Telugu Global
Cinema & Entertainment

Bollywood Remake Movies: రీమేకులు చేసినా బాలీవుడ్ లో ఫ్లాపులే!

Bollywood remake movies: రీమేక్స్ ని కూడా హిట్ చేసుకోలేని దయనీయ స్థితిలో బాలీవుడ్ వుంది.

Bollywood Remake Movies: రీమేకులు చేసినా బాలీవుడ్ లో ఫ్లాపులే!
X

Bollywood Remake Movies: రీమేకులు చేసినా బాలీవుడ్ లో ఫ్లాపులే!

ఒకవైపు పానిండియా అంటూ సౌత్ సినిమాలు కదం తొక్కుతూ వుంటే, మరో వైపు బాలీవుడ్ రీమేక్ చేస్తున్న సౌత్ హిట్ సినిమాలు ఢమాల్మంటున్నాయి. రీమేక్స్ ని కూడా హిట్ చేసుకోలేని దయనీయ స్థితిలో బాలీవుడ్ వుంది. ఒకప్పుడు బాలీవుడ్ చేసే సౌత్ రీమేకులు హిట్టయ్యేవి. రౌడీ రాథోడ్ (విక్రమార్కుడు), ఫోర్స్ (ఘర్షణ), సింగం (సింగం), రెడీ (రెడీ), వాంటెడ్ (పోకిరి), గజిని (గజిని), భూల్ భులయ్యా (చంద్రముఖి), నో ఎంట్రీ (పెళ్ళాం ఊరెళ్తే) ...లాంటివెన్నో రీమేక్స్ హిట్టయ్యేవి కానీ ఇటీవలి కాలంలో సౌత్ హిందీలో సక్సెస్ చేసుకోలేకపోతున్నారు. గత సంవత్సరమే తీసుకుంటే ఒక్కటీ హిట్ కాలేదు.

విజయవంతమైన సౌత్ సినిమాల ప్రాథమిక ఆకర్షణ వాటి ప్రధాన పాత్రల స్టార్ పవర్‌తో పాటు, బలమైన కథా కథనాలు. ఈ హంగులతో దేశం అంతటా జనాదరణ పొందే ప్రయత్నంలో సౌత్ సినిమాల్ని రీమేక్ చేయడానికి బాలీవుడ్ నిర్మాతలు ముందుకొస్తున్నారు. అయితే నిరాశ చెంది వెనక్కి వెళ్లిపోతున్నారు. ఇఒష్టపడతారు.

ప్రసిద్ధ సౌత్ సినిమాలు అధిక రీకాల్ విలువని కలిగి వుండడంతో వీటి రీమేకులపై బాలీవుడ్ దృష్టి పడుతోంది. అలాటి రీకాల్ విలువ వున్న సౌత్ సినిమాల్ని రీమేక్ చేసి వాంటెడ్, హేరా ఫేరీ, సింఘం సిరీస్ మొదలైన సినిమాలుగా విడుదల చేస్తే హిట్టయ్యాయి అప్పట్లో. కానీ ఇప్పుడు చూస్తే గత సంవత్సరం దక్షిణాది సినిమాల హిందీ రీమేకుల మరీ ఘోర పరాజయాలతో నార్త్ బెల్ట్ అతలాకుతలమైంది. దృశ్యం 2 మినహా, చాలా రీమేకులు వాటి ఒరిజినల్ విజయాల్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. హిందీ నిర్మాతలు కొందరు తమిళం, తెలుగు, మలయాళ ప్రముఖ సినిమాల హక్కుల్ని కొన్నేళ్లుగా కొని పెట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రీమేక్ కి దిగాలంటే ధైర్యం చేయలేకపోతున్నారు.

2022 లో బాలీవుడ్ రీమేకుల్లో నటించిన స్టార్లు అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లు కూడా బాగా దెబ్బ తిన్నారు. ‘కబీర్ సింగ్’ (అర్జున్ రెడ్డి) హిట్ తర్వాత షాహిద్ కపూర్ మళ్ళీ తెలుగు రీమేక్ ని ఎంచుకుని నాని నటించిన “జెర్సీ’ లో మాజీ క్రికెట్ ప్లేయర్‌ పాత్ర నటిస్తే ఫ్లాపయ్యింది. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ రీమేక్, 28 కోట్లు మాత్రమే రాబట్టింది.

