Telugu Global
Cinema & Entertainment

ఓటీటీలోకి అవతార్-2.. మూడు గంటల మేకింగ్ వీడియోతో రిలీజ్

అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, వూడూ, మూవీస్ ఎనీ వేర్‌తో పాటు మరి కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఈ చిత్రం విడుదల కానున్నది.

ఓటీటీలోకి అవతార్-2.. మూడు గంటల మేకింగ్ వీడియోతో రిలీజ్
X

అవతార్ - 2 (ది వే ఆఫ్ వాటర్) సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ అవతార్ సీక్వెల్.. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.18,500 కోట్లు వసూలు చేసి రికార్డులకు ఎక్కింది. ఈ వారం ప్రకటించబోయే ఆస్కార్ అవార్డుల్లో అవతార్ గణనీయమైన చోటు దక్కించుకుంటుందని హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ సినిమా ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా త్రీడీలో ఆ నీటి ప్రపంచాన్ని చూసిన వాళ్లకు కొత్త అనుభూతిని కలిగించింది. కాగా, ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

మార్చి 28 నుంచి ఈ సినిమాను డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, వూడూ, మూవీస్ ఎనీ వేర్‌తో పాటు మరి కొన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఈ చిత్రం విడుదల కానున్నది. కేవలం సినిమా మాత్రమే కాకుండా అవతార్ 2కి సంబంధించిన బి హైండ్ సీన్స్ (అడిషనల్ ఫుటేజీ) కూడా చూసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నది.

కాగా, ఈ సినిమా ఆయా ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే సబ్‌స్క్రైబర్స్‌గా ఉన్న వారికి ఉచితంగా లభించదు. ప్రతీ ఒక్కరు పే పర్ వ్యూ పద్దతిలో సినిమాను కొనుగోలు చేసి చూడాల్సి ఉంటుంది. సినిమా కొన్న తర్వాత 72 గంటల లోపు లేదా ఒక సారి చూడటానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఈ సినిమా హక్కులను డిస్నీ+హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. పే పర్ వ్యూ పద్దతి ముగిసిన తర్వాత హాట్‌స్టార్‌లో లభించనున్నట్లు తెలుస్తున్నది.

అవతార్-1 సినిమా పండోరా గ్రహం సృష్టి, ప్రకృతి విధ్వంసం నేపథ్యంలో చూపించి జేమ్స్ కామెరూన్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా విడుదలపైన అవతార్-2లో సముద్రం లోపల ఉండే మరో అద్భుతమైన ప్రపంచాన్ని చూపించారు. రెండు సీక్వెల్స్ నడుమ 13 ఏళ్ల గ్యాప్ ఉండటం గమనార్హం. ఒక సినిమా కోసం ప్రేక్షకులు ఇంతలా ఎదురు చూడం ఎన్నడూ జరగలేదు. అంత ఆలస్యం అయినా.. వసూళ్లు మాత్రం అంచనాలను మించిపోయాయి.


First Published:  8 March 2023 10:48 AM GMT
Next Story