Telugu Global
Cinema & Entertainment

Varasudu Movie: ఎట్టకేలకు తగ్గిన దిల్ రాజు.. వారసుడు రిలీజ్ వాయిదా

Vijay's Varasudu Movie Release Date: వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుపై విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వారసుడు సినిమా విడుదలను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు ఇవాళ ప్రకటించారు.

Varasudu Movie Release Date
X

Varasudu Movie: ఎట్టకేలకు తగ్గిన దిల్ రాజు.. వారసుడు రిలీజ్ వాయిదా

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం తమిళ అగ్ర హీరో విజయ్‌తో వారసుడు అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో విడుదల విషయమై దిల్ రాజు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సంక్రాంతికి తెలుగులో నిర్మించిన పలు భారీ బడ్జెట్ సినిమాలు విడుదల కావలసి ఉండగా .. పలు కారణాల వల్ల చాలా సినిమాలు విడుదల వాయిదాపడ్డాయి.

అయితే చివరికి చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి, తమిళ హీరో విజయ్ నటించిన వారసుడు సంక్రాంతి పోటీలో నిలిచాయి. అయితే అందరికంటే ముందుగా నిర్మాత దిల్ రాజు తాను నిర్మిస్తున్న వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే అదే రోజున బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కూడా విడుదలవుతుందని నిర్మాతలు ప్రకటించగా.. వాల్తేరు వీరయ్య సినిమాను 13న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు నిర్ణయించారు. అయితే దిల్ రాజు అటు నిర్మాతగా ఉంటూనే డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో థియేటర్లు దిల్ రాజు హ్యాండోవర్‌లో ఉన్నాయి.

ఇదిలా ఉండగా..సంక్రాంతికి వస్తున్న చిరంజీవి, బాలకృష్ణ సినిమాల కంటే తన సినిమాకి దిల్ రాజు ఎక్కువ థియేటర్లు కేటాయించుకున్నారని విమర్శలు మొదలయ్యాయి. దానికి తోడు మల్టీప్లెక్స్ లు, భారీ స్క్రీన్లు, మంచి థియేటర్లుగా పేరున్న వాటినన్నింటిని దిల్ రాజు వారసుడు సినిమాకు కేటాయించారు. ఇటీవల వారసుడు విడుదల అవుతున్న థియేటర్ల జాబితా బయటకు రావడంతో అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ దిల్‌ రాజుపై భగ్గుమన్నారు.

తెలుగు అగ్ర హీరోల సినిమాలు విడుదలవుతుంటే వారు నటిస్తున్న సినిమాలకు తక్కువ సంఖ్యలో థియేటర్లు ఇస్తూ.. వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించుకోవడంపై విమర్శలు చేశారు. సంక్రాంతికి తెలుగులో విడుదలవుతున్న రెండు సినిమాలను ఆదరిద్దామని.. అరవ సినిమా మనకు అక్కర్లేదని సోషల్ మీడియా వేదికగా చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ పోస్ట్‌లు చేయడం మొదలుపెట్టారు. ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.

అటు టాలీవుడ్ నిర్మాతల మండలి కూడా తమిళ హీరో నటించిన చిత్రం కోసం చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు నటిస్తున్న సినిమాలకు తక్కువ థియేటర్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇన్ని విమర్శలు వచ్చినప్పటికీ దిల్ రాజు వెనక్కి తగ్గలేదు. వారసుడు తమిళ మూవీ అయినప్పటికీ నిర్మించింది తానేనని.. తన హ్యాండ్ ఓవర్‌లో ఉన్న థియేటర్లలో తన సినిమాను విడుదల చేసుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు.

అయితే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది సోషల్ మీడియా వేదికగా దిల్ రాజుపై విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలో వారసుడు సినిమా విడుదలను 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు ఇవాళ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలను దృష్టిలో పెట్టుకొని తమ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. సినీ ఇండస్ట్రీలోని పలువురు పెద్దలతో మాట్లాడిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. ఒక అడుగు వెనక్కి వేశాననే బాధ తనకు లేదని తెలిపాడు. వారసుడు సినిమాపై తమకు 100 శాతం నమ్మకం ఉందని ఆ సినిమాను ఎప్పుడు విడుదల చేసినా కచ్చితంగా విజయం సాధిస్తుందని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా వారసుడు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కొంత పెండింగ్‌లో ఉందని.. ఈ సినిమా రిలీజ్ వాయిదాకు ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది.

First Published:  9 Jan 2023 7:35 AM GMT
Next Story