Telugu Global
Cinema & Entertainment

ఇక బతికినంత కాలం సినిమాల్లోనే - చిరంజీవి ప్రకటన వైరల్

తానిక బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటానని మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు.

ఇక బతికినంత కాలం సినిమాల్లోనే - చిరంజీవి ప్రకటన వైరల్
X

తానిక బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటానని మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. సినిమాల్లో నెంబర్ వన్ హీరోగా ఒక వెలుగు వెలిగిన చిరంజీవి 2008లో రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించిన చిరంజీవి 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పొందారు. చిరంజీవి పార్టీ కేవలం 18 స్థానాలకే పరిమితం అయింది. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారు. ఆ పదవీకాలం ముగిసినప్పటి నుంచి చిరంజీవి మళ్ళీ రాజకీయాల జోలికి వెళ్లలేదు. తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించి వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు.

అయితే చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ఇటీవల పలు పార్టీలు ప్రయత్నాలు సాగించాయి. చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, ఆయన ఇంకా తమ పార్టీ వారే అని పలుమార్లు ఆ పార్టీ ప్రకటనలు చేసింది. బీజేపీ కూడా చిరంజీవిని దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నించింది. అందులో భాగంగానే ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి తన వైపు తిప్పుకొనే ప్రయత్నం చేసిందనే ప్రచారం జరిగింది.

ఇదిలా ఉంటే ఇటీవల చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను పిలిపించుకొని ఆశీర్వదించడమే కాక..జనసేన పార్టీకి రూ.5 కోట్ల భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిరంజీవి జనసేన తరపున ప్రచారం నిర్వహిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి తాజాగా రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇటీవల ఆహా ఓటీటీ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ జరుగగా.. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చిరంజీవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాజకీయాల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన అభిమానుల సహకారంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సేవలు అందించానని.. ప్రజలకు మరింత సేవ చేయడానికి రాజకీయాల్లోకి వెళ్లినట్లు చెప్పారు. తాను గబుక్కున రాజకీయాల్లో వెళ్లి కాలు వేసి పొరపాటు చేశానని, అందుకే వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చానన్నారు.

రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు మరింత సేవ చేద్దామని అనుకున్నానని, కానీ తనలాంటి వ్యక్తి రాజకీయాలకు అనర్హుడని అనేది వాస్తవం అని చెప్పారు. రాజకీయాల్లో 9 ఏళ్ళు ఉన్నానని.. తిరిగి సినిమాల్లోకి వస్తే ప్రేక్షకుల నుంచి అదే ఆదరణ, ప్రేమ ఉంటుందా? అనే అనుమానం ఉండేదన్నారు. కానీ తిరిగి వచ్చాక ప్రేక్షకులు అదే ఆదరణ, ప్రేమ తనపై చూపించారని తెలిపారు. ఇకపై తాను బతికినంత కాలం సినిమాల్లోనే ఉంటానని, ఓపిక ఉన్నంతవరకు అభిమానుల కోసం సినిమాలో చేస్తానని చిరంజీవి వెల్లడించారు. ఇక మళ్లీ తాను రాజకీయాల్లోకి అడుగు పెట్టడం అనేది ఉండదని చిరంజీవి చేసిన ప్రకటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

First Published:  13 April 2024 12:47 PM GMT
Next Story