Telugu Global
Cinema & Entertainment

ఇండ్రాణీ ముఖర్జీ డాక్యుసీరీస్ మీద సీబీఐ సీరియస్!

నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవాల్సిన ‘ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్’ డాక్యుమెంటరీ సిరీస్ సీబీఐ జోక్యంతో వాయిదాపడి కోర్టు కెక్కింది.

ఇండ్రాణీ ముఖర్జీ డాక్యుసీరీస్ మీద సీబీఐ సీరియస్!
X

నెట్ ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 23 నుంచి స్ట్రీమింగ్ అవాల్సిన ‘ఇంద్రాణీ ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్’ డాక్యుమెంటరీ సిరీస్ సీబీఐ జోక్యంతో వాయిదాపడి కోర్టు కెక్కింది. బాంబే హైకోర్టు తాజా ఉత్తర్వుననుసరించి, మరో వారం రోజులలోపు సిరీస్ ప్రసారమయ్యే అవకాశం లేదు. ఓటీటీలో ప్రసారంపై స్టే విధించాలని కోరుతూ బాంబే హైకోర్టులో సీబీఐ కేసు వేసింది. విచారణ సందర్భంగా, డాక్యుమెంటరీని డిజిటల్ విడుదలకి అనుమతించాలంటే ముందుగా సీబీఐకి తప్పనిసరిగా ప్రదర్శించాలని ధర్మాసనం సూచించింది. నెట్‌ఫ్లిక్స్ ఈ సూచనకి అంగీకరించింది. ఫిబ్రవరి 29 లోపు సీబీఐ అధికారులకు, హైకోర్టు బెంచ్ కి ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

అమెరికన్ సంస్థ మేక్‌మేక్, ఇండియా టుడే గ్రూప్ కలిసి నిర్మించిన ఈ డాక్యుమెంటరీకి ఉరాజ్ బహల్, షానా లెవీ కలిసి దర్శకత్వం వహించారు. 2015లో దేశవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించిన, మీడియా ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణీ ముఖర్జీ కుమార్తె షీనా బోరా హత్య కేసుకి సంబంధించిన సంక్లిష్ట అంశాల్ని అన్వేషించే నాలుగు భాగాల డాక్యుసిరీస్ ఇది. కుమార్తెని దహనం చేసి చంపిన ఆరోపణలతో ఇంద్రాణీ జైలు కెళ్ళింది. 2016లో ఈ హత్య కేసు ఆధారంగా ‘డార్క్ చాక్లెట్’ అనే బాలీవుడ్ మూవీ వచ్చింది. ఇందులో ఇంద్రాణీ ముఖర్జీగా మహిమా చౌదరి, కుమార్తె షీనా బోరాగా రియాసేన్ నటించారు. అగ్నిదేవ్ చటర్జీ దర్శకత్వం వహించాడు.

షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణీ ముఖర్జీతో బాటు ఆమె రెండో భర్త, ఐఎన్ ఎక్స్ మీడియా ఛానెల్ అధిపతి పీటర్ ముఖర్జీ ప్రధాన నిందితులు. కుమార్తె షీనా బోరా 2012 ఏప్రిల్ లో అదృశ్యమై ఎప్పుడూ కనిపించలేదు. నెట్‌ఫ్లిక్స్ ప్రెస్ నోట్ ప్రకారం, ఈ డాక్యుసిరీస్ ఒక ఉన్నత కుటుంబపు విఫలమైన కుటుంబ సంబంధాల గురించి, జీవితాల్ని నాశనం చేసిన చేసిన రహస్యాల గురించీ కథనం చేసి రూపొందించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు, బాధితురాలి తల్లి ఇంద్రాణి, ఆమె కుమారుడు మిఖాయిల్ బోరా, కుమార్తె విధీ ముఖర్జీ, ఇతర కుటుంబ సభ్యులతో బాటు, న్యాయవాదులు ఈ డాక్యుసరీస్‌లో కనిపిస్తారని నోట్ పేర్కొంది.

షీనా బోరా హత్య కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఈ కేసులో మరికొందరు సాక్షులు ఇంకా కోర్టు ముందుకు రావాల్సి వుంది. కేసు పరిష్కారం కాకుండానే డాక్యు సిరీస్ నిర్మించడంపై సీబీఐ సీరియస్ అయింది. డాక్యుమెంటరీ విడుదలపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, సిబిఐ ఈ ధారావాహిక ఇంద్రాణీ దృక్కోణాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నందున, ఇది సాక్షుల్నీ అలాగే దర్యాప్తునీ ప్రభావితం చేయగలదని అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ కేసులో ప్రధాన నిందితులు సమాజంలో పలుకుబడి గల వ్యక్తులనీ, 2015లో చాలా మీడియా రిపోర్టులు అధికారం కోసం, డబ్బు కోసం తన భావోద్వేగాల్ని త్యాగం చేయడానికి సిద్ధంగా వున్న హృదయం లేని మహిళగా ఇంద్రాణీని చిత్రీకరించాయని, ఆమె దోషి అయినప్పటికీ, అవకాశం ఇచ్చినట్టయితే, తనకు అనుకూలంగా సానుభూతి పవనాలను సృష్టించగలదనీ సీబీఐ విన్నవించుకుంది.

నిజం ఇంకా పూర్తిగా వెల్లడి కావలసి వుందని, ఇప్పటి వరకు 89 మంది సాక్షుల్ని మాత్రమే విచారించామనీ, మిగిలిన వారు డాక్యుమెంటరీ సిరీస్ కి ప్రభావితమైతే కేసు తారుమారు అవగల అవకాశముందనీ సీబీఐ కోర్టుకు తెలిపింది. విచారణ ఒక కొలిక్కి వచ్చే వరకు విడుదలపై స్టే విధించాలని కోరింది.

అయితే డాక్యు సిరీస్ ని అలా వుంచితే, ఇంద్రాణి ముఖర్జీ తన కథని ఎప్పుడో ప్రపంచానికి చెప్పుకుంది. జూలై 2023లో ‘అన్‌బ్రోకెన్ ది అన్‌టోల్డ్ స్టోరీ’ అనే పుస్తకం రాసి! దీన్ని ప్రముఖ హార్పర్స్ కొలీన్స్ సంస్థ ప్రచురించింది, ఈ పుస్తకం మే 2022లో ఆమె బెయిల్‌పై విడుదలయ్యే వరకూ జరిగిన దర్యాప్తు గురించి రాసింది. తనపై హత్యా నేరం మోపదాన్ని ఖండిస్తూ, ‘నేను షాక్ అయ్యాను. నా జీవితంలో ఎప్పుడూ ట్రాఫిక్ జరిమానా కూడా చెల్లించని వ్యక్తిని నేను. నాపైన లేనిపోని నిందలు వేశారు’ అని చెప్పుకుంది.

ఈ డాక్యు సిరీస్ సీబీఐ కి, హైకోర్టుకి ప్రదర్శించిన తర్వాత ప్రసారంపై ఏ నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాల్సిందే!

First Published:  25 Feb 2024 10:03 AM GMT
Next Story