Telugu Global
Cinema & Entertainment

కాశ్మీర్లో ప్రేక్షకులు సినిమాల కెళ్తున్నారా?

కాశ్మీర్లో అంతా సజావుగా వుందనే సంకేతాలు పంపడానికి ప్రభుత్వం మల్టీప్లెక్స్ ఆలోచన చేసింది. అయితే మల్టీప్లెక్స్ చుట్టూ మోహరింపజేసిన భద్రాతా దళాల్ని చూస్తే పరిస్థితి ఎంత సజావుగా వుందో అర్ధం జేసుకోవచ్చు.

కాశ్మీర్లో ప్రేక్షకులు సినిమాల కెళ్తున్నారా?
X

కాశ్మీర్ లో 30 ఏళ్ళ తర్వాత సెప్టెంబర్ 20 న ప్రారంభమయిన సినిమా ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఆకర్షిస్తున్నాయా? శ్రీనగర్లో ఐనాక్స్ మల్టీప్లెక్స్ కాశ్మీరీ పండిత్ భాగస్వామ్యంలో ప్రారంభమై మూడు వారాలు దాటింది. ఈ మల్టీప్లెక్స్ లో మూడు థియేటర్లున్నాయి. లాల్ సింగ్ చద్దాతో ప్రారంభమై ఇప్పటికీ విక్రమ్ వేదా, పొన్నియిన్ సెల్వన్, గాడ్ ఫాదర్ విడుదలై పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తోంది ఐనాక్స్. అయితే ప్రేక్షకుల నుంచి స్పందన కరువైంది.

బుక్ మై షో ఆన్లైన్ బుకింగ్స్ చూస్తే 10 టికెట్లు, 15 టికెట్లు మాత్రమే బుక్కవుతున్నాయి. టికెట్టు ధరలు 350, 250, 112 రూపాయలుగా వున్నాయి. అక్టోబర్ 8 న పొన్నియిన్ సెల్వన్ చూసేందుకు 50 మంది తమిళ విద్యార్థులు వచ్చారు. ఇదే టాప్ కలెక్షన్ ఈ రోజుకి. విక్రమ్ వేదాకి 20 మంది టూరిస్టులు వచ్చారు. ఇందులో సైఫలీ ఖాన్ నటించినా సరే, స్థానికులు ఉదాసీనంగా వున్నారు. లాల్ సింగ్ చద్దా అమీర్ ఖాన్ సినిమాకి కూడా స్థానికులు కదిలి రాలేదు. ఇప్పుడు గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటించినా సరే డోంట్ కేర్ అన్నట్టున్నారు ప్రేక్షకులు. ఖాన్ల పరిస్థితి కాశ్మీర్లో ఇలా వుంది.

మిగతా దేశం లో రెండేళ్ళు కోవిడ్ తో థియేటర్లు బంద్ అయి, ప్రేక్షకులు సినిమాకెళ్ళే అలవాటు తప్పినట్టు, 30 ఏళ్ళు కాశ్మీర్లో సినిమాహాళ్ళు మూతబడితే ఎవరికి ఇంకా ఆసక్తి వుంటుంది సినిమాలు చూడాలని. ఒక తరానికి తరం థియేటర్ల మొహం చూడలేదు. డిజిటైలైజేషన్ జమానాలో థియేటర్ల అవసరమేముందని ఒక విద్యార్ధిని అంటోంది. తన ఫోన్లో వందలాది సినిమాలు చూస్తున్నానంది. నిరుద్యోగ యువత అభివృద్ధి కోసం ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలిగానీ, వినోదం కోసం కాదని అంటోంది. మల్టీప్లెక్స్ లో 30 మందికి ఉద్యోగాలిచ్చామని ఐనాక్స్ అంటోంది.

కాశ్మీర్లో అంతా సజావుగా వుందనే సంకేతాలు పంపడానికి ప్రభుత్వం మల్టీప్లెక్స్ ఆలోచన చేసింది. అయితే మల్టీప్లెక్స్ చుట్టూ మోహరింపజేసిన భద్రాతా దళాల్ని చూస్తే పరిస్థితి ఎంత సజావుగా వుందో అర్ధం జేసుకోవచ్చు. ఈ భద్రతా దళాల్ని చూస్తే స్థానికులకి అడుగు ముందుకు పడదు. భద్రత దళాలతో వాళ్ళ చేదు అనుభవాలలా వున్నాయి.

