Telugu Global
Cinema & Entertainment

సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి

దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. దర్శకుడు మంచి కంటెంట్ ఎంచుకోకపోవడం వల్లనే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయన్నారు. కాల్షీట్లు దొరికాయని, కాంబినేషన్లు సెట్ అయ్యాయని సినిమాలు తీయొద్దని దర్శకులకు సూచిస్తున్నారు.

సంచలన వ్యాఖ్యలు చేసిన చిరంజీవి
X

ఆచార్య సినిమాపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ఓ సినిమా ఫెయిల్ అయితే దానికి కారణం, పూర్తి బాధ్యత దర్శకుడే అన్నారు. కంటెంట్ బాగా లేకపోతే ఆడియన్స్ థియేటర్లకు రారని, కంటెంట్ బాగా వచ్చేలా చూసుకునే బాధ్యత దర్శకుడిదే అన్నారు. కంటెంట్ బాలేదు కాబట్టి తను కూడా బాధితుడిగా మారానంటూ పరోక్షంగా ఆచార్య ఫ్లాప్ పై స్పందించారు.

"కరోనా తర్వాత ఇండస్ట్రీలో మార్పు వచ్చింది. ప్రేక్షకుల్లో మార్పు రాలేదు. కంటెంట్ బాగుంటే థియేటర్లకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఈమధ్య వచ్చిన కార్తికేయ2, బింబిసార, సీతారామం సినిమాలు ఆ విషయాన్ని నిరూపించాయి. మంచి సినిమా వస్తే కచ్చితంగా జనాలు వస్తారు. లేదంటే రెండో రోజునే పోతుంది. ఈమధ్య కాలంలో ఆ బాధితుల్లో నేను కూడా ఒకడ్ని. కాబట్టి కంటెంట్ ముఖ్యం. మంచి కంటెంట్ రావాలంటే దర్శకుడిదే బాధ్యత. దర్శకులు ఎప్పటికప్పుడు కంటెంట్ పై రీసెర్చ్ చేయాలి. ఆర్టిస్టులు డేట్స్ దొరికాయి, కాంబినేషన్ సెట్ అయిందని తొందరపడొద్దు. దర్శకులపై ఎంతోమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే దర్శకుడు కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి."

ఇలా దర్శకుడి బాధ్యతల్ని గుర్తుచేశారు చిరంజీవి. నటీనటుల నుంచి బయ్యర్ల వరకు అంతా దర్శకుడి విజన్ పైనే ఆధారపడతారని, చివరికి ఎండ్ యూజర్ అయిన ప్రేక్షకుడు కూడా దర్శకుడి విజన్ పైనే సినిమా జాతకాన్ని డిసైడ్ చేస్తాడని, కాబట్టి దర్శకుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు చిరంజీవి.

ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరయ్యారు చిరంజీవి. ఈ సినిమాతో పూర్ణోదయ పిక్చర్స్ సంస్థ టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తోంది. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్, ఈ సినిమాకు కథ-స్క్రీన్ ప్లే అందించాడు.

First Published:  1 Sep 2022 2:37 AM GMT
Next Story