అల్లు అర్జున్ తెలుగు హిట్ ‘అలవైకుంఠ పురం’ హిందీ రీమేక్ సంగతి కూడా ఇంతే. ‘షెహజాదా’ గా కార్తీక్ ఆర్యన్ తో రీమేక్ చేస్తే 75 కోట్ల బడ్జెట్ కి 47 కోట్లు మాత్రమే బాక్సాఫీసు వచ్చింది. కొత్త హీరోతో రీమేక్ చేసిన ‘నికమ్మ’ కూడా ఫ్లాపే. తెలుగులో నాని - సాయి పల్లవి నటించిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ రీమేక్ 22 కోట్ల బడ్జెట్‌ కి 1.77 కోట్లు మాత్రమే బాక్సాఫీసు ప్రాప్తం.

తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో హిట్టయిన ‘జిగర్తాండా’ ని అక్షయ్ కుమార్ తో ‘బచ్చన్ పాండే’ గా తీస్తే బోల్తా కొట్టింది. 165 కోట్ల భారీ బడ్జెట్‌ కి 73.17 కోట్లు బాక్సాఫీసు!

‘విక్రమ్ వేద’ పరిస్తితి కూడా ఇదే. ఇదే పేరుతో 2017 లో తమిళంలో హిట్టయిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రీమేకులో సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్ నటిస్తే 180 కోట్ల బడ్జెట్ కి బాక్స్సాఫీసు 135 కోట్ల దగ్గర ఆగిపోయింది. హష్మీ - అక్షయ్ కుమార్ లతో ‘సెల్ఫీ’ అనే మలయాళం రీమేక్ అట్టర్ ఫ్లాపయ్యింది. దీని బడ్జెట్ దాదాపు 110 కోట్లు కాగా బాక్సాఫీసు 23 కోట్లే.

పోతే, సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టితో తెలుగు హిట్ RX 100 రీమేక్ చేసినా ఫలితం లేదు. సౌత్ రీమేకులే కాకుండా ఫారిన్ రీమేకులతో కూడా సక్సెస్ లు లేవు. స్పానిష్ సినిమా ‘మిరాజ్’ అనే సైన్స్ ఫిక్షన్ ని అధికారిక రీమేకుగా తాప్సీ పన్నూతో ‘దోబారా’ గా తీస్తే ఫ్లాపయ్యింది. ‘లాల్ సింగ్ చద్దా’ గురించి చెప్పనవసరం లేదు. అమీర్ ఖాన్- కరీనా కపూర్ లతో హాలీవుడ్ హిట్ ‘ఫారెస్ట్ గంప్’ ని రీమేక్ చేసి భారీగా చేతులు కాల్చుకున్నారు. ఇక ‘ లూప్ లపేటా’ అంటూ జర్మన్ మూవీ ‘రన్ లోలా రన్’ ని తాప్సీ పన్నూతో రీమేక్ చేస్తే ఇదీ ఫ్లాపయ్యింది.

సూపర్ హిట్ సౌత్ సినిమాల్ని పళ్ళెంలో పెట్టి అందించినా ఎందుకని హిట్ చేసుకోవడం లేదు బాలీవుడ్? ఈ ప్రశ్నకి ఎవరి దగ్గరా సమాధానం లేదు. రీమేకులే కాదు, ఒరిజినల్స్ తో కూడా హిట్ చేసుకోలేకపోతున్నారు. ఒక పరిణామం మాత్రం కొంత కాలం గా కన్పిస్తోంది. కొత్త టాలెంట్ బాలీవుడ్ వైపు రావడం లేదు. కొత్త దర్శకులు, రచయితలూ వెబ్ సిరీస్ వైపు తరలి పోతున్నారు. అక్కడ అద్భుతాలు సృష్టిస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో సృజనాత్మక క్షామం ఏర్పడిందనుకోవచ్చు.

అసలు హిందీ ప్రేక్షకులు వెబ్ సిరీస్ కే అలవాటు పడిపోతున్నారనుకున్నా ఆశ్చర్యం లేదు. ఒకప్పుడు రీమేక్స్ కాలంలో పానిండియా సినిమాల్లేవు, ఓటీటీలు లేవు. ఇప్పుడు ఈ రెండూ వున్నాయి. సౌత్ పానిండియాలని రుచి మరిగిన హిందీ ప్రేక్షకులు సౌత్ సినిమాల్ని ఓటీటీల్లో చూసేస్తూండ వచ్చు. అలాంటప్పుడు వాటిని రీమేక్ చేయడంలో అర్ధం లేదు. ఏమైనా బాలీవుడ్ కి సౌత్ సినిమాలతో చాలా కష్టాలు చుట్టు ముట్టాయి... లొచ్చాయి...

First Published:  25 May 2023 9:30 AM GMT
Next Story