరీ పోరులో గెలుపు దిల్ రాజుదే

Dil Raju TFCC Elections - తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికయ్యారు. ఆయన రాకతో ఛాంబర్ లో సమూల మార్పులు వస్తాయని భావిస్తున్నారు చాలామంది.

TFCC Elections | హోరాహోరీ పోరులో గెలుపు దిల్ రాజుదే
X

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికయ్యారు. ఆ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. దిల్ రాజు ప్యానెల్, సి.కల్యాణ్ ప్యానెల్ మధ్య హోరాహోరీగా సాగిన ఈ అధ్యక్ష ఎన్నికల్లో తుది విజయం దిల్ రాజునే వరించింది.

ఫిలింఛాంబర్ లో మొత్తంగా 4 సెక్టార్లు ఉంటాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, స్టుడియో సెక్టార్.. ఈ నాలుగు సెక్టార్ల నుంచి 1567 మంది సభ్యులు ఛాంబర్ లో కొనసాగుతున్నారు. వీళ్ల నుంచి ఈరోజు 891 ఓట్లు పోలయ్యాయి. గతేడాదితో పోలిస్తే, పోలింగ్ శాతం భారీగా పెరిగింది.

తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ఒక నిర్మాతకు ఒక ఓటు అనే పద్ధతి లేదు. ఒక బ్యానర్ కు ఒక ఓటు అనే పద్ధతి నడుస్తోంది. ఉదాహరణకు ఓ నిర్మాతకు 5 బ్యానర్లు ఉంటే, అతడు 5 సార్లు ఓటు వేయొచ్చన్నమాట. అలా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 1060 ఓట్లు పోలయ్యాయి. 891 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. వీటిలో దిల్ రాజుకు 563 ఓట్లు రాగా.. సి.కల్యాణ్ కు 497 ఓట్లు వచ్చాయి.

నాలుగు సెక్టార్లకు నలుగురు ఛైర్మన్లు ఎన్నికయ్యారు. వీళ్లలో ముఖ్యంగా చూసుకుంటే, స్టుడియో సెక్టార్ చైర్మన్ గా ఛారి, ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఛైర్మన్ గా శివలెంక కృష్ణప్రసాద్, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ ఛైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్ ఎంపికయ్యారు. వీళ్లలో కీలకమైన ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఛైర్మన్ ఎంపిక ఉత్కంఠ రేపింది.

ఈ సెక్టార్ లో దిల్ రాజు ప్యానెల్ కు 10 ఓట్లు, సి.కల్యాణ్ ప్యానెల్ కు 10 ఓట్లు వచ్చాయి. దీంతో ఛైర్మన్ ను నిర్ణయించేందుకు టాస్ వేశారు. అలా అదృష్టం దిల్ రాజు ప్యానెల్ కు చెందిన శివలెంక కృష్ణప్రసాద్ ను వరించింది.

ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఎన్నికవ్వగా.. ఉపాధ్యక్షుడిగా ముత్యాల రాందాస్, జనరల్ సెక్రటరీగా దామోదర ప్రసాద్, ట్రెజరర్ గా ప్రసన్నకుమార్ ఎంపికయ్యారు. దిల్ రాజు మినహా.. మిగతా ముగ్గురూ ఫిలింఛాంబర్ వ్యవహారాల్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తులే.

దిల్ రాజు రాకతో ఛాంబర్ వ్యవహారాల్లో సమూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కు పెద్ద పీట వేసే అవకాశం ఉంది. గతంలో దిల్ రాజు అధ్యక్షతన యాక్టివ్ ప్రొడ్యూసర్లతో ఎలాగైతే గిల్డ్ ఏర్పాటుచేశారో.. ఈసారి ఫిలింఛాంబర్ నేతృత్వంలో అలాంటి గిల్డ్ ను ఏర్పాటుచేయాలనేది దిల్ రాజు ఆలోచన. దీంతో పాటు, బ్యానర్లతో సంబంధం లేకుండా, ఒక నిర్మాతకు ఒక ఓటు మాత్రమే వేసే విధానం అమలు చేయాలని కూడా దిల్ రాజు భావిస్తున్నారు.

First Published:  30 July 2023 5:31 PM GMT
Next Story