Telugu Global
Cinema & Entertainment

‘గామి’ మీద నెగెటివ్ రేటింగ్స్ కుట్ర?

బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొందరు కావాలనే 10 కి 1 రేటింగ్‌ ఇస్తున్నారు. రకరకాల యాప్స్ ఉపయోగించి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9 గా వున్న రేటింగ్ 1కి పడిపోయింది.

‘గామి’ మీద నెగెటివ్ రేటింగ్స్ కుట్ర?
X

విశ్వక్ సేన్ నటించిన ప్రయోగాత్మక సినిమా ‘గామి’ కమర్షియల్ గా హిట్ అయ్యింది. మొదటి వారాంతం మూడు రోజుల్లో రూ. 22 కోట్లు గ్రాస్ తో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఓవర్సీస్ లో కూడా సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత నుంచే నెగెటివ్ రేటింగ్స్ తో సినిమాని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హీరో విశ్వక్ సేన్ ఆరోపించాడు. 10 కి 1 రేటింగ్ ఇస్తూ సినిమా ప్రతిష్టని దిగజారుస్తున్నారని మండి పడ్డాడు. ‘గామి’ ని పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపిన తను, బాట్స్ రేటింగ్ పై ఆందోళనని వ్యక్తం చేశాడు.

ఇన్‌స్టా లో ఇలా పోస్ట్ చేశాడు : “మా సినిమా ‘గామి’ ని ఇంత పెద్ద సక్సెస్‌ చేసిన ప్రియమైన సినీ ప్రేక్షకులకు, సినిమా ఔత్సాహికులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాకి కొందరు చేస్తున్న నెగిటివ్‌ ప్రచారం గురించి, రేటింగ్‌ గురించీ నా దృష్టికి వచ్చింది. ఈ సందర్భంగా దీనిపై నేను మాట్లాడాలనుకుంటున్నా. బుక్‌మైషో వంటి ప్లాట్‌ఫారమ్‌లలో కొందరు కావాలనే 10 కి 1 రేటింగ్‌ ఇస్తున్నారు. రకరకాల యాప్స్ ఉపయోగించి ఫేక్ రేటింగ్ ఇవ్వడం వల్ల 9 గా వున్న రేటింగ్ 1కి పడిపోయింది. దీని వెనక ఎవరున్నారో, వారి ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. అలాంటి వారు నన్ను ఎంత కిందకి లాగాలనుకుంటే అంతకు రెట్టింపు ఉత్సాహంతో, శక్తితో పైకి వస్తాను. ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మంచి సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువైంది. 'గామి'ని సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్ కి, మీడియాకి ధన్యవాదాలు. ఈ మూవీ రేటింగ్‌ విషయంలో జరుగుతున్న అవకతవకలపై చట్టపరంగా ముందుకెళ్తాను"

‘గుంటూరు కారం’ నిర్మాతలు కూడా బుక్ మై షో రేటింగ్ పై చట్టపరంగా ముందుకెళ్ళారు. బుక్ మై షో టికెట్ బుకింగ్ యాప్ లో సినిమా పేజీపై యూజర్ రివ్యూస్ కి, రేటింగ్స్ కీ అవకాశముంటుంది. యూజర్లు వీటిని వినియోగించుకుంటే ఫర్వాలేదు. కానీ ఎవరైనా బాట్స్ (ఆటోమేటెడ్ యాప్) తో దుశ్చర్యకి పాల్పడి రేటింగ్స్ ని దెబ్బ తీయొచ్చు. అప్పుడు తక్కువ రేటింగ్స్ చూపిస్తుంది. తక్కువ రేటింగ్స్ చూపిస్తే టికెట్ బుకింగ్స్ పై ప్రభావం పడుతుంది. ఇదే జరిగింది ‘గామి’, ‘గుంటూరు కారం’ సినిమాల విషయంలో. ప్రేక్షకులు సినిమా హిట్టా ఫ్లాపా అనేది బుక్‌మై షోలో వుండే రేటింగ్‌ ని చూసి తెలుసుకుంటున్నారు. అయితే ఇందులో కొన్ని బాట్స్‌ సినిమాలకి తక్కువ రేటింగ్‌ ఇవ్వడంతో హిట్టయిన సినిమాకి కూడా అతి తక్కువ రేటింగ్‌ నమోదవుతోంది.

అసలు బుక్ మైషో రేటింగ్స్ ని నమ్మవద్దనే వర్గాలున్నాయి. ఎక్కువ అమ్మకాలు సాధించడం కోసం గిమ్మిక్కులు చేస్తారని, ప్రేక్షకులు రేటింగ్‌ ని చూస్తున్నందున, మంచి రేటింగ్‌లని పొందడానికి కొందరు నిర్మాతలు పెద్దమొత్తంలో టిక్కెట్‌లని బుక్ చేసుకుంటారని, అందుకని మొదటి 3 రోజుల్లో రేటింగ్స్ ని, హౌస్ ఫుల్ బోర్డుల్నీ నమ్మవద్దనీ అంటారు.

అయితే తమ ప్లాట్‌ఫారమ్‌లోని రేటింగ్‌లు అస్సలు నకిలీవి కావనీ, అయితే ఈ రేటింగ్‌లు యూజర్స్ పై ఆధారపడి వున్నాయని గుర్తుంచుకోవాలనీ బుక్ మైషో వర్గాలు చెప్తాయి. నిర్మాతలు లేదా ఎవరైనా స్వార్థపరులు సినిమాకి మొదట్లో అధిక రేటింగ్‌లు ఇవ్వడం సాధ్యమేననీ, కానీ కాలక్రమేణా నిజమైన వ్యక్తులు రేటింగ్ ఇవ్వడం ప్రారంభించినప్పుడు, నిజ రేటింగ్‌లు ప్రతిఫలిస్తాయనీ ఆ వర్గాలు వివరిస్తున్నాయి.

పెయిడ్ ప్రమోషన్‌ల విషయానికొస్తే, తాను బుక్‌మైషోలో వున్నంత కాలం, రేటింగ్‌లు/సమీక్షల కోసం చెల్లింపు ప్రమోషన్స్ ని ఎప్పుడూ చూడలేదనీ, బుక్ మై షో మాజీ ఉద్యోగి ఒకరు చెప్పుకొచ్చాడు.

అయితే బుక్ మై షోలో నకిలీ ఓట్లపై ‘గుంటూరు కారం’ టీం చట్టపరమైన చర్యలు తీసుకుంటానంది. ‘గుంటూరు కారం’ పై మోసపూరిత రేటింగ్ కార్యకలాపాల ఆరోపణలు రావడంతో అప్పట్లో వివాదం నెలకొంది. ఈ సినిమా ఆన్‌లైన్ రేటింగ్స్ లో బాట్ తో పాల్పడిన అవకతవకలకి ప్రతిచర్యగా ప్రొడక్షన్ టీం సైబర్ సెల్ లో ఫిర్యాదు దాఖలు చేసింది. విశ్వక్ సేన్ కూడా సైబర్ సెల్ ని ఆశ్రయిస్తాడేమో చూడాలి.

విచిత్రంగా ఈ రోజు బుక్ మైషో ‘గామి’ కి 36.3 వేల ఓట్లతో, 7.9/10 రేటింగ్ చూపిస్తోంది!

First Published:  13 March 2024 9:11 AM GMT
Next Story