Telugu Global
Cinema & Entertainment

యూనివర్సల్ సినిమాలతో పరాజయాలకి చెక్!

మలయాళ సినిమా రంగం మాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ముందుకు దూసుకు పోతున్న దృశ్యం కనిపిస్తోంది. ‘అబ్రహాం ఓజ్లర్’ వంటి యాక్షన్ థ్రిల్లర్స్ మొదలుకొని ‘మంజుమ్మల్ బాయ్స్’ వంటి సర్వైవల్ సినిమాల వరకూ, ‘ప్రేమలు’ వంటి రోమాంటిక్ కామెడీల నుంచి ‘ఆవేశం’ వంటి యాక్షన్ కామెడీల వరకూ విభిన్న కథా వస్తువులతో విజయాల పరంపర కొనసాగిస్తోంది.

యూనివర్సల్ సినిమాలతో పరాజయాలకి చెక్!
X

మలయాళ సినిమా రంగం మాలీవుడ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ముందుకు దూసుకు పోతున్న దృశ్యం కనిపిస్తోంది. ‘అబ్రహాం ఓజ్లర్’ వంటి యాక్షన్ థ్రిల్లర్స్ మొదలుకొని ‘మంజుమ్మల్ బాయ్స్’ వంటి సర్వైవల్ సినిమాల వరకూ, ‘ప్రేమలు’ వంటి రోమాంటిక్ కామెడీల నుంచి ‘ఆవేశం’ వంటి యాక్షన్ కామెడీల వరకూ విభిన్న కథా వస్తువులతో విజయాల పరంపర కొనసాగిస్తోంది. మలయాళ మేకర్లు బాక్సాఫీసు విజయాల కోసం ప్రధానంగా సార్వజనీన కథల్ని ప్రయత్నించడంతో, ప్రపంచంలో ఎవరైనా చూడగలిగే యూనివర్సల్ సినిమాలు అందుతున్నాయి. రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ రూ. 242 కోట్లు వసూలు చేసింది. ఇది జనవరి- మార్చి మధ్య దేశంలో అన్ని భాషల్లో విడుదలైన సినిమాల వసూళ్ళ కంటే ఎన్నో రేట్లు ఎక్కువ. దీంతో బాటు ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’, ‘ఆడుజీవితం’, ‘ఆవేశం’ కేరళలోనే కాకుండా దేశవ్యాప్తంగా థియేటర్‌ల ముందు తిరునాళ్ళ లాంటి వాతావరణాన్ని సృష్టించాయి.

రూ. 3 కోట్ల ఖర్చుతో నిర్మించిన ‘ప్రేమలు’ రూ. 136 కోట్ల మార్కుని దాటింది. రూ. 27 కోట్లతో నిర్మించిన ‘భ్రమయుగం’ రూ. 85 కోట్లు, రూ. 82 కోట్లతో నిర్మించిన ‘ఆడుజీవితం’ రూ. 158 కోట్లూ వసూలు చేస్యాయి. ఇక తాజాగా ఇటీవల విడుదలైన ‘ఆవేశం’ రూ 30 కోట్ల బడ్జెట్ కి రూ. 155 కోట్లు వసూలు చేసింది.

మీడియా కన్సల్టింగ్ సంస్థ ఒర్మాక్స్ అంచనాల ప్రకారం, 2024 మొదటి మూడు నెలల్లో, మలయాళ సినిమాలు 2023 మొత్తం బాక్సాఫీసు కలెక్షన్లలో 71% కి సమానమైన కలెక్షన్స్ ని నమోదు చేశాయి. ఇంకా, 2024 జనవరి - మార్చి మధ్య మొత్తం స్థూల దేశీయ బాక్సాఫీసు కలెక్షన్లలో మలయాళ సినిమాలు 16% విడుదలయ్యాయి. ఇది తమిళం (9%), హాలీవుడ్ (9%), కన్నడ (2%) కంటే ఎక్కువ.

