Telugu Global
Cinema & Entertainment

ఈసారి మరింత భయపెడుతుందా? అంచనాలు పెంచేసిన చంద్రముఖి -2 ట్రైలర్

చంద్రముఖి -2 ట్రైలర్ ఇవాళ విడుదల అయింది. చంద్రముఖిలో రజినీకాంత్ లాగే డాక్టర్‌గా, రాజుగా లారెన్స్ రెండు పాత్రల్లో కనిపించాడు.

ఈసారి మరింత భయపెడుతుందా? అంచనాలు పెంచేసిన చంద్రముఖి -2 ట్రైలర్
X

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ చంద్రముఖి. హర్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2005లో విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది. వరుస ప్లాప్‌లలో ఉన్న రజినీకి సూపర్ హిట్ ఇచ్చింది. టైటిల్ రోల్ పోషించిన జ్యోతిక తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. పి.వాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. దీనికి కూడా పి. వాసునే దర్శకత్వం వహిస్తుండగా.. హర్రర్ సినిమాల స్పెషలిస్ట్ రాఘవ లారెన్స్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. టైటిల్ రోల్‌లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది.

ఇవాళ చంద్రముఖి -2 ట్రైలర్ విడుదల అయింది. చంద్రముఖిలో రజినీకాంత్ లాగే డాక్టర్‌గా, రాజుగా లారెన్స్ రెండు పాత్రల్లో కనిపించాడు. చంద్రముఖిలో రజినీ రాజుగా ఎంట్రీ ఇచ్చే సమయంలో వచ్చే రాజాధిరాజ.. రాజగంభీర, రాజమార్తాండ, రాజ కుల తిలక.. వేట్టయ రాజు వరాదూర్.. అనే డైలాగ్‌తోనే రాజు గెటప్‌లో లారెన్స్ ఎంట్రీని చూపించారు. ఇక కంగనా రనౌత్ చంద్రముఖి క్యారెక్టర్‌లో సూట్ అయ్యింది.

చంద్రముఖిలో వడివేలు పాత్ర కీలకం. రాజభవనంలో వడివేలు చేసిన కామెడీ సన్నివేశాలు సినిమాలో బాగా హైలైట్ అయ్యాయి. సీక్వెల్లో కూడా వడివేలును అదే విధమైన క్యారెక్టర్‌తో పరిచయం చేశారు. ఇక స్వామీజీగా తెలుగు సీనియర్ ఆర్టిస్ట్ రావు రమేష్ కనిపించాడు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలకు మ్యూజిక్ అందించిన ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. చంద్రముఖి భారీ హిట్ అయిన నేపథ్యంలో సీక్వెల్‌కు లైకా ప్రొడక్షన్స్ భారీగా ఖర్చుపెట్టినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కాగా, సెప్టెంబర్ 15న వినాయక చవితి కానుకగా చంద్రముఖి -2 మూవీ విడుదల కానుంది.


First Published:  3 Sep 2023 3:18 PM GMT
Next Story