Telugu Global
Cinema & Entertainment

శర్వా ఇప్పుడైనా ఓకే అన్పించుకుంటాడా?

ఇది టైమ్ మెషిన్‌లో కాలంలోకి ప్రయాణించే కథ. గతంలోకి ప్రయాణించి ఆ గతాన్ని సవరిస్తే భవిష్యత్తు ఉజ్వలమయ్యే కథ. అమల నటించిన మదర్ పాత్ర కేంద్ర బిందువుగా దీన్ని చూస్తే హాలీవుడ్ మూవీ గుర్తుకొస్తుంది.

శర్వా ఇప్పుడైనా ఓకే అన్పించుకుంటాడా?
X

ఈ సారైనా శర్వానంద్ 'ఒకే ఒక జీవితం' తో హిట్ బాటపడతాడా? ఈ వారం 9వ తేదీ విడుదలవుతున్న 'ఒకే ఒక జీవితం' వైపు ఆసక్తిగా చూస్తున్నారు ప్రేక్షకులు. కారణం, ఆరు వరస ఫ్లాపుల తర్వాత శర్వానంద్ సైన్స్ ఫిక్షన్‌తో రావడం. ఇదే మళ్ళీ ఇంకో పాత మూస అయితే అనుమానంగా చూసే వాళ్ళు ప్రేక్షకులు. 2017 నుంచీ పడిపడి లేచే మనసు, రణరంగం, జాను, శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్ళూ మీకు జోహార్లు...ఇలా అరడజను అట్టర్ ఫ్లాప్ సినిమాల తర్వాత, ఇప్పుడు రూటు మార్చి సైన్స్ ఫిక్షన్ ప్రయత్నించడం, అదీ 'బ్రహ్మాస్త్రం' లాంటి భారీ స్పిరిచ్యువల్ థ్రిల్లర్ దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న రోజే పరీక్షకి నిలబడడం ఆసక్తిరేపే విషయమే.

'ఒకే ఒక జీవితం', 'బ్రహ్మాస్త్రం' - ఒకటి సైన్స్ ఫిక్షన్ అయితే, ఇంకోటి స్పిరిచ్యువల్ థ్రిల్లర్ రెండూ ఈ వారం ప్రేక్షకులకి వెరైటీలే. వరుసగా మూడు వారాలు లైగర్, కోబ్రా, రంగరంగ వైభవం అనే ఒకదాన్ని మించిన ఒక మూస నుంచి కాస్త రిలీఫ్ నిచ్చే వెరైటీలు. అయితే ఇక్కడొకటి ఉంది. ఈ రెండూ గణేష్ నిమజ్జనం రోజున విడుదలవుతున్నాయి! మండపాలు, వినాయకుడి ఊరేగింపులూ వదిలి సినిమాలకి రాగలరా ప్రేక్షకులు తొమ్మిదో తేదీన? మనకి తెలిసి నిమజ్జనం రోజున ఏ సినిమా విడుదల కాలేదు, విడుదల చెయ్యరు చవితికి తప్ప!

అయితే 'బ్రహ్మాస్త్రం' హిందీలోనే కాదు, తెలుగు వెర్షన్‌కి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయి. బాయ్ కాట్ ట్రెండింగులు ఏమాత్రం పనిచేయడం లేదు. మొన్న 'యాంటీ నేషనల్' జావేద్ అఖ్తర్ కూడా క్లాసు పీకడంతో, జర్నలిస్టు అభిశార్ శర్మ కూడా 'బాయ్ కాట్ బ్యాచి టికెట్ డబ్బుల్లేని బేకార్ బ్యాచ్' అని వాయించడంతో నోరు మూసుకున్నారు. పైగా వారం పది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్రం టీం ప్రమోషన్లతో తెగ హడావిడి చేస్తోంది. రణబీర్ కపూర్, ఆలియా భట్, కరణ్ జోహార్‌ ల ప్రమోష‌న్‌ కార్యక్రమాల్లో రాజమౌళి, నాగార్జున, ఎన్టీఆర్‌లు పాల్గొంటూ తెలుగు ప్రేక్షకుల్లోకి సినిమాని బలంగా తీసికెళ్ళి మార్కెటింగ్ చేస్తున్నారు. రణబీర్ మంచి తెలుగు కూడా మాట్లాడడంతో సంభ్రమాశ్చర్యాలతో ట్వీట్లు చేశారు నెటిజనులు.

