Telugu Global
Cinema & Entertainment

CBN లక్కీ నెంబర్‌..వ్యూహం రిలీజ్ డేట్‌ - RGV

సినిమా విడుదల తేదీని ట్విట్టర్‌లో ప్రకటించిన RGV..ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు లక్కీ నెంబర్ 23 అంటూ రాసుకొచ్చారు. చంద్రబాబుకు 23 సంఖ్యతో అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు ఆర్జీవీ.

CBN లక్కీ నెంబర్‌..వ్యూహం రిలీజ్ డేట్‌ - RGV
X

వ్యూహం సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మ. వ్యూహం సినిమాను ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మరో సినిమా శపథం మార్చి 1న విడుదల కానుంది. టీడీపీ నేత నారా లోకేశ్‌ పిటిషన్ దాఖలు చేయడంతో వ్యూహం సినిమా విడుదల అంశంలో కాస్త జాప్యమైంది. వ్యూహం సినిమాపై మరొకసారి ఒక కమిటీ సమీక్షించి సెన్సార్‌ క్లియరెన్స్‌ ఇవ్వడంతో విడుదలకు ఏర్పడిన అడ్డంకులు తొలిగిపోయాయి. దీంతో ఫిబ్రవరి 23న వ్యూహం సినిమా విడుదల కానుంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఈ సినిమాను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నారు.

సినిమా విడుదల తేదీని ట్విట్టర్‌లో ప్రకటించిన RGV..ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు లక్కీ నెంబర్ 23 అంటూ రాసుకొచ్చారు. చంద్రబాబుకు 23 సంఖ్యతో అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు ఆర్జీవీ. చంద్రబాబు వైసీపీ నుంచి లాక్కున్న ఎమ్మెల్యేల సంఖ్య 23 అని..2019 అసెంబ్లీ ఎన్నికల్లో బాబు గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలు 23 అని చెప్పుకొచ్చారు. ఇక బాబు అరెస్టు అయిన తేది 9-9-23 అని..ఈ అంకెలన్ని కలిపితే వచ్చేది 23 అని రాసుకొచ్చారు. మొత్తం చంద్రబాబుకు 23 సంఖ్యతో ఉన్న 9 సందర్భాలను ట్వీట్ చేశారు RGV.


ఇక వ్యూహం సినిమా గురించి చెప్పాలంటే...2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం నుంచి..ఆయన కుమారుడు వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు మూవీ ఉండనుందని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. జగన్ చేసిన ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం, పాదయాత్ర, జైలుకు వెళ్లడం లాంటి అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో జగన్‌ సీఎం కావడంతో ఈ మూవీ ముగియనుంది.

First Published:  10 Feb 2024 12:24 PM GMT
Next Story