యూనివర్సల్ ఇతివృత్తాలు, వాటికి అధిక నాణ్యత గల కథనాలు, జోడించి నిర్మించడం ద్వారా మాలీవుడ్ తానెదుర్కొంటున్న పరాజయాల సమస్యని పరిష్కరించుకున్నట్టు కన్పిస్తోందని ట్రేడ్ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మలయాళ సినిమాలు దక్షిణాది మార్కెట్లలో మాత్రమే కాకుండా ఢిల్లీ, లక్నో, కోల్‌కతా వంటి నగరాల్లో కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయి - ఫలితంగా మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, బ్రహ్మయుగం, ఆడుజీవితం, ఆవేశం వంటి సినిమాలకు హౌస్‌ఫుల్ షోలు పడ్డాయని అంటున్నారు. మలయాళ సినిమాలు ఎల్లప్పుడూ హిందీ, తమిళం, తెలుగు వంటి భారీ బడ్జెట్‌లతో, అదిరిపోయే నిర్మాణ విలువలతో వచ్చే సినిమాలతో పోటీ పడవలసి వుంటుంది కాబట్టి, యూనివర్సల్ ఇతివృత్తాలతో ఈ సమస్యని కూడా పరిష్కరించుకున్నారని చెబుతున్నారు. హిందీ, తెలుగు తమిళం వంటి ఇతర భాషల్లో నిరంతరం రూపొందే భారీ యాక్షన్ సినిమాలని చూసి చూసి వున్న ప్రేక్షకులు, సబ్జెక్ట్ బేస్డ్ మలయాళం సినిమాలని ఇష్టపడుతున్నారని చెప్పొచ్చని విశ్లేషకుల వివరణ.

ఇటీవలి సంవత్సరాల్లో కేరళ వెలుపల ఇతర రాష్ట్రాల్లో మలయాళ సినిమాలకి గిరాకీ క్రమంగా పెరుగడం, దీంతో బాటు మలయాళ సినిమాలు సబ్ టైటిల్స్ తో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవడం; జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో మలయాళ సినిమాలకి లభిస్తున్న గుర్తింపూ కలిసి విజయాలకి మెట్లెక్కిస్తున్నాయి.

తెలుగు, తమిళం, హిందీ వంటి స్టార్-ఆధారిత పరిశ్రమల లాగా కాకుండా, మలయాళ పరిశ్రమలో స్టార్స్ ని నడిపించే కథలతో సినిమాలు నడిపిస్తారు కాబట్టి ఇది కూడా సక్సెస్ కి కారణమవుతోంది. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో స్టార్స్ చుట్టూ కథలల్లుతారు కాబట్టి ఆ స్టార్స్ డిమాండ్ల మేరకు కృత్రిమత్వం వచ్చి కలుస్తుంది. ఇంతేగాక మలయాళం లో స్టార్స్ వేగంగా సినిమాలని పూర్తి చేసి విడుదల చేస్తారు. అయితే దీనికి ఇంకో వైపు వాదన కూడా వుంది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పెద్ద స్టార్ విడుదలలు లేకపోవడం మలయాళ సినిమాల విజయాలకి దారితీస్తోందని ఆ వాదం.

ఏదేమైనా ఈ మలయాళ విజయాలు పెట్టుబడిదారులకి రాబడిని అందిస్తున్నాయి. స్థానిక ప్రతిభకి తలుపులు తెరుస్తున్నాయి. నటులు, దర్శకులు, రచయితలు మొదలైన వారు ప్రాంతీయ సరిహద్దులకి అతీతంగా విభిన్న ప్రాజెక్టుల్ని చేపట్టేందుకు వీలు కల్పిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, పోస్ట్-ప్రొడక్షన్ స్టూడియోలు, పంపిణీ నెట్వర్కుల పురోగతికి ఊతమిస్తున్నాయి.

First Published:  19 May 2024 7:44 AM GMT
Next Story