Telugu Global
Cinema & Entertainment

భగవంత్, టైగర్- మధ్యలో పండుగ చేసుకుంటున్న లియో!

పండుగ సీజన్ లో అగ్ర హీరోల భారీ సినిమాలు విడుదలై బాక్సాఫీసుపై పైచేయి కోసం దాదాపు యుద్ధం లాంటిదే చేస్తూంటాయి.

భగవంత్, టైగర్- మధ్యలో పండుగ చేసుకుంటున్న లియో!
X

పండుగ సీజన్ లో అగ్ర హీరోల భారీ సినిమాలు విడుదలై బాక్సాఫీసుపై పైచేయి కోసం దాదాపు యుద్ధం లాంటిదే చేస్తూంటాయి. ప్రధానంగా సంక్రాంతి సీజన్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని రణభేరీ మోగిస్తూంటాయి. పది ఇరవై ఏళ్ళ క్రితం సంక్రాంతికి హిట్టిచ్చిన హీరోకి ‘సంక్రాంతి హీరో’ బిరుదు ఇచ్చేది మీడియా. అప్పట్లో ప్రతి సంక్రాంతికి చిరంజీవి- బాలకృష్ణ సినిమాలు తప్పకుండా పోటీ పడేవి. కానీ దసరాకి ‘దసరా హీరో’ బిరుదు ఎప్పుడూ లేదు. సంక్రాంతి సీజన్ తో పోలిస్తే దసరా సీజన్ కి పోటీ ఎక్కువ వుండక పోవడమే కారణం. నిర్మాతలు కూడా ఏడాది ముందునుంచి సంక్రాంతి విడుదలకే ప్లాన్ చేస్తారు తప్ప, అలా ప్రకటనలివ్వడం మొదలెడతారు తప్ప, దసరా కోసం కాదు. అలాటిది ఈ సారి సంక్రాంతికి ముందు దసరాకే మూడు అగ్ర హీరోల భారీ బడ్జెట్ సినిమాలు సమర భేరీ మోగిస్తున్నాయి!

ఈ మూడూ అసాధారణ పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’, మధ్యలో ‘లియో’. బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ల మధ్య తమిళ విజయ్ ‘లియో’ వచ్చి దూరడం తుఫానునే సృష్టిస్తోంది. రూ. 130 కోట్ల అదిరిపోయే రెమ్యూనరేషన్ తీసుకుంటూ, ‘ఖైదీ’, విక్రమ్’ ల వంటి భారీ హిట్స్ తీసిన దర్శకుడు లోకేష్ కనక రాజ్ తో, రూ. 205-300 కోట్ల అతిభారీ బడ్జెట్ తో ‘లియో’ మెగా యాక్షన్ థ్రిల్లర్ నిర్మింపజేసుకుని దళపతి విజయ్ దసరా మీద దాడిచేయడం కలవరం లాంటిదే పుట్టిస్తోంది. తెలుగు సినిమాలు వదిలేసి దీనికి తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా విపరీతంగా వుంది. అమెరికా, బ్రిటన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘లియో’ తెలుగు వెర్షన్ ట్రెండింగ్ అవుతోంది.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ‘లియో’ తెలుగు వెర్షన్‌ ఓవర్సీస్ మార్కెట్లలో పెద్ద ప్రభావాన్నే చూపిస్తోంది. ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ విజయావకాశాల్ని ప్రభావితం చేసేంతగా అడ్వాన్సు బుకింగ్స్ ని సొంతం చేసుకుంటోంది. దీని ట్రైలర్ చూసి తమిళ ప్రేక్షకులే పెదవి విరిచేసినా తెలుగు ప్రేక్షకులు ఉత్సాహంగా వున్నారు. బ్రిటన్ లో ‘లియో’ తెలుగు వెర్షన్ టిక్కెట్ విక్రయాలు శరవేగంగా పెరుగుతూ ‘భగవంత్ కేసరి’ ని క్రాస్ చేసే స్థితికి చేరుకున్నాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ ని మూడవ స్థానానికి నెట్టేసింది.

