Telugu Global
Cinema & Entertainment

మాట మార్చిన దిల్ రాజు

టికెట్ రేట్లు తగ్గిస్తామని మొన్న మీడియాతో చెప్పాడు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో తన మాటల్ని వక్రీకరించారని అన్నారు రాజు.

మాట మార్చిన దిల్ రాజు
X

థాంక్యూ సినిమాను తక్కువ టికెట్ రేట్లలో చూడొచ్చని ప్రేక్షకులు ఆశపడ్డారు. ఆ ఆశ కల్పించిన వ్యక్తి స్వయంగా దిల్ రాజు. తన సినిమాను తెలంగాణ సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలకే చూడొచ్చని, మల్టీప్లెక్సుల్లో 150 రూపాయలకే చూడొచ్చని ఊరించాడు రాజు. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడమే తన ధ్యేయమని, అందుకే తక్కువ టికెట్ రేట్లు పెడుతున్నామని ప్రకటించాడు.

కట్ చేస్తే.. నిన్నట్నుంచి ఆన్ లైన్ లో థాంక్యూ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. చూస్తే టికెట్ రేట్లు తక్కువేం లేవు. ఎప్పట్లానే 175, 250 రూపాయలు కనిపించాయి. ఇదే విషయంపై ఈరోజు జరిగిన థాంక్యూ ప్రెస్ మీట్ లో మీడియా దిల్ రాజును ప్రశ్నించింది. అప్పుడు 100, 150 రేట్లు చెప్పిన దిల్ రాజు, ఈరోజు ప్లేటు ఫిరాయించాడు. అప్పుడు తను అలా చెప్పలేదన్నాడు. పైపెచ్చు ఈ రేట్లకు జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకున్నారు.

"నేను చెప్పింది మీడియా మిత్రులు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎఫ్3 టైమ్ లోనే రేట్లు తగ్గించాం. దాని తర్వాత మేజర్, విక్రమ్ సినిమాలకు దాదాపు మిడ్-రేంజ్ రేట్లు ఫిక్స్ చేశారు. థాంక్యూకు కూడా ఆ సినిమాల రేట్లే పెట్టాం. ఈ సినిమాకు హైదరాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు పెట్టాం. మల్టీప్లెక్సుల్లో 200 రూపాయలు పెట్టాం. జీఎస్టీ కూడా ఇందులోనే కలిపి ఉంటుంది. మేజర్, విక్రమ్ సినిమాలకు ఉన్న రేట్లే థాంక్యూకు పెట్టాం."

ఇలా తన సినిమాకు పెట్టిన టికెట్ రేట్లను కవర్ చేసుకున్నారు రాజు. గతంలో వంద రూపాయలు చెప్పి, ఇప్పుడు 150 అన్నారు. మల్టీప్లెక్సుల్లో 150 చెప్పి, 200 చేశారు. థాంక్యూ సినిమాకే కాదు, ఇకపై రాబోయే మీడియం రేంజ్ సినిమాలకు ఇవే రేట్లు ఉంటాయని, ఈ మేరకు నిర్మాతలమంతా మాట్లాడుకున్నామని కూడా దిల్ రాజు తేల్చేశారు.

నిన్న థాంక్యూ సినిమాకు టికెట్స్ ఓపెన్ చేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. ప్రసాద్ ఐమ్యాక్స్ లాంటి క్రేజ్ ఉన్న స్క్రీన్స్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ చాలా తక్కువగా సాగుతున్నాయి.

First Published:  20 July 2022 12:16 PM GMT
Next Story