Telugu Global
Cinema & Entertainment

హిందీ ప్రేక్షకుల్లో తెలుగు సినిమాల క్రేజ్ తగ్గినట్టేనా?

నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా నిర్మాతలు హిందీ డబ్బింగ్ రైట్స్ తో కోట్లు ఆర్జించారు. ఇంకా తెలుగు పానిండియా సినిమాలకి పూర్వం హిందీ ప్రాంతీయ టీవీ ఛానెల్స్ లో తెలుగు డబ్బింగ్ సినిమాల హవా బాగా కొనసాగింది.

హిందీ ప్రేక్షకుల్లో తెలుగు సినిమాల క్రేజ్ తగ్గినట్టేనా?
X

నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమా నిర్మాతలు హిందీ డబ్బింగ్ రైట్స్ తో కోట్లు ఆర్జించారు. ఇంకా తెలుగు పానిండియా సినిమాలకి పూర్వం హిందీ ప్రాంతీయ టీవీ ఛానెల్స్ లో తెలుగు డబ్బింగ్ సినిమాల హవా బాగా కొనసాగింది. సోనీ, జీ, కలర్స్, స్టార్, యూటీవీ వంటి ఛానెళ్ళు తెలుగు డబ్బింగ్ సినిమాల్ని మంచి రేట్లకి కొనుగోలు చేసేవి. అయితే రాను రాను వాటి కంటెంట్ లో మార్పు లేకుండా ఒకే తరహా మూస సినిమాలుగా వస్తూ వుండడంతో ఛానెళ్ళ రేటింగ్స్ పడిపోయాయి. మధ్యాహ్నమైతే చాలు, టీవీల్లో తెలుగు డబ్బింగ్ మాస్ మసాలా సినిమాల్ని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఇక తగ్గిపోయారు. దీంతో తెలుగు కంటే తక్కువ రేట్లకే తమిళ మలయాళ కన్నడ సినిమాలు కొనుగోలు చేయడం మొదలెట్టాయి ఛానెల్స్. దీంతో తెలుగు సినిమాల హిందీ డబ్బింగుల హవా ఇప్పుడు స్తంభించి పోయింది.

హిందీ ఛానెల్స్ ని ఆసక్తిగా చూసే ఎవరైనా, ప్రతిరోజూ 10 నుంచి 12 తెలుగు డబ్బింగ్ సినిమాల్లో తెలుగు స్టార్లు హిందీ పంచ్‌ డైలాగులు కొట్టడం, గూండాల్ని వంగోబెట్టి చితగ్గొట్టడం ఎంజాయ్ చేయకుండా లేరు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ డేర్-డెవిల్ స్టంట్స్ తో హిందీ ప్రేక్షకుల్ని అలరించకుండా లేరు. బ్రహ్మానందం కామెడీని మజా చేయకుండా లేరు. మొదట ఈ డబ్బింగ్ సినిమాలతో పొందిన గుర్తింపుతోనే తర్వాత ప్రభాస్ అయినా, అల్లు అర్జున్ అయినా, రామ్ చరణ్, ఎన్టీఆర్ లయినా పానిండియా సినిమాలతో పానిండియా స్టార్లు అవగల్గారు. స్టార్లని ఇంత ప్రమోట్ చేసిన ఇలాటి తెలుగు డబ్బింగుల క్రేజ్ ఇప్పుడు పడిపోయింది.

స్టార్ సినిమాలకే కాదు - క్రైం, యాక్షన్ తో కూడిన తెలుగు చిన్న సినిమాలకి కూడా హిందీ డబ్బింగ్ మార్కెట్ వుండేది. కాకపోతే వాటిలో నాల్గైదు మర్డర్లు, ఆరు సుదీర్ఘంగా సాగే ఫైట్లు వుండాలి. వీటిని బి సి సెంటర్స్ లో ప్రదర్శించి సొమ్ము చేసుకునేవారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. అయితే ఇప్పుడు స్టార్ సినిమాల డబ్బింగ్ రైట్స్ కొనుగోళ్ళు ఆగిపోయాక, చిన్న సినిమాలకీ ఇదే పరిస్థితి తలెత్తింది.

తెలుగు స్టార్ సినిమాల హిందీ డబ్బింగులకి డిమాండ్ వున్నప్పుడు నిర్మాతలు విపరీతంగా రేట్లు పెంచేసి లాభపడ్డారు. 22 కోట్ల వరకూ ఈ రేటు పెరిగిందని చెబుతున్నారు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు పరిస్థితి తయారయింది. పాన్-ఇండియన్ టీవీ స్క్రీన్ వీక్షకుల్లో తెలుగు స్టార్స్ కి డిమాండ్ వుందనీ, అయితే నిర్మాతల అత్యాశతో బాటు, రిపీట్ కంటెంట్ వ్యాపారాన్ని దెబ్బతీసిందనీ ముంబాయి శాటిలైట్ రైట్స్ డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నారు.

