Telugu Global
Cinema & Entertainment

భగవంత్ కేసరి తో బాలయ్య హ్యాట్రిక్కేనా?

2021లో ‘అఖండ’, 2023లో ‘వీర సింహారెడ్డి’ రెండు హిట్స్ లో నటించిన నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన ‘భగవంత్ కేసరి’ దసరా సందర్భంగా విడుదలవుతోంది.

భగవంత్ కేసరి తో బాలయ్య హ్యాట్రిక్కేనా?
X

భగవంత్ కేసరి తో బాలయ్య హ్యాట్రిక్కేనా?

2021లో ‘అఖండ’, 2023లో ‘వీర సింహారెడ్డి’ రెండు హిట్స్ లో నటించిన నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన ‘భగవంత్ కేసరి’ దసరా సందర్భంగా విడుదలవుతోంది. ఒక హిట్ ఇస్తే రెండు ఫ్లాపులు ఇచ్చే బాలకృష్ణ, ‘అఖండ’ తర్వాత ‘వీర సింహారెడ్డి’ హిట్ తో ఫ్లాపు గండాన్ని తప్పించుకుని మూడో సినిమా కొచ్చారు. ‘భగవంత్ కేసరి’ కూడా హిట్టయితే హ్యాట్రిక్ సాధించినట్టే. 2016 లో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ హిట్ ఇచ్చి, 2017 లోనే ‘పైసా వసూల్’, 2018 లో ‘జయసింహ’ అనే రెండు ఫ్లాపులిచ్చారు. 2019 లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ హిట్టిచ్చి, 2019 లోనే ‘ఎన్టీఆర్ మహానాయకుడు’, ‘రూలర్’ అనే రెండు ఫ్లాపులిచ్చి- ఒక హిట్టిస్తే రెండు ఫ్లాపులు ఉచితం పథకాన్ని కొనసాగించారు. ఈ పథకం ‘అఖండ’, ‘వీర సింహారెడ్డి’ లతో బ్రేక్ అయి ‘భగవంత్ కేసరి’ తో మళ్ళీ పరీక్షకి నిలబడింది.

ఇప్పుడు అందరి కళ్ళూ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడితో బాలకృష్ణ సినిమా ‘భగవంత్ కేసరి’ మీదే వున్నాయి. అనిల్ రావిపూడి తాజా ప్రమోషనల్ వీడియోలో, భగవంత్ కేసరి ప్రధాన ఇతివృత్తాన్ని వెల్లడించారు. ఆశయం, బాధ్యత, ప్రతీకారాల మధ్య జరిగే తీవ్ర యుద్ధంగా అభివర్ణించారు. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తెలుగులో మొదటిసారిగా, అదీ విలన్ గా నటిస్తున్నాడు. ట్రైలర్ లో బాలకృష్ణ శ్రీలలకి కఠినమైన ఆర్మీ శిక్షణ ఇస్తున్న దృశ్యాల్ని బట్టి బాలకృష్ణ సీనియర్ పాత్ర పోషిస్తున్నట్టు అర్ధమైపోతుంది. నేలకొండ భగవంత్ కేసరి ( బాలకృష్ణ) మేనకోడలు వీజ్జీ (శ్రీలీల) ని ఆర్మీలో చేరి శక్తిసంపన్నురాలిగా మారమని బలవంతం చేస్తాడు. దీంతో జీవితంలో క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న ఆమె ధైర్యశాలిగా మారుతుంది. దీనికి సంపన్న వ్యాపారవేత్త రాహుల్ సంఘ్వీ (అర్జున్ రామ్ పాల్) అడ్డుతగలడంతో కేసరి జీవితం తీవ్ర మలుపు తిరుగుతుంది. ఇక విజ్జీకి రాహుల్ నుంచి పొంచి వున్న ప్రమాదాన్ని ఎదుర్కొని, భార్య(కాజల్ అగర్వాల్) ని కూడా కేసరి కాపాడుకోవడం కథ.

కామెడీలు ప్రధానంగా సినిమాలు తీసే అనిల్ రావిపూడి బాలకృష్ణతో తీసిన సీరియస్ యాక్షన్ సినిమా ఇది. ‘చక్ దే ఇండియా’, ‘దంగల్’ వంటి వుమన్ ఎంపవర్ మెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా వుండొచ్చు. ఇదే నిజమైతే ఇది నెక్ట్ లెవెల్ కెళ్ళని రొటీన్ పాత కథే అవుతుంది. యువతుల్ని శక్తిమంతంగా ఎదిగేందుగు ట్రయినింగిచ్చే సీనియర్ హీరోల కథతో సినిమాలు కాలానికి వెనుకబడి వున్నట్టు. ఆల్రెడీ శక్తివంతంగా ఎదిగిన స్త్రీలెందరో వున్నారు. అలాటి స్త్రీ కథ చూపిస్తే అది నెక్స్ట్ లెవెల్ కి అప్డేట్ చేసిన సమకాలీన కథ అవుతుంది. ఇంకా ట్రైనింగే ఇస్తూ కూర్చుంటే స్త్రీలు ఇంకా బలహీనురాళ్ళే అన్నట్టు బ్రాండింగ్ చేసినట్టు అవుతుంది. స్త్రీలు బలహీనులు, తాము ఉద్దరించాలన్న మైండ్ సెట్ ని లోంచి మగవాళ్ళు బయటపడాలి.

‘చార్లీస్ ఏంజెల్స్’ (2019) అనే హాలీవుడ్ హిట్- చార్లీ అనే హీరో టీంలో, ముగ్గురు హీరోయిన్లు స్వతంత్రంగా ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ని పట్టుకునే కథతో వుంటుంది. హీరో కేవలం పర్యవేక్షణ చేస్తూంటాడు. ‘భగవంత్ కేసరి’ లో ఈ మార్పు లేకపోతే మామూలుగానే వుంటుంది. ఇందులో బాలకృష్ణ తెలంగాణ యాస మాట్లాడం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాల్సి వుంది.

ఇక పాటలు కేవలం మూడే వున్నాయి. దర్శకుడు ఈ విషయం చెప్పి బాలయ్య ఫ్యాన్స్ నే కాకుండా అందరినీ ఆశ్చర్యపరిచాడు. సరైన కథని చెప్పడానికి సిన్సియర్‌గా ప్రయత్నించినప్పుడు కథ నుంచి, భావోద్వేగాల నుంచీ తప్పించుకోలేమని చెప్పాడు. తమన్ సంగీత దర్శకుడు. మరి సరైన కథని ఎంత సినిసియర్ గా, సీరియస్ గా చెప్పి పండుగ ప్రేక్షకుల్ని మెప్పిస్తారో 19 వ తేదీ చూడాలి.

First Published:  16 Oct 2023 10:20 AM GMT
Next Story