Telugu Global
Cinema & Entertainment

నయనతార థియేటర్ కొన్నదట!

చెన్నైలో కొన్నేళ్ళ క్రితం మూతపడిన 53 ఏళ్ళ నాటి థియేటర్‌ని స్టార్ హీరోయిన్ నయనతార కొనుగోలు చేసిందన్న వార్త వైరల్ అవుతోంది.

Did Nayanthara purchase Agasthiya Theatre in Chennai?
X

నయనతార థియేటర్ కొన్నదట!

చెన్నైలో కొన్నేళ్ళ క్రితం మూతపడిన 53 ఏళ్ళ నాటి థియేటర్‌ని స్టార్ హీరోయిన్ నయనతార కొనుగోలు చేసిందన్న వార్త వైరల్ అవుతోంది. దీనిపై నయనతార వైపు నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కానీ చెన్నై మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. సినిమా నటులు థియేటర్ల యజమానులు కావడం కొత్త విషయం కాకపోయినా, నయన తార కొనుగోలు చేసిందన్న విషయం విశేషంగా చెప్పుకుంటున్నారు. కొన్నేళ్ళ క్రితం చెన్నైలో మూతపడిన పాత అగస్త్య థియేటర్‌ని భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి కొనుగోలు చేసినట్టు సోషల్ మీడియాలో కూడా వైరల్ చేస్తున్నారు.



తమిళ సినిమా నటులు చాలా మందికి సొంత థియేటర్లు వున్నాయి. ఆనాటి నడిగర్ తిలగం శివాజీ గణేశన్ నుంచి హాస్య నటుడు నగేష్ వరకూ చాలా మంది నటులు థియేటర్ యాజమానులే. ఈ వరుసలో ఇప్పుడు ఈ తరంలో మాస్ స్టార్ విజయ్ తో బాటు కొంత మంది తమిళ నటులకూ థియేటర్లు ఉన్నాయి.

చెన్నై అగస్త్య థియేటర్ 1967లో ప్రారంభమైంది. బాలచందర్ 'భామా విజయం' ప్రారంభ సినిమా. ఆ తర్వాత ఎమ్జీఆర్, శివాజీ, కమల్, రజనీ, విజయ్, అజిత్ వంటి అనేక మంది స్టార్ల సినిమాలు విడుదల చేసిన ఘనత అగస్త్య థియేటర్ ది. ఉత్తర చెన్నై లోని తండయార్ పేటలో ఈ థియేటర్ వుంది.

దక్షిణాదిన అగ్రనటి నయనతార . గరిష్టంగా రూ. 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటి తను. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుడుతున్న తను, అప్పటికే నిర్మాతగా మారి ‘రౌడీ పిక్చర్స్’ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తూ, విదేశీ సినిమాల్ని పంపిణీ చేస్తూ కూడా వస్తోంది. ఇప్పుడు ఈ థియేటర్ ని రౌడీ పిక్చర్స్ పేరుతోనే కొన్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ ఎవ్వరూ ఎంతకి కొన్నదనేది మాత్రం చెప్పలేకపోతున్నారు.

మల్టీప్లెక్సుల ట్రెండ్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతబడుతున్న కాలమిది. కొన్ని థియేటర్లు మాల్స్ తో మల్టీప్లెక్స్ థియేటర్లుగా మారుతున్నాయి. అగస్త్య అలా చైన్నెలో ఇటీవల మూసివేసిన థియేటర్. ఇప్పుడు నయనతార చేతిలో అగస్త్య థియేటర్ రూపు రేఖలు ఇలాగే మారబోతున్నాయని సినిమా ప్రముఖులు చెప్పుకుంటున్నారు. అలాటిదేమీ లేదనీ, థియేటర్‌ ని పునరుద్ధరించి రెండు స్క్రీన్‌ల థియేటర్ గా మారుస్తారని మరికొందరు అంటున్నారు.

అగస్త్య థియేటర్ దేవి థియేటర్ గ్రూప్ యాజమాన్యంలో వుంది. 1967 నుంచి ఉత్తర చెన్నైలో బాగానే ఆడుతూ వుండేది. దాదాపు 53 ఏళ్ళ పాటు ఆడిన తర్వాత, 2020లో కరోనా వైరస్ మహమ్మారితో నష్టాల దెబ్బ తట్టుకోలేక మూత బడింది.

నయనతారే కాదు, ఇప్పుడు థియేటర్ బిజినెస్ లో చాలా మంది స్టార్సే వున్నారు. కానీ వీళ్ళందరికీ సూపర్ స్టార్ ఎన్టీఆర్. 1968 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన జంట థియేటర్లని ఎన్టీఆర్ నిర్మించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆబిడ్స్ లో రామకృష్ణ 70 ఎంఎం, రామకృష్ణ 35 ఎంఎం జంట థియేటర్లు రాష్ట్రంలోనే తొలి ఏసీ థియేటర్లు. మొదటిది తొలి 70 ఎం ఎం థియేటర్. అంతేగాక ఈ తొలి 70 ఎం ఎం థియేటర్లో తొలిసారిగా 6 ట్రాక్ స్టీరియోఫొనిక్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు. సినిమా నటుడుగా ఇది దేశంలోనే ఎన్టీఆర్ సాధించిన ఘనత.

ఇక ఇప్పటి తరానికొస్తే, మలయాళ నటుడు దిలీప్ 2014లో కేరళలో మల్టీప్లెక్స్ థియేటర్, ‘డి సినిమాస్‌’ ప్రారంబించారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా కేరళలో మల్టీప్లెక్స్ థియేటర్ కాంప్లెక్స్ ‘ఆశీర్వాద్’ సినీప్లెక్స్ కి సహ యజమాని. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ 2018లో తన పిల్లలు నైసా, యుగ్ పేర్లతో ‘ఎన్వై సినిమాస్‌’ ని ప్రారంభించి, అంచెలంచెలుగా చిన్న పట్టణాల్లో, నగరాల్లో థియేటర్లని విస్తరించాలని, సినిమా వ్యాప్తిని మెరుగుపరచాలనీ నిర్ణయించుకున్నారు. రూ. 600 నుంచి 750 కోట్ల మధ్య పెట్టుబడితో దేశమంతటా 100 స్క్రీన్‌లు ప్రారంభించాలని ప్లాను.

ఇక మన టాలీవుడ్ వైపు చూస్తే, ప్రిన్స్ మహేష్ బాబు 2021లో థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఏషియన్ సినిమాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఏఎంబి సినిమాస్ (ఆసియన్ గ్రూప్ అండ్ మహేష్ బాబు జాయింట్ వెంచర్) ఏర్పాటు చేశారు. 'లైగర్' స్టార్ విజయ్ దేవరకొండ కూడా 2021లో థియేటర్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తను ‘ఏషియన్ విజయ్ దేవరకొండ సినిమాస్‌’ కి గర్వకారణమైన యజమానినని సోషల్ మీడియాలో ప్రకటించారు. ఈ థియేటర్ మహబూబ్‌నగర్‌లో వుంది.

పోతే, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తానేం తీసిపోనని మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు. తను 2021లో ఏషియన్ సినిమాస్‌తో ఒప్పందం కుదుర్చుకుని, హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో 'ఏఏఏ’ పేరుతో కొత్త మల్టీప్లెక్స్ ని నిర్మిస్తున్నారు.

First Published:  23 May 2023 9:57 AM GMT
Next Story