పానిండియాలదీ ఇదే పరిస్థితి!

ఇంతేకాదు, తెలుగు పానిండియా సినిమాలదీ ఇదే పరిస్థితి. బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, పుష్ప-1, కార్తికేయ-2, విరూపాక్ష మినహా తెలుగు పానిండియా లేవీ వర్కౌట్ కాలేదు. ఐదు పది కోట్లతో తీసిన తెలుగు సినిమాల్ని కూడా పానిండియా రిలీజుకి తీసికెళ్తున్నారు. కానీ వాటి ప్రమోషన్స్ ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ సినిమాల్ని ఆయా తారలు, దర్శకులు, నిర్మాతలు దూకుడుగా ప్రమోట్ చేయడం ముఖ్యం. దీన్ని గుర్తించడం లేదు. ప్రచార వ్యూహాన్ని మార్చుకుని, యూపీ, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ అంతటా తగినన్ని థియేటర్లలో విడుదలయ్యేలా దూకుడుగా ప్రమోట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.

యూపీ, బీహార్‌లలో విస్తృతంగా ప్రమోట్ చేయకపోతే హిందీ మాట్లాడే ప్రేక్షకుల్ని ఆకర్షించడం కష్టం. దాదాపు ప్రతి తెలుగు సినిమాని బహుభాషా వెంచర్ గా పబ్లిసిటీ ఇస్తున్నారు. అయితే ప్రమోషన్లు పట్టించుకోకపోతే హిందీ ప్రాంతాల్లో ప్రధాన స్రవంతి థియేటర్లలో సరైన విడుదలలు పొందడం చాలా కష్టం. ఆ సినిమాలు చిన్న సెంటర్లలోని థియేటర్లకి వెళ్ళి పోవడం ఖాయం. దీంతో కలెక్షన్లు లేక ప్లాప్ అవడం మరీ ఖాయం. వూరికే తమది పానిండియా సినిమా అని చెప్పుకుంటే సరిపోదు. హిందీ మాట్లాడే ప్రేక్షకులకి సినిమా చేరువ కావాలంటే నిర్మాతలు ఒక్కో సినిమాకి 4 నుంచి 5 కోట్లు ప్రమోషన్స్ కి వెచ్చించక తప్పదు.

మరొకటేమిటంటే, ఇప్పుడు గదర్ 2, ఓఎంజీ 2 ల వంటి హిందీ సినిమాల ఘన విజయం కూడా ఒక హెచ్చరిక పంపుతోంది. ఈ బాలీవుడ్ సినిమాలు బంపర్ హిట్టవడంతో, పానిండియాకి డబ్బింగ్ చేస్తున్న తెలుగు సినిమాలు హిందీ ప్రేక్షకుల్ని ఆకర్షించడం మరింత కష్టమవచ్చు. రామ్ పోతినేని 'స్కంధ', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' విజయ్ దేవరకొండ 'ఖుషీ’ వంటి పెద్ద సినిమాలు పానిండియా విడుదలకి సిద్ధంగా వున్నాయి. వీటి విజయావకాశాలు కూడా నార్త్ ఇండియాలో దూకుడు ప్రచార వ్యూహంపై ఆధారపడి వుంటాయి. పూరీ జగన్నాథ్ తీసిన పానిండియా ‘లైగర్’ అట్టర్ ఫ్లాపయింది వేరే విషయం, కానీ దాని ప్రమోషన్స్ నార్త్ లో దిమ్మదిరిగేలా నిర్వహించారు. ఆ రేంజి ప్రమోషన్లు లేకపోతే 5,10 కోట్ల బడ్జెట్ సినిమాల్ని పానిండియాకి తీసికెళ్ళడం దండగ.

తెలుగు సినిమా పరిశ్రమ ఓటీటీలపై, హిందీ డబ్బింగ్ హక్కులపై ఆధారపడి నడుస్తోంది. హిందీలో శాటిలైట్ (టీవీ) రైట్స్ మార్కెట్ పైన చెప్పుకున్న విధంగా ఒక్కసారిగా క్షీణించింది. దీంతో బాలీవుడ్ ఒకటి గుర్తించింది. నార్త్ లో హిందీ మాస్ సినిమాలు లేకపోవడంతో తెలుగు డబ్బింగ్ మార్కెట్ అప్పట్లో బాగా పెరిగింది. ఇప్పుడు హిందీ గదర్ 2 మాస్ మేనియా సృష్టించడంతో, బాలీవుడ్ మేకర్లు మళ్ళీ ఇలాటి మాస్ సినిమాల వైపు దృష్టి సారించి హిందీ మార్కెట్ ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకొక మానరు. తెలుగు పానిండియా మేకర్లు ఇది కూడా గుర్తించాలి.

First Published:  23 Aug 2023 9:11 AM GMT
Next Story