Telugu Global
Cinema & Entertainment

సినిమాలతో బాటు చట్టముంది జాగ్రత్త!

ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా వెల్లడించిన వివరాలు విస్మయం కల్గించేవి కావు. ఎందుకంటే సినిమాలు చూసి నేరాలకి పాల్పడ్డం సర్వ సాధారణమైపోయింది.

సినిమాలతో బాటు చట్టముంది జాగ్రత్త!
X

సినిమాలతో బాటు చట్టముంది జాగ్రత్త!

ఇటీవల సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా వెల్లడించిన వివరాలు విస్మయం కల్గించేవి కావు. ఎందుకంటే సినిమాలు చూసి నేరాలకి పాల్పడ్డం సర్వ సాధారణమైపోయింది. అయితే ఎలాటి తీవ్ర నేరాలకి పాల్పడుతున్నారన్నది ఆందోళనకి గురిచేసే అంశం. ఆఫ్తాబ్ తన సహజీవన సహచరిని 35 ముక్కలుగా కోసి ఆ మాంస ఖండాలని వివిధ చోట్లలో పారేస్తూ వచ్చాడు. ఒక మనిషిని 35 ముక్కలుగా నరకడమన్నది వొళ్ళు జలదరించే విషయం. ఈ క్రూర నేరానికి అమెరికన్ టీవీ సిరీస్ 'డెక్స్ టర్' చూసి పాల్పడినట్టు చెప్పాడు.

ఇలా సినిమాలు చూసి పాల్పడే నేరాలని కాపీ క్యాట్ నేరాలు అంటారు. కళ జీవితాన్ని అనుకరించడం కంటే జీవితమే కళని అనుకరిస్తుందని ఆస్కార్ వైల్డ్ అన్నాడు. అనేక సినిమాలు నిజ జీవిత నేరాలని ప్రేరేపించాయని తెలుసుకున్నప్పుడు, ఈ నేరాలకి సినీ నిర్మాతలు ఎక్కడో బాధ్యులు కాదా అని ప్రశ్న వస్తుంది. కొన్ని సార్లు సినిమాలు చాలా రెచ్చగొట్టేలా వుంటాయి. కొందరు థ్రిల్ కోసం సినిమాల్లో చూసిన అదే నేరాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తారు. కొందరు చేసి చట్టాన్నుంచి తప్పించుకోగలమో లేదో తెలుసుకోవడానికి చేస్తారు.

హాలీవుడ్ లో 'సా' (saw) అనే సైకోపతిక్ సీరియల్ కిల్లర్‌ మూవీ వచ్చింది. బాధితుల్ని కొద్ది కొద్దిగా రాక్షసానందం పొందుతూ చంపుతూంటాడు. ఈ మూవీని తెలుగులో తీస్తే ఎవరూ చూడలేదు. అమెరికాలో ఈ సినిమాలో చూపించిన వాటి నుంచి ప్రేరణ పొంది చాలా కాపీక్యాట్ నేరాలు జరిగాయి. చాలా మందిని కిడ్నాప్ చేయడం, హింసించడం, హత్య చేయడం వంటి నేరాలు జరిగాయి. ఒక రాత్రి స్కూల్లో చదివే తన కొడుకు, వాడి ఫ్రెండ్ ఇలాటి ఒక కిల్లింగ్ ని ప్లాన్ చేయడం విని పోలీసులకి పట్టించింది ఒకావిడ. అప్పుడా కుర్రాళ్ళు చెప్పింది విని పోలీసులు షాక్ తిన్నారు. 'సా' - మూవీ శైలిలో టార్చర్ గదిని ఏర్పాటు చేసి, మనుషులకి బుద్ధిచెప్పడానికి బోలెడు హత్యలు చేసేయాలని ఉబలాటపడ్డామని ఆ కుర్రాళ్ళు చెప్పారు.

నిజజీవిత నేరాలని ప్రేరేపించిన హాలీవుడ్ సినిమాల సంఖ్య చాలా పెద్దది. ఆఫ్తాబ్ 'డెక్స్ టర్' చూసి నేరం చేశాడు. మనదేశం లో మన సినిమాలు చూసి నేరాలకి పాల్పడ్డం లేదా అంటే పాల్పడుతున్నారు. ఇవి ఎక్కువగా హిందీ సినిమాలతో జరుగుతున్నాయి. ఈ సమాచారం కోసం సెర్చి చేస్తే కొన్ని లభించాయి. హత్యలనే కాదు, ఇతర నేరాలు కూడా జరిగాయి. అవేమిటో చూద్దాం...

1. దృశ్యం

ఇది ఆఫ్తాబ్ ఉదంతం తర్వాత తాజా సంఘటన. ఒక యువతి తన తండ్రిని తల్లి ఎలా చంపిందో ఘజియాబాద్ పోలీసులకి చెప్పింది. దీంతో నాల్గేళ్ళ క్రితం జరిగిన హత్య బయట పడింది. 'దృశ్యం' హిందీ సినిమాలో లాగే భర్త మృతదేహాన్ని ఇంటి కింద సిమెంట్ గుంతలో పూడ్చిపెట్టిందా మహాతల్లి.

