Telugu Global
Cinema & Entertainment

సినిమాల కష్టం ఛానెళ్ళ కొచ్చింది!

కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి సినిమాల పరిస్థితి ఎలా వుందో టీవీ ఛానెళ్ళ పరిస్థితీ అలాగే వుందని నివేదికలు వెలువడుతున్నాయి. సినిమాలొక్కటే సంక్షోభంలో లేవని, ఛానెళ్ళూ మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయనీ నివేదికల ద్వారా తెలుస్తోంది.

సినిమాల కష్టం ఛానెళ్ళ కొచ్చింది!
X

సినిమాల కష్టం ఛానెళ్ళ కొచ్చింది!

కోవిడ్ మహమ్మారి తర్వాత నుంచి సినిమాల పరిస్థితి ఎలా వుందో టీవీ ఛానెళ్ళ పరిస్థితీ అలాగే వుందని నివేదికలు వెలువడుతున్నాయి. సినిమాలొక్కటే సంక్షోభంలో లేవని, ఛానెళ్ళూ మనుగడ కోసం పోరాటం చేస్తున్నాయనీ నివేదికల ద్వారా తెలుస్తోంది. రెండిటికీ ప్రేక్షకులు కరువవుతున్నారు. నిజానికి 2020లో కోవిడ్ మహమ్మారి మొదటి 12 నెలలు వార్తా ఛానెళ్ళని విజేతలుగా, సినిమా హాళ్ళని పరాజయ కేంద్రాలుగా నిలబెట్టాయి. మరి ఇప్పుడు ప్రేక్షకులు ఛానెళ్ళు చూడక, సినిమాలూ చూడక ఏం చేస్తున్నట్టు?

రాబోయే రోజుల్లో ప్రధాన స్రవంతి మీడియా సోషల్ మీడీయానే అవుతుందని 'ఆంధ్రజ్యోతి' అధిపతి వేమూరి రాధాకృష్ణ ఒకసారి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి వెలువడే 4 పీఎమ్ అనే హిందీ యూట్యూబ్ ఛానెల్ వ్యాఖ్యాత, టీవీ కూడా యూట్యూబ్ లో కొచ్చేసిందని అనడం చూస్తే- టీవీలు ప్రేక్షకుల అరచేతిలో, సినిమహాళ్ళూ ప్రేక్షకుల అరచేతిలో సెల్ ఫోన్ల రూపం లోకొచ్చేశాక ఇప్పుడేం చేయాలి?

కోవిడ్ మొదటి సంవత్సరంలో, ప్రాణాంతక వైరస్ గురించి సమాచారాన్ని పొందడానికి, తమ చుట్టూ ఏం జరుగుతోందో అర్థం చేసుకోవడానికీ, ప్రజలు న్యూస్ ఛానెళ్ళకి అతుక్కుపోయారు. కోవిడ్ ఒక భారీ బ్లాక్ బస్టర్ ఈవెంట్. ఇది ప్రేక్షకుల్ని టీవీ వార్తలకి అతుక్కుపోయేలా చేసింది. వార్తా ఛానెళ్ళ రిపోర్టర్లు, కెమెరామెన్‌లు, న్యూస్‌రూమ్ సిబ్బందీ ఓవర్‌టైమ్ పని చేయడంతో మహమ్మారి వార్తల్ని రియల్ టైమ్ లో ప్రజలకి అందుతూ వచ్చాయి.

దీనికి విరుద్ధంగా, ఆంక్షల కారణంగా సినిమా హాళ్ళు మూతబడ్డాయి. దీంతో ఎక్కడో అనామకంగా వున్న ఓటీటీ వేదికలు వినోదానికి ప్రధాన కేంద్రంగా మారాయి. ఈ వేదికలు అనేక కొత్త, ఆసక్తికర కంటెంట్‌ని అందించాయి. వీక్షకులు సురక్షితంగా ఇంట్లో కూర్చుని ఇలా సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు.

ఇక కోవిడ్ జెండా ఎత్తేసి తిరిగి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం మొదలెట్టింది. పెళ్ళి వేడుకలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్‌లు, మాల్స్, పార్టీలు, స్కూళ్ళూ, ఆఫీసులూ అన్నీ తిరిగొచ్చినా ప్రేక్షకులు టీవీలకి, సినిమా హాళ్ళకీ తగ్గిపోయారని నివేదికలు తెలుపుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి తీవ్ర స్థాయిలో కనిపించింది. విడుదలవుతున్న బాలీవుడ్ సినిమాలు ప్రేక్షకులు లేక భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి.

ఇదే దక్షిణ రాష్ట్రాల్లో సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి హిట్లు కొడుతూ బంగారు పంట పండించుకున్నాయి. బ్లాక్‌బస్టర్‌లతో దూసుకెళ్ళాయి. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాయి. వీటిని చూసేందుకు ప్రేక్షకులు పెద్దఎత్తున థియేటర్లకి తరలిరావడంతో థియేటర్ల లో రికార్డు స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదయింది. ఆర్ ఆర్ ఆర్, పొన్నియిన్ సెల్వన్ 1, పుష్ప మొదలైనవి గత రికార్డుల్ని మించి పోయాయి. బాలీవుడ్ సినిమాలు వీటి దరిదాపుల్లో కూడా లేవు. బాలీవుడ్ వైభవమంతా ఏమైపోయిందని తలలు పట్టుకున్న పరిస్థితి.