మరోవైపు ఉగ్రవాదుల భయం. మల్టీ ప్లెక్స్ ని ఉగ్రవాదులు టార్గెట్ చేస్తారేమనని సినిమా కెళ్ళే ధైర్యం చేయడం లేదు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ డ్రైవ్‌ మల్టీప్లెక్స్ భద్రతని చూస్తోంది. కాశ్మీర్‌లోని వివిధ రక్షిత సంస్థలలాగే ఐనాక్స్ మల్టీప్లెక్స్ గేట్లు కూడా మూసేసి వుంచుతారు. ఒక కారు లేదా, బిక్కుబిక్కుమంటూ ఒక ప్రేక్షకుడు వచ్చినప్పుడు మాత్రమే తెరుస్తారు. క్షుణ్ణంగా తనిఖీ జరిపి లోపలికి అనుమతిస్తారు. మల్టీప్లెక్స్ గేట్ల పొడవునా రెండు అదనపు భద్రతా తనిఖీ కేంద్రాలు వున్నాయి. భద్రతా తనిఖీలు చేయడానికి వ్యక్తిగత భద్రతా సంస్థ సిబ్బందిని నియమించారు. మల్టీప్లెక్స్ ప్రాంగణం అంతటా మోహరించిన పోలీసులు, పారామిలటరీ దళాలు పర్యవేక్షిస్తూంటాయి.

ఇంత భద్రత కల్పించినా 12% కంటే తక్కువ సీట్లు నిండుతున్నాయి. ఇందులో చాలామంది పర్యాటకులూ కొందరు స్థానిక యువకులూ వుంటున్నారు. మూడు థియేటర్లు కలిపి 522 సీట్ల సామర్ధ్యం కలిగి వున్నాయి. రాత్రి 9.45 లోపు ఆటలు ముగిస్తారు.

ఈ స్థలాలు భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా అన్ని విధాలుగా సురక్షితంగా వుంటాయని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ప్రస్తుతానికి ప్రజలు అక్కడికి వెళ్ళడానికి వెనుకాడవచ్చని, కానీ పరిస్థితి ప్రశాంతంగా వుంటే రోజువారీ సందర్శకుల సంఖ్య చాలా రెట్లు పెరుగుతుందని ప్రభుత్వ విశ్వాసం.

వినోద పరిశ్రమని ప్రోత్సహించాలని ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఇక వైన్ షాపులకి కూడా అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిమీద పెద్ద దుమారం లేచింది. జమ్మూ కాశ్మీర్లో 184 ప్రాంతాల్ని ఇందుకు గుర్తించింది ప్రభుత్వం. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రారంభమయిన వైన్ షాపుల మీద ఉగ్రవాద దాడులూ జరిగాయి. ఇలావుంటే గతవారం సూపర్ మార్కెట్లలో కూడా బీరు విక్రయించవచ్చని ప్రకటించింది ప్రభుత్వం.

దీని మీద మరిన్ని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలు, మద్యం మతం మీద దాడి అని మత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీటితో కాశ్మీర్ ని ప్రశాంతంగా వుంచలేరని, ఇది ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టడమేననీ హెచ్చరిస్తున్నారు. ఇక రాజకీయ పక్షాలైతే, ఎన్నికల్ని వాయిదా వేయడానికే ప్రభుత్వం ఈ పరిస్థితుల్ని సృష్టిస్తోందని ఆరోపిస్తున్నాయి.

థియేటర్లు, మద్యం ఈ రెండూ మాత్రమే కాదు, సినిమా నిర్మాణ రంగాన్ని పునరిద్ధరించే చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం. గత సంవత్సరం జమ్మూ కాశ్మీర్ ఫిల్మ్ పాలసీని ప్రకటించింది. మూతపడిన సినిమా హాళ్ళ పునరుద్ధరణతో పాటు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసే అవకాశాలని ఇందులో చేర్చారు. సినిమా షూటింగుల కోసం జమ్మూ కాశ్మీర్ ని ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది. అనుమతుల ప్రక్రియని సులభతరం చేయడంతో పాటు, రాయితీలు, పన్ను రాయితీలు మొదలైన వాటి రూపంలో నిర్మాతలకి అనేక ప్రయోజనాల్ని ప్రకటించింది. అప్పటి నుంచి డజన్ల కొద్దీ హిందీ సినిమాలు కాశ్మీర్లోని సుందరమైన పచ్చిక భూముల్లో, డాల్ సరస్సులో చిత్రీకరణలు జరుపుకున్నాయి. తాజాగా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్న 'గ్రౌండ్ జీరో' షూటింగ్ జరిగింది.

ఒకవైపు ఉగ్రవాద సమస్య వుండగా సినిమాలు- మందు-షూటింగులు ప్రారంభిస్తూ ప్రాణాలకు తెగించి వీటిని ఎంజాయ్ చేయమని ప్రోత్సహిస్తోంది ప్రభుత్వం. అంతా సజావుగా వుందని అంతర్జాతీయ సమాజానికి సంకేతాలు పంపుదాం రమ్మంటోంది!

First Published:  13 Oct 2022 7:14 AM GMT
Next Story