Telugu Global
Cinema & Entertainment

రేపే సినిమా లవర్స్ డే!

పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు ప్రతి యేటా నిర్వహిస్తున్న సినిమా లవర్స్ డే రేపు శుక్రవారం జరుగనుంది. సినిమా లవర్స్ డే తేదీ జనవరి 20 అయితే ఈ యేడు కాస్త ఆలాసంగా ఫిబ్రవరి 23 న నిర్వహిస్తున్నారు.

రేపే సినిమా లవర్స్ డే!
X

పీవీఆర్ - ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రూపు ప్రతి యేటా నిర్వహిస్తున్న సినిమా లవర్స్ డే రేపు శుక్రవారం జరుగనుంది. సినిమా లవర్స్ డే తేదీ జనవరి 20 అయితే ఈ యేడు కాస్త ఆలాసంగా ఫిబ్రవరి 23 న నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు విడుదలయ్యే కొత్త సినిమాలు కూడా ఈ ఉత్సవం పరిధిలోకొస్తాయి. ప్రేక్షకులు ఏ సినిమా చూడాలన్నా టికెట్టు ధర కేవలం 99 రూపాయలే. శుక్రవారం విదలవుతున్న ‘ఆల్ ఇండియా ర్యాంక్’, ‘ఆర్టికల్ 370’, ‘క్రాక్’ తో బాటు గత వారాల్లో విడుదలైన ‘తేరీ బాతోమే మే ఐసా ఉల్జా జియా’, ‘ఫైటర్’ లు కూడా చూడవచ్చు. లేదా ‘మేడమ్ వెబ్’, ‘ది హోల్డోవర్స్’, ‘బాబ్ మార్లే-వన్ లవ్’, ‘మీన్ గర్ల్స్’, ‘ది టీచర్స్ లాంజ్’ కూడా వంటి హాలీవుడ్ బకెట్ లో ఎంపిక చేసుకోవచ్చు.

ప్రధాన స్రవంతి సీట్లకు రూ. 99 టిక్కెట్‌లని అందించడంతో పాటు, ప్రీమియం ఫార్మాట్‌లలో కూడా సినిమా లవర్స్ డేని జరుపుకోవాలని చూస్తున్న ప్రేక్షకుల కోసం ఆకర్షణీయమైన ధరలపట్టికని రూపొందించినట్టు కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. సినిమా చైన్ రిక్లయినర్ సీట్లకు టిక్కెట్ ధర రూ. 199 కి తగ్గించారు. ఐమాక్స్, 4డీఎక్స్, ఎంఎక్స్ 4డీ, గోల్డ్ కేటగిరీలలో చూడాలనుకునే వారు కూడా టిక్కెట్ ధరలపై తగ్గింపును పొందవచ్చు. ఇది సాధారణ టిక్కెట్ ధరల ప్రకారం సినిమా ప్రేక్షకులకు గొప్ప ఆఫర్. మామూలుగానైతే నగరాన్ని బట్టి, థియేటర్ ని బట్టి టికెట్, ధరలు రూ. 200 నుంచి రూ. 800 వరకు వుంటాయి.

‘సినిమాలు భారతీయ ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి.

నేషనల్ సినిమా డే విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ప్రేమికుల దినోత్సవాన్ని స్మరించుకోవడం ద్వారా ఈ వేడుకని మరింత విస్తృతం చేయడానికి మేము సిద్ధంగా వున్నాము’ అని కంపెనీ ప్రతినిధి అన్నారు.

దేశంలోని వివిధ నగరాల్లో ఫిబ్రవరి 23 న బుక్ చేసిన అన్ని ప్రదర్శనల కోసం రూ. 99 సెలబ్రేటరీ ఆఫర్ వర్తిస్తుందని, ఈ ఆఫర్ రెండవ శ్రేణి, మూడవ శ్రేణి నగరాలకు/పట్టణాలకు వర్తించదని అన్నారు. అయితే కొసమెరుపెమిటంటే, కర్నాటక మినహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఈ ఆఫర్ లేదు. ఈ రాష్ట్రాల ప్రేక్షకులకి సినిమా లవర్స్ డేకి నోచుకునే అదృష్టం లేదు. ఈ రాష్ట్రాల్లో వినోదపన్ను విధానం ఇలాటి ఉత్సవాల్ని అనుమతించడం లేదు.

గత సంవత్సరం ఇదే సినిమా లవర్స్ డే కి ‘దృశ్యం 2’, ‘కుత్తే’, ‘భేడియా’, ‘అవతార్’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ వంటి కొత్త సినిమాలని రూ. 99లకి అందించింది కంపెనీ. కరోనా మహమ్మారి అంతరించిన తర్వాత కూడా ప్రేక్షకులు థియేటర్లకి రావడానికి వెనుకాడినప్పుడు జాతీయ సినిమా దినోత్సవాన్ని జరుపుకోవాలని థియేటర్ల యాజమాన్యాలు ప్రకటించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం. అలా 2022 సెప్టెంబర్లో మనదేశంలో పీవీఆర్ -ఐనాక్స్ నిర్వహించిన అన్ని సినిమాలనీ రూ.75 కే అందించారు.

First Published:  22 Feb 2024 5:45 AM GMT
Next Story