ఈ నేపథ్యంలో శర్వానంద్ సైన్స్ ఫిక్షన్ పరీక్షకి నిలబడింది. 4వ తేదీ ఆదివారం ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ హీరోగా నటించి యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అవుతున్నాయి. 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు' కి సోషల్ మీడియాలో మంచి స్పందన లభించినా సినిమా ఫ్లాప్ అయింది. 'శతమానం భవతి', 'మహానుభావుడు'ల తర్వాత శర్వానంద్‌కి వరుస షాకులే తగులుతున్నాయి. జాను, శ్రీకారం సినిమాలకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఫ్లాప్ అయ్యాయి. 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు' పరాజయంతో శర్వానంద్ మూడు సినిమాల్లో ఆఫర్లు వదులుకున్నాడని వినబడింది.

'పడి పడి లేచె మనసు', 'రణరంగం', 'జాను', 'శ్రీకారం', 'మహా సముద్రం' మూడేళ్ళ లోపు ఐదు ఫ్లాప్‌లు! శర్వానంద్ ప్రతిభావంతుడే కానీ స్క్రిప్టులు అతడ్ని విఫలం చేస్తున్నాయి. లేకపోతే 'జాతి రత్నాలు' ముందు 'శ్రీకారం' ఎందుకు ఫ్లాప్ అవుతుంది. ఇంకో పేలవమైన కంటెంట్ కారణంగా 'మహాసముద్రం' ఫ్లాపయ్యింది. టాప్ హీరోయిన్ రశ్మికా మందన్నతో నటించినా అరిగిపోయిన మూస 'ఆడవాళ్ళూ మీకు జోహార్లు' హిట్ కాలేదు. అయితే వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా శర్వానంద్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. శర్వానంద్ ఇకనైనా కథల విషయంలో రూటు మార్చుకుని వినూత్న సినిమాలు చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పుడు 'ఒకే ఒక జీవితం'.

ఇది టైమ్ మెషిన్‌లో కాలంలోకి ప్రయాణించే కథ. గతంలోకి ప్రయాణించి ఆ గతాన్ని సవరిస్తే భవిష్యత్తు ఉజ్వలమయ్యే కథ. అమల నటించిన మదర్ పాత్ర కేంద్రబిందువుగా. దీన్ని చూస్తే హాలీవుడ్ మూవీ గుర్తుకొస్తుంది. 'బ్యాక్ టు ది ఫ్యూచర్' అనే ఆస్కార్ అవార్డు మూవీలో, చిన్న కుర్రాడు టైమ్ మెషిన్‌లో గతంలోకి ప్రయాణించి, ఆ కాలంలో టీనేజర్లుగా ఉన్న‌ తన తల్లిదండ్రుల్ని చూస్తాడు. తల్లిదండ్రులు వర్తమానంలో ఎప్పుడూ కీచులాటలతో శాంతి లేకుండా ఉంటారు. దీని కారణం వాళ్ళ టీనేజ్‌లో ఉందని తెలుసుకుని, టీనేజర్స్ గా వాళ్ళ జీవితాల్ని సరి చేసి వర్తమానంలో కొస్తే, కీచులాటలు మాని తల్లి దండ్రులు సంతోషంగా ఉంటారు. నిజానికిది సైన్స్ ఫిక్షన్ రూపంలో చెప్పిన సైకో థెరఫీ కథ. 'ఒకే ఒక జీవితం' కూడా ఈ కోవలోనే ఉండొచ్చు.

కొత్త దర్శకుడు శ్రీకార్తీక్ నుంచి శర్వానంద్ 'ఒకే ఒకే జీవితం' వస్తోంది. ఇందులో శర్వానంద్ సరసన రీతూవర్మ, అమల, వెన్నెల కిషోర్, అలీ, ప్రియదర్శి నటించారు. సంగీతం జెక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం సుజీత్ సారంగ్, బ్యానర్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, నిర్మాతలు ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు. ఇక 9 తేదీన‌ రిజల్ట్ కోసం చూద్దాం.

First Published:  4 Sep 2022 6:59 AM GMT
Next Story