Telugu Global
Cinema & Entertainment

Tillu Square | మెగా ప్రశంసలు దక్కించుకున్న టిల్లూ

Tillu Square - సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లూ స్క్వేర్ సినిమాను చిరంజీవి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. యూనిట్ కు అభినందనలు తెలిపారు.

Tillu Square | మెగా ప్రశంసలు దక్కించుకున్న టిల్లూ
X

2022లో విడుదలై ఘన విజయం సాధించిన 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్‌ రామ్ దర్శకత్వం వహించాడు.

భారీ అంచనాలతో వచ్చిన 'టిల్లు స్క్వేర్' సినిమా థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.

ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్ర బృందాన్ని తన నివాసానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి.. సిద్ధును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

"డీజే టిల్లు నాకు బాగా నచ్చిన సినిమా. ఆ సినిమా చూసి ముచ్చటేసి, సిద్ధుని ఇంటికి పిలిపించుకొని అభినందించాను. సిద్ధుని ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు సిద్ధు 'టిల్లు స్క్వేర్'తో మళ్ళీ మన ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమాను చూశాను. అద్భుతం.. నాకు చాలా నచ్చింది ఈ సినిమా. మొదటి సినిమా హిట్ అయ్యి, దానికి సీక్వెల్ చేస్తే ప్రేక్షకుల్లో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ సిద్ధు, దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత నాగవంశీ, మిగతా టీం అంతా కలిసి ప్రేక్షకులు మెచ్చేలా సీక్వెల్ ని అందించడంలో విజయం సాధించారు. అదే ఉత్కంఠ, అదే సరదా, అదే నవ్వులతోటి ఈ 'టిల్లు స్క్వేర్'ని ఎంతో ఎంజాయ్ చేశాను."

'టిల్లు స్క్వేర్' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సిద్ధు జొన్నలగడ్డ కథనం, సంభాషణలు అందించిన ఈ చిత్రానికి రామ్ మిరియాల, అచ్చు రాజమణి పాటలు స్వరపరచగా, భీమ్స్ సిసిరోలియో నేపథ్య సంగీతం అందించారు.

First Published:  1 April 2024 4:55 PM GMT
Next Story