ఇంతలో, సమాంతరంగా వార్తా ఛానెళ్ళు మంచి పనితీరునే కొనసాగించాయి. వాటి ఆదాయాలు స్థిరంగానే కొనసాగాయి. వాస్తవానికి కోవిడ్ మొదటి 21 నెలల్లో ఆదాయాలు పెరిగాయి కూడా. అయితే, ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత నుంచి కొన్ని ప్రముఖ వార్తా ఛానెళ్ళ వీక్షకుల సంఖ్య పడిపోయింది.

ఇదో చారిత్రక సందర్భం. దీన్ని పరిశీలిస్తే, టీవీ వార్తల వ్యాపారం క్రైమ్, క్రికెట్, సినిమా, కాకిగోల అనే నాలుగు అంశాలపై ఆధారపడి వుంది. కాకిగోల అంటే డిబేట్ల పేరుతో అరుచుకునే అరుపులు. మరి ఇదంతా ఏమైంది? వీటికెందుకు ప్రేక్షకులు కరువవుతున్నారు?

టీవీ వార్తల ప్రేక్షకులు పెరగకపోవడానికి, ప్రేక్షకుల్ని సినిమా హాళ్ళకి రప్పించలేకపోవడానికీ కారణాలు ఒకటే. వీటిని నివేదికలు ఇలా పేర్కొన్నాయి- రొటీన్ కంటెంట్, ఫ్రెష్ ప్రెజెంటేషన్ లోపించడం, మూస కంటెంట్‌ పైనే పెట్టుబడి పెట్టడం వంటి పాత సూత్రాలకు కట్టుబడి వుండడం. సినిమాలు, న్యూస్ టీవీలు రెండింటికీ వీటి నించి విముక్తి కలిగి, కంటెంట్ పునరావిష్కరణ జరగాలి.

కొత్త ఛాలెంజీల్ని కొత్త టాలెంట్స్ తోనే ఎదుర్కోగలరు. ఆలోచనలకి, మరింత విశ్వసనీయతకీ అవకాశమివ్వాలి. కంటెంట్‌తో ప్రయోగాలు, సాహసోపేత కంటెంట్ ఇవీ నేటి మార్కెట్ అవసరాలు. సినిమాల్లో, న్యూస్ టీవీ డొమైన్‌లో యువ నాయకత్వం అవసరం. షార్ట్ కట్స్ ని నమ్మడం మానేయాలి. న్యూస్ టీవీల్లో, కొంతమంది న్యూస్ టీవీ ప్రసారకర్తలు తమ రేటింగ్స్ గురించి గొప్పలు పోతారు. నిజానికి ల్యాండింగ్ పేజీలలో వారు చేసే శ్రమ ఫలితమే ఆ రేటింగ్స్ తప్ప, కంటెంట్ లేదా మార్కెటింగ్ నుంచి వచ్చే రేటింగ్స్ కావవి. సినిమాల విషయానికొస్తే, పెద్ద స్టార్లు, పెద్ద దర్శకులు, సేఫ్ స్క్రిప్టులు షార్ట్ కట్లు.

ఛానెళ్ళ, సినిమాల ప్రేక్షకులు కొత్త రక్తం రుచి మరిగారు. ఈ వీక్షకులు వార్తల స్టార్టప్‌ల నుంచి ఆన్‌లైన్‌లో వీడియో కంటెంట్‌ని వీక్షిస్తున్నారు. ఈ డిజిటల్ కంటెంట్ బోల్డ్ గా, నిజాయితీగా వుంటోంది. సినిమాలకి కూడా ఇదే వర్తిస్తుంది - కొత్త దర్శకులు బోల్డ్ థీమ్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకునే నిషిద్ధ సమస్యల్ని ఎంచుకుంటున్నారు.

ఎటొచ్చీ ఇంటర్నెట్ ఆధారిత మీడియాగా ఛానెళ్ళు, సినిమాలూ మార్పు చెందాయని అర్ధం జేసుకోవాలి. ఇవి అరచేతిలో కొచ్చేశాయి. ఛానెళ్ళు యూట్యూబ్ లోనే లభ్యమవుతున్నప్పుడు టీవీల్లో దేనికి చూస్తారని పైన చెప్పుకున్న 4 పీఎం వ్యాఖ్యాత పేర్కొన్నాడు. టీవీల విషయం ఏమోగానీ, సినిమాల్ని ప్రేక్షకుల అరచేతిలోంచి తీసికెళ్ళి తిరిగి సినిమా హాళ్ళల్లో పునర్ స్థాపించాలంటే కంటెంట్ తో పెద్ద ప్రణాళికాలే చేపట్టాలి.

First Published:  8 Dec 2022 7:08 AM GMT
Next Story