అమెరికాలో కూడా ‘లియో’ తెలుగు వెర్షన్ ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్‌లు 100 కె సంఖ్యని దాటి ‘భగవంత్ కేసరి’ కి చేరువగా వచ్చేస్తోంది. ‘భగవంత్ కేసరి’ 165K వద్ద ట్రెండింగ్‌లో వున్నందున 200 కె మార్కుని టచ్ చేయడం సవాలుగా మారింది. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ మూడో స్థానంలో వుంది. ‘భగవంత్ కేసరి’, ‘లియో’ రెండూ అక్టోబర్ 19 గురువారం విడుదలవుతున్నాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ 20 వ తేదీ శుక్రవారం విడుదలవుతోంది. ‘లియో’ లేకపోతే రెండు తెలుగు సినిమాల పెర్ఫార్మెన్స్ కి ఢోకా వుండేది కాదు.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ బ్రాండ్, దళపతి విజయ్ స్టార్ పవర్ కలిసి ‘లియో’ కి భారీ హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇతర దేశాలలో కూడా ఇదే పరిస్థితి వుంది. మరోవైపు, ‘టైగర్ నాగేశ్వరరావు’ అతితక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ తో స్ట్రగుల్ చేస్తోంది. ఇది రవితేజ మొదటి పానిండియా మూవీ. అయితే తమిళనాడులో, కర్ణాటకలో 30 కి మించి థియేటర్లు కూడా దొరకక పోవడం ఇంకో సమస్యగా మారింది. ఈ థియేటర్లు కూడా ప్రధాన కేంద్రాల్లో లేవు. తెలుగు రాష్ట్రాల్లో కూడా తక్కువ థియేటర్లు లభిస్తున్నట్టు సమాచారం. ఒకరోజు ముందే విడుదలవుతున్న విజయ్ ‘లియో’ కోసం తమిళనాడు మొత్తం లాక్ అయ్యింది. కర్ణాటక, కేరళలో కూడా ఇదే జరుగుతోంది. విజయ్ కి ఈ రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ వున్నందున డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ‘లియో’ కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగులో ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా తెలుగులో విడుదలవుతున్న ‘లియో’ తెలుగు రాష్ట్రాల్లో గణనీయమైన థియేటర్‌లు లాక్ అయ్యాయి.

‘టైగర్ నాగేశ్వరరావు’ హిందీ వెర్షన్ కి కూడా పోటీ వుంది. హిందీలో టైగర్ ష్రాఫ్, అమితాబ్ బచ్చన్, కృతీ సానన్ లు నటించిన మెగా యాక్షన్ ‘గణపత్‌’ రవితేజ సినిమా ముందు గంభీరంగా నిల్చుంది. రవితేజ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్టూవర్ట్ పురం దొంగ కథతో ‘టైగర్ నాగేశ్వరరావు’ లో నటించి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తూ పోటీలో వెనకబడడం ఒక విచిత్ర పరిస్థితి.

ఈ రోజు ఆదివారం మధ్యాహ్నం వరకూ పై మూడు సినిమాల అడ్వాన్సు బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కాలేదు. భగవంత్, టైగర్- మధ్యలో లియో వాస్తవ పరిస్థితి ఏంటో తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ప్రారంభమైతే తెలుస్తుంది. కానీ ఓవర్సీస్ కి భిన్నంగా వుంటుందని మాత్రం ట్రేడ్ వర్గాలు చెప్పడం లేదు. అయితే ఎంత లేదన్నా తెలుగు రాష్ట్రాల్లో బాలకృష్ణదే పైచేయి కాగలదని అంచనా. ఆ తర్వాత ‘లియో’, ఆ తర్వాత ‘టైగర్’!

First Published:  15 Oct 2023 9:21 AM GMT
Next Story