Telugu Global
Cinema & Entertainment

23 ఏళ్ళుగా నిషేధం- అయినా సినిమా ప్రదర్శన!

అసలే ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రం, అందులో ధిక్కార స్వరంతో సినిమా ప్రదర్శన. మామూలు సినిమా అయితే ఫర్వాలేదు, అది బాలీవుడ్ సినిమా. బాలీవుడ్ సినిమాలంటేనే భగ్గుమనే మిలిటెంట్లు ఆ సినిమాలు ప్రదర్శిస్తే వూరుకుంటారా? అయితే సినిమాలు ప్రదర్శించింది ఒక వర్గం నివాస ప్రాంతంలో. ఆ ప్రాంతంలోకి ఎదుటి వర్గం మిలిటెంట్లు ప్రవేశించే అవకాశం లేదు ప్రస్తుత పరితుస్థిల్లో.

23 ఏళ్ళుగా నిషేధం- అయినా సినిమా ప్రదర్శన!
X

అసలే ఘర్షణలతో అట్టుడుకుతున్న రాష్ట్రం, అందులో ధిక్కార స్వరంతో సినిమా ప్రదర్శన. మామూలు సినిమా అయితే ఫర్వాలేదు, అది బాలీవుడ్ సినిమా. బాలీవుడ్ సినిమాలంటేనే భగ్గుమనే మిలిటెంట్లు ఆ సినిమాలు ప్రదర్శిస్తే వూరుకుంటారా? అయితే సినిమాలు ప్రదర్శించింది ఒక వర్గం నివాస ప్రాంతంలో. ఆ ప్రాంతంలోకి ఎదుటి వర్గం మిలిటెంట్లు ప్రవేశించే అవకాశం లేదు ప్రస్తుత పరితుస్థిల్లో. ఇలా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా, ఆగస్టు 15 న బాలీవుడ్ సినిమాల ప్రదర్శన ప్రశాంతంగా జరిగిపోయింది...

పై సన్నివేశం మణిపూర్ లోనిది. బాలీవుడ్ సినిమాలపై తీవ్రవాద సంస్థ నిషేధం విధించిన సుమారు 23 సంవత్సరాల తర్వాత, అంతర్యుద్ధం లాంటి పరిస్థితుల్లో అతలాకుతలమైన మణిపూర్‌ లో, కుకీ-జో గిరిజన విద్యార్థుల సంస్థ ‘హ్మార్ స్టూడెంట్స్ అసోసియేషన్’ (హెచ్‌ఎస్‌ఏ) చురచంద్‌పూర్ కొండ జిల్లాలోని రెంగ్‌కై పల్లెలో, బాలీవుడ్ సినిమా ‘యూరీ : ది సర్జికల్ స్ట్రయిక్’ ని ముందు ప్రకటించిన విధంగా విజయవంతంగా ప్రదర్శించింది.

ఆ పల్లెలో రాత్రి 7. 30 గంటల నుంచి ఎంపిక చేసిన ప్రేక్షకుల కోసం సినిమాని ప్రదర్శించేందుకు ఒక ప్రొజెక్టర్‌ ని ఏర్పాటు చేశారు. ఈ స్క్రీనింగ్‌ కి 100 మందికి పైగా కుకీలు హాజరయ్యారు. ఈ సినిమా తర్వాత, 1998 నాటి ఇంకో బాలీవుడ్ మూవీ ‘కుచ్ కుచ్ హోతా హై’ కూడా ప్రదర్శించారు. యాదృచ్ఛికంగా, షారుఖ్ ఖాన్ నటించిన ‘కుచ్ కుచ్ హోతా హై’ చివరిసారిగా మణిపూర్‌లోని ఒక థియేటర్లో ప్రదర్శించబడిన హిందీ సినిమా. ఇప్పుడు హిందీ సినిమాలపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా తన ధిక్కారాన్ని ప్రదర్శిస్తూ పై రెండు బాలీవుడ్ సినిమాల్ని ప్రదర్శించింది హెచ్‌ఎస్‌ఏ.

భారతీయులుగా తమకు పబ్లిక్ థియేటర్లలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉత్పత్తి అయిన కళల్ని, సినిమాలని వినోదించే హక్కుందని పేర్కొంటూ హెచ్‌ఎస్‌ఏ కార్యనిర్వాహక సభ్యుడు ప్రకటన విడుదల చేశాడు. మిలిటెంట్లు హిందీ సినిమాలని నిషేధించడానికి ప్రధాన కారణం హిందీ సినిమాల్ని విదేశీ సినిమాలుగా పరిగణించడమేనని వివరించాడు. ఈ రోజు వరకూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిషేధానికి మద్దతు ఇస్తోందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామనీ చెప్పాడు.

చురచంద్‌పూర్‌లో రెండు థియేటర్లు వున్నాయి. అయితే హిందీ సినిమాల ప్రదర్శనపై నిషేధం విధించిన తర్వాత అవి మూత బడ్డాయి. ఇటీవల మణిపూర్ లో మెజారిటీ మెయిటీ లకీ, మైనారిటీ కుకీలకీ మధ్య ప్రాణాంతక హింస చెలరేగిన తర్వాత, మెయిటీల ప్రాబల్యంగల రాజధాని ఇంఫాల్ లోయలోని అనేక ఇతర ప్రాంతాల్లో కూడా థియేటర్లు మూతబడ్డాయి. ఈ థియేటర్లలో మణిపురీ సినిమాలని ప్రదర్శించేవారు.