2. ఖోస్లా కా ఘోస్లా

ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్లను న్యూ ఢిల్లీలోని వ్యక్తులకు విక్రయిస్తున్న ముఠా పని ఇది. ఈ కేసుని ఢిల్లీ క్రైమ్ బ్రాచ్ ఛేదించింది. విచారణలో 'ఖోస్లా కా ఘోస్లా' సినిమా చూశాక ఈ ఆలోచన వచ్చిందని ముఠా వెల్లడించింది.

3. షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా

ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ పాత్రతో ప్రేరణ పొందాడు వాడు. మీరట్ కి చెందిన ఈ స్టూడెంట్ క్లాస్‌మేట్‌ని కిడ్నాప్ చేశాక, ఆమె తండ్రి డబ్బు చెల్లించడానికి నిరాకరించడంతో దారుణంగా చంపేశాడు. పోలీసుల విచారణలో తనకు ఈ బాలీవుడ్ సినిమా చూశాకా కిడ్నాప్ ఆలోచన వచ్చిందని వెల్లడించాడు.

4. బంటీ ఔర్ బబ్లీ

ఇదొక సరదా మూవీ. ఇందులో అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ కిలాడీలుగా వుంటారు. వీళ్లలాగే ఒక బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఈజీగా డబ్బు సంపాదించాలని నేరాలు చేశారు. కొన్నాళ్ల తర్వాత పోలీసులకు దొరికిపోయాక ఈ సినిమానుంచే స్పూర్తి పొంది నేరాలు చేశామని చెప్పుకున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఇవే ఆర్ధిక నేరాలకి పాల్పడ్డారు

5. ధూమ్

2016లో విడుదలైన ఈ హిట్ మూవీలో హీరో జాన్ అబ్రహామ్ గోవా క్యాసినోని దోచుకుంటాడు. ఇది చూసి నలుగురు బైకర్లతో కూడిన ముఠా కేరళలోని ఓ బ్యాంకులో చోరీకి పాల్పడ్డారు.

6. పర్వానా

ఎప్పుడో 1970 లలో విడుదలైన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ హీరో. హీరోయిన్ ని పిచ్చిగా ప్రేమించి ఆమెని పొందడానికి హంతకుడుగా మారే కథ ఇది. నడుస్తున్న రైల్లోంచి తోసేసి ఓ వ్యక్తిని చంపేస్తాడు. ఈ సీన్ చూసిన ఒక ప్రేక్షకుడు ఇలాగే చేసి ఒకర్ని చంపేశాడు.

7. మనీ హీస్ట్

ఐసీఐసీఐ బ్యాంకు అధికారియే పాల్పడిన ఘనకార్యమిది. ప్రపంచవ్యాప్తంగా హిట్ అయిన స్పానిష్ సిరీస్ 'మనీ హీస్ట్' చూసి ఆగలేక పోయాడు. పూణేలోని పని చేస్తున్న బ్యాంకులోనే 34 కోట్లు దోచుకుని, నోట్ల బదులు కటకటాలు లెక్కించాడు.

8. పుష్ప - ది రైజింగ్

ఇక తెలుగు సినిమా కూడా ఇన్స్ ఫైర్ చేయడంలో ముందుంది. 'పుష్ప' బ్లాక్‌బస్టర్ మూవీలో అల్లు అర్జున్ ట్రక్కులో ఎర్రచందనం విజయవంతంగా స్మగ్లింగ్ చేస్తూ వుంటాడు. ఇది చూసి మహారాష్ట్రకి చెందిన ఒకడు కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఇదే టైపులో గంధం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయాడు.

అయితే ఇలాంటి ఘటనలకి సినిమాల్ని నిందించడం సరైనదేనా అంటే కాదంటున్నారు క్రిమినాలజిస్టులు, సమాజంలో జరిగే క్రూరమైన నేరాలకి సినిమాల్ని నిందించడం సరి కాదంటున్నారు. కేవలం జబ్బుపడిన, అస్థిర మానసిక రోగులే సినిమాలు చూసి నేరాలకి పాల్పడ వచ్చని, దీన్ని జనరలైజ్ చేయకూడదని - ఈ నేరాలు కూడా అరుదని అంటున్నారు.

ఒక బాలీవుడ్ దర్శకుడైతే, 'క్రైమ్ సినిమాల్ని థ్రిల్ చేయడానికి తీస్తాం. దీన్ని ఆనందించాలేగానీ, ప్రేరణ పొంద కూడదు. ప్రేరణ పొందేందుకు మేము తీసే ఇతర సినిమాలు కూడా వున్నాయి. వాటిని ఉదాహరణగా తీసుకోవాలి' అన్నాడు.

చివరిగా ఆఫ్తాబ్ కి బాబు లాంటి వాణ్ని చూద్దాం... 2010లో డెహ్రాడూన్‌లో ఓ భర్త భార్యని చంపి 70కి పైగా ముక్కలుగా నరికాడు. ఆంథోనీ హాప్కిన్స్ నరమాంస భక్షక సీరియల్ కిల్లర్‌గా నటించిన 'ది సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్' నుంచి ఐడియా తీసుకున్నానని పోలీసులకి చెప్పాడు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది మరి!

First Published:  24 Nov 2022 9:17 AM GMT
Next Story