Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ సినిమాకు బాయ్ కాట్ సెగ

రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుండగా దర్శకుడు ఓమ్ రౌత్ హిందువుల మత విశ్వాసాలను మరచి సినిమా తెరకెక్కించినట్లు ఉందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.

ప్రభాస్ సినిమాకు బాయ్ కాట్ సెగ
X

బాలీవుడ్ లో ఒక వర్గానికి చెందిన దర్శకులు, హీరోలు, నిర్మాతలు చేస్తున్న సినిమాలను అక్కడి ప్రేక్షకులు బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వర్గానికి చెందని ప్రభాస్ సినిమా ఆదిపురుష్ ను బాయ్ కాట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా రచ్చ మొదలైంది. ఆది పురుష్ టీజర్ ఇటీవలే విడుదలైంది. రామాయణం ఆధారంగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతుండగా దర్శకుడు ఓమ్ రౌత్ హిందువుల మత విశ్వాసాలను మరచి సినిమా తెరకెక్కించినట్లు ఉందని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.

ముఖ్యంగా రావణుడిగా ముస్లిం అయిన సైఫ్ అలీ ఖాన్ ను ఎంపిక చేయడం, ఆయన ఆహార్యం చూపిన తీరుపై మండిపడుతున్నారు. రావణుడు పరమశివ భక్తుడని ఆయన నుదుటిపై విభూది, కుంకుమ ధరిస్తారని, కిరీటం, సంప్రదాయ దుస్తులు ఉంటాయని అయితే ఆదిపురుష్ లో సైఫ్ అలీఖాన్ ను అచ్చం ముస్లింలా చూపారని తీవ్ర ఆరోపణ చేస్తున్నారు.

సైఫ్ అలీఖాన్ నుదుటిపై బొట్టు, విభూది ఎక్కడని, కిరీటం ఎందుకు పెట్టలేదని.. జుట్టు డిస్కోలాగా దువ్వి ఒక జాకెట్ ధరింపజేశారని విమర్శలు చేస్తున్నారు. రావణుడి కళ్లు నీలిరంగులో చూపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గడ్డం ముస్లింలా అంత పొడవుగా ఎందుకు పెట్టారని, రావణుడి వాహనం పుష్పక విమానం అని.. ఇందులో సైఫ్ అలీఖాన్ ను ఒక రాక్షస గబ్బిలంపై కూర్చోబెట్టారని మండిపడుతున్నారు.

ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ ఆహార్యాన్ని చూస్తుంటే అచ్చం మహమ్మద్ గజినీ, తైమూర్ ముస్లిం రాజు, జిహాదీ కిల్జీని చూసినట్లు ఉందని.. ఆ పాత్రలో ఎక్కడ రావణుడు కనిపించడం లేదని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక రాముడి పాత్ర చేస్తున్న ప్రభాస్ కు సాధారణ చెప్పులు వేశారని, పాత సినిమాల్లో చూపినట్లు చెక్క పాదరక్షలు ధరింపచేసి ఉండాల్సిందని సూచిస్తున్నారు. ఇక ఆంజనేయుడి లుక్ అలా ఎక్కడైనా ఉంటుందా? రొబోట్ లా చూపించారని విమర్శిస్తున్నారు. కండలు తిరిగిన దేహంపై ఆభరణాలు, దుస్తులు, కిరీటం, గదా ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ లో రామాయణం ఆధారంగా తీసిన పాత సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, శ్రీరాముడు, సీత, ఆంజనేయ స్వామి, రావణాసురుడి పోస్టర్లను నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ పోస్టర్లలో వారి ఆహార్యం ఎలా ఉందో ఒకసారి గమనించాలని దర్శకుడికి సూచిస్తున్నారు. ఆదిపురుష్ ని ఓమ్ రౌత్ తెరకెక్కించి విమర్శలు మూటగట్టుకుంటుండగా.. క్లీన్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ పై కూడా ఈ విమర్శల సెగ తగులుతోంది. ప్రస్తుతం ట్విట్టర్ లో బాయ్ కాట్ ఆదిపురుష్, డిజప్పాయింటింగ్ ఆదిపురుష్ అనే హ్యాష్ ట్యాగ్ లు ట్రెండింగ్ అవుతున్నాయి.






First Published:  4 Oct 2022 3:14 AM GMT
Next Story