ప్రాంతీయ సినిమాలని మింగేసిన బాలీవుడ్

బాలీవుడ్ సినిమాల ప్రభావంతో మణిపురీ ప్రాంతీయ సినిమాల మనుగడ బాలీవుడ్ సినిమాల నిషేధం ముందు నుంచే అంతంత మాత్రంగా వుంది. మణిపూర్ ప్రేక్షకులు బాలీవుడ్ కమర్షియల్ సినిమాల్ని చూడడానికే ఇష్టపడతారు. మణిపూర్ మాత్రమే కాదు, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాలన్నిటా అక్కడి వివిధ భాషల ప్రాంతీయ సినిమాలని బాలీవుడ్ సినిమాలు మింగేశాయి. అయితే మణిపూర్ లో నిషేధంతో ఈ 23 ఏళ్ళూ బాలీవుడ్ సినిమాలు చాలా నష్టపోయాయి. బాలీవుడ్ తో బాటు ప్రభుత్వమూ ఈ సమస్యకి పరిష్కారం కనుగొన డానికి ఎన్నడూ ప్రయత్నించలేదు.

2000లో మిలిటెంట్ సంస్థ ‘రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్’ మణిపురీ సంస్కృతిని, భాషనూ, స్థానిక చలనచిత్ర పరిశ్రమనూ నాశనం చేశారనే ఆరోపణలతో హిందీ సినిమాలని నిషేధిస్తూ ఒక ఆజ్ఞ జారీ చేసింది. బాలీవుడ్ సినిమాల్లో నటీమణుల వస్త్రధారణ మణిపురీ విలువలకు విరుద్ధమని సంస్థ ఆరోపించింది. కాలక్రమేణా, మిలిటెంట్లు మణిపూర్ భారతీయీకరణకి వ్యతిరేకంగా- వేలాది హిందీ సినిమాల, పాటల వీడియో క్యాసెట్లని జప్తు చేసి, వాటిని తగులబెట్టారు.

1998 లో మణిపూర్‌లో బహిరంగంగా ప్రదర్శించిన చివరి హిందీ సినిమా షారుక్ ఖాన్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' కాగా, అప్పట్నుంచీ రాజధాని నగరం ఇంఫాల్‌లోని సినిమా థియేటర్లలో ఇంగ్లీషు, మణిపురీ, కొరియన్ సినిమాలు ప్రదర్శించడం మొదలు పెట్టారు.

హిందీ సినిమాలపై నిషేధం రాష్ట్రంలో సినిమా థియేటర్ల వ్యాపారాన్ని నాశనం చేసింది. ఈ నిషేధం కారణంగానే హిందీలో తీసిన మణిపూర్‌ ఛాంపియన్‌, బాక్సర్‌ ఎంసీ మేరీకోమ్‌ బయోపిక్‌ ని ఆమె పుట్టిన రాష్ట్రంలో ప్రదర్శించలేకపోయారు. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఇందులో మేరీకోమ్ పాత్రని పోషించింది. ఇక మే 3న హింస చెలరేగినప్పటి నుంచీ మెజారిటీ మెయిటీ, గిరిజన కుకీ సమూహాల మధ్య విపరీతంగా జాతి ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ వాదనల్ని ఖండించింది. రాష్ట్రంలో హిందీ సినిమాల్ని నిషేధించలేదని పేర్కొంది. ప్రభుత్వ పరిధిలో లేని సినిమా థియేటర్లలో మాత్రం హిందీ సినిమాల్ని ప్రదర్శింఛేందుకు అనుమతి లేదని విచిత్ర ప్రకటన విడుదల చేసింది.

హిందీ సినిమాలు ఇప్పటికీ ప్రతిరోజూ వివిధ శాటిలైట్ - టీవీ ఛానెళ్ళలో ప్రసారమవుతున్నాయని, అంతేకాకుండా, హిందీ సినిమా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ ని 2022 ఆగస్టు 20న మణిపూర్ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆడిటోరియంలో ముఖ్యమంత్రి సాక్షిగా ప్రదర్శించామనీ ప్రభుత్వం పై ప్రకటనలో పేర్కొంది.

కాగా, ఆగస్టు 15 న కుకీలు రెండు కాదు నాల్గు బాలీవుడ్ సినిమాలని ప్రదర్శించారని ఇంకో సమాచారం. దశాబ్దాలుగా ఆదివాసీల్ని లొంగదీసుకున్న తీవ్రవాద గ్రూపులకి మా ధిక్కారాన్ని చూపి తీరతామని హెచ్‌ఎస్‌ఏ ప్రకటించింది.

దశాబ్దాలుగా గిరిజనుల్ని లొంగదీసుకున్న మెయిటీ టెర్రర్ గ్రూపులకి, మెయిటీ అనుకూల మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికీ తమ ధిక్కారాన్ని, వ్యతిరేకతనూ బాలీవుడ్ సినిమాల ప్రదర్శన తెలియజేస్తుందని హెచ్‌ఎస్‌ఏ అని విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.

‘ఈ భీభత్స పాలనకు అంతం సమీపించింది. ప్రతి భారతీయ పౌరుడు వైవిధ్యమైన సినిమా, సాంస్కృతిక వ్యక్తీకరణల్ని ఆస్వాదించే స్వేచ్ఛకి అర్హుడు. ఈ అణచివేత విధానాన్ని బహిర్గతం చేద్దాం, న్యాయం కోసం డిమాండ్ చేద్దాం’ అని చురచంద్‌పూర్‌లోని కుకీ గ్రూపుల సమ్మేళనమైన ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరమ్ ఒక ప్రకటనలో పేర్కొంది.

మొత్తం మీద ఆగస్టు 15న సినిమాల ప్రదర్శన సున్నిత పరిస్థితుల్లో శాంతియుతంగానే జరిగింది. మిలిటెంట్లు గానీ, ప్రభుత్వ బలగాలు గానీ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.

(మణిపూర్ సినిమా సీన్)

First Published:  17 Aug 2023 11:00 AM GMT
Next Story