Telugu Global
Cinema & Entertainment

ఒక్కటైన మెగా, నందమూరి ఫ్యాన్స్.. వారసుడికి దెబ్బేనా?

ఈ సంక్రాంతికి విడుదలయ్యేది రెండు తెలుగు సినిమాలే వాటినే ఆదరిద్దాం.. అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. విచిత్రంగా చిరంజీవి అభిమానులు బాలకృష్ణకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా, బాలయ్య అభిమానులు కూడా చిరంజీవి సినిమాకు మద్దతిద్దాం అంటూ.. పోస్ట్‌లు పెడుతున్నారు.

ఒక్కటైన మెగా, నందమూరి ఫ్యాన్స్.. వారసుడికి దెబ్బేనా?
X

మామూలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అన్నట్టుగానే వాతావరణం ఉంటుంది. మా హీరో గొప్ప అంటే..మా హీరో గొప్ప.. అని ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కయ్యానికి దిగుతూ ఉంటారు. ఇది దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. అయితే వారసుడు సినిమా పుణ్యమా అని మెగా, నందమూరి ఫ్యాన్స్ ఒక్కటయ్యారు. మనం మనం ఒకటి.. ఈ సంక్రాంతికి విడుదల అయ్యేది రెండు తెలుగు సినిమాలే..ఆ రెండు సినిమాలనే చూద్దాం..అరవ సినిమాకు అవకాశం ఇవ్వొద్దు... ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇటువంటి కామెంట్స్ కనబడుతున్నాయి.

ఈ పరిస్థితి తలెత్తడానికి కారణం వారసుడు సినిమాపై తలెత్తిన వివాదమే. ఈ సినిమాలో తమిళ అగ్ర హీరో విజయ్ నటించగా..తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. అయితే మొదట ఈ సినిమాను ద్విభాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించాడు. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోల పారితోషికం తగ్గించుకోవాలని నిర్మాతల సంఘం సమ్మె నిర్వహించింది. అప్పుడు తెలుగులో తీస్తున్న అన్ని సినిమాల షూటింగ్‌లు నిలిచిపోగా.. వారసుడు సినిమా షూటింగ్ మాత్రం కొనసాగింది. తమది తమిళ సినిమా అని సమ్మెతో తమకు సంబంధం లేదని అప్పట్లో దిల్ రాజు ప్రకటించాడు.

దిల్ రాజు నిర్మాతగానే ఉంటూ డిస్ట్రిబ్యూటర్‌గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో నైజాంతో పాటు చాలా చోట్ల ఆయన హ్యాండోవర్‌లో థియేటర్లు ఉన్నాయి. దీంతో వారసుడు సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాల కంటే ఎక్కువగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అది కూడా ప్రతి జిల్లాలో మంచి మంచి థియేటర్లు అన్నిటిని వారసుడికే కేటాయించారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని తెలుగు నిర్మాతల సంఘం కూడా వ్యతిరేకించింది. తెలుగు అగ్ర హీరోల సినిమాలకు కూడా థియేటర్లు పెద్ద సంఖ్యలో కేటాయించాలని దిల్ రాజుకు సూచించింది.

అయితే దిల్ రాజు మాత్రం తాను నిర్మిస్తున్న సినిమాను తన హ్యాండోవర్లో ఉన్న థియేటర్లలో ప్రదర్శిస్తే తప్పేంటి అని వాదిస్తున్నాడు. అందుకు తగ్గట్టుగానే వారసుడు సినిమా రిలీజ్‌కి ప్లాన్ చేసుకున్నాడు. అయితే దిల్ రాజు ప్రతి జిల్లాలో మంచి థియేటర్లన్నీ వారసుడుకు కేటాయించడం చిరంజీవి, బాలకృష్ణ ఫ్యాన్స్ కు నచ్చలేదు. తమ హీరోలకు కూడా మంచి థియేటర్లు ఇవ్వాలని వాళ్లు కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా పట్టుబడుతున్నారు.

అయితే తాజాగా ప్రతి జిల్లాలో వారసుడు సినిమా ప్రదర్శించే థియేటర్ల జాబితా విడుదలైంది. అందులో పేరున్న థియేటర్లు, మల్టీప్లెక్స్ లు ఆ సినిమాకు కేటాయించడంతో వారసుడు మూవీకి వ్యతిరేకంగా మెగా, నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మామూలుగా చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ త‌మ హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి విడుదలవుతుంటే పోటా పోటీగా ఒకరిపై మరొకరు కామెంట్స్ చేసుకునేవారు. అయితే ఈసారి ఆ ఇద్దరు హీరోల అభిమానులు ఒక్కటయ్యారు.

ఈ సంక్రాంతికి విడుదలయ్యేది రెండు తెలుగు సినిమాలే వాటినే ఆదరిద్దాం.. అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. విచిత్రంగా చిరంజీవి అభిమానులు బాలకృష్ణకు మద్దతుగా కామెంట్స్ చేస్తుండగా, బాలయ్య అభిమానులు కూడా చిరంజీవి సినిమాకు మద్దతిద్దాం అంటూ.. పోస్ట్‌లు పెడుతున్నారు. వారసుడు సినిమాపై ఫ్యాన్స్ మధ్య ఇంత నెగిటివిటీ పెరగడం దిల్ రాజుకు ఇబ్బందికర పరిస్థితే. ఒకవేళ వారసుడు సినిమా బాగుంటే పర్వాలేదు కానీ.. టాక్ ఏ మాత్రం తేడా వచ్చినా ఆ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగే అవకాశం ఉంది. మరి దిల్ రాజు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.

First Published:  4 Jan 2023 1:49 PM GMT
Next Story