Telugu Global
Cinema & Entertainment

నేను తప్పు చేయను.. చేస్తే తప్పకుండా దిద్దుకుంటా : చిరంజీవి

తాను తప్పు చేయననేది తన నమ్మకమని.. పొరపాటున చేస్తే తప్పకుండా ఒప్పుకుంటానని చిరంజీవి అన్నారు.

నేను తప్పు చేయను.. చేస్తే తప్పకుండా దిద్దుకుంటా : చిరంజీవి
X

నేను ఎప్పుడూ తప్పు చేయను. పొరపాటున చేస్తే మాత్రం తప్పకుండా దిద్దుకుంటాను. నా వల్ల ఎవరైనా బాధపడితే వారి ఇంటికి వెళ్లి మరీ క్షమాపణలు కోరతా అని మెగాస్టార్ చిరంజీవి న్నారు. తన బ్యాంకు బ్యాలెన్స్ ఎంత పెరిగింది అనే దాని కంటే తన హృదయానికి దగ్గరగా ఎంత మంది వచ్చారనేదే ముఖ్యమని ఆయన చెప్పారు. తనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా వెంటనే స్పందించనని.. ఎందుకంటే నిజాలు నిలకడ మీద తెలుస్తాయని తాను నమ్ముతానని చిరంజీవి అన్నారు. ఆచార్య సినిమా డిజార్టస్ తర్వాత లూసీఫర్ తెలుగు రీమేక్ గాడ్‌ఫాదర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు.

తాను తప్పు చేయననేది తన నమ్మకమని.. పొరపాటున చేస్తే తప్పకుండా ఒప్పుకుంటానని అన్నారు. ఎవరైనా తనపై ఆరోపణలు చేస్తే వెంటనే వెళ్లి వారిపై దాడికి దిగే మనస్తత్వం తనకు లేదన్నారు. తప్పకుండా సంయమనం పాటిస్తాను. అలా చేయడం వల్ల నిజాలు బయటకు వస్తాయి. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు బ్లడ్ బ్యాంక్ మీద చాలా ఆరోపణలు చేశారు. అలాగే భూకబ్జా చేశానంటూ ఇష్టారీతిన మాట్లాడారు. కానీ వాటిపై నేను అసలు స్పందించలేదు. తర్వాత వాళ్లే తమ తప్పు తెలుసుకుంటారని భావించాను. తన నమ్మకమే నిజమైంది. తన మీద విమర్శలు చేసిన వారు కోర్టు ద్వారానో.. తమ అంతరాత్మ ద్వారానో నిజం తెలుసుకొని తన దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పారని చిరంజీవి అన్నారు.

నాపై విమర్శలు చేసిన వారు, ఆరోపణలు చేసిన వారు దగ్గరకు వస్తే తప్పకుండా ఆలింగనం చేసుకుంటానని అన్నారు. ఇదే తన ఫిలాసఫీ అని చెప్పుకొచ్చారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు జరిగిన సంఘటనలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఆనాడు నాపై విమర్శలు చేసిన వారి కార్లపై రాళ్లు విసిరారు. కానీ,నేను ఆ విషయంలో క్షమాపణ చెప్పడానిని ఆ వ్యక్తి (రాజశేఖర్) ఇంటికి వెళ్లాను. ఆయన అప్పటికి ఇంట్లో లేకపోయినా చాలా సేపు అక్కడే వెయిట్ చేశాను. ఆయనతో జరిగిన విషయం చర్చించాను. ఫ్యాన్స్ అలా చేయకుండా ఉండాల్సిందని అన్నాను. నేను తప్పు చేయలేదు కాబట్టే వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడానని చిరంజీవి చెప్పారు. కాగా, ఇటీవల గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి, గరికపాటి వివాదం నేపథ్యంలోనే చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది.

First Published:  15 Oct 2022 2:58 AM GMT
Next Story