Telugu Global
Cinema & Entertainment

రాక్షసానందంతో యానిమల్ వచ్చేస్తున్నాడు!

రణబీర్ కపూర్ - రశ్మికా మందన్న నటించిన ‘యానిమల్’ అధికారిక ట్రైలర్ ఆన్‌లైన్‌లో పోస్ట్ అయినప్పట్నుంచీ సోషల్ మీడియాలో తీవ్ర అలజడి రేపుతోంది.

రాక్షసానందంతో యానిమల్ వచ్చేస్తున్నాడు!
X

రణబీర్ కపూర్ - రశ్మికా మందన్న నటించిన ‘యానిమల్’ అధికారిక ట్రైలర్ ఆన్‌లైన్‌లో పోస్ట్ అయినప్పట్నుంచీ సోషల్ మీడియాలో తీవ్ర అలజడి రేపుతోంది. అభిమానుల్లో అవధుల్లేని ఉత్సాహాన్ని సృష్టిస్తోంది. ఇందులో ఇంకా మునుపెన్నడూ చూడని రోల్ లో బాబీ డియోల్, మరింకా సీనియర్ స్టార్ అనిల్ కపూర్, తృప్తీ డిమ్రీ నటించారు. దీనికి సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1న థియేటర్లలోకి రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చుట్టూ వున్న అన్ని సంచలనాల మధ్య, బ్రిటిష్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (బిబిఎఫ్ సి ) దీనిని సమీక్షించి 18 రేటింగ్ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది!సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్ సి) నుంచి 'అడల్ట్ సర్టిఫికేట్' అందుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు బిబిఎఫ్ సి నుంచి తీవ్ర వ్యాఖ్యలు ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. బిబిఎఫ్ సి వెబ్ సైట్లో నవంబర్ 26 న పోస్ట్ చేసిన సెన్సార్ ముఖ్యాంశాలు సినిమాలో ఎమున్నాయనేది బయటపెట్టేశాయి. టైటిల్ కింద ‘స్ట్రాంగ్ బ్లడీ వయొలెన్స్’ గా పేర్కొంది. ఇంకా హింస/సెక్స్ కి సంబంధించిన వివిధ అంశాలకి ఇలా పాయింట్స్ ఇచ్చింది : థ్రెట్ అండ్ హార్రర్ 3, లాంగ్వేజ్ 4, సెక్స్ 3, సెక్సువల్ వయొలెన్స్ అండ్ సెక్సువల్ థ్రెట్ 4, ఇంజూరీ డెటెయిల్స్ 5, ఆల్కహాల్ అండ్ టుబాకో 1, డిస్క్రిమినేషన్ 0.

‘ఈ ముదురు యాక్షన్ డ్రామా కనికరంలేని పగతో రగిలిపోయే ఒక వ్యక్తి వక్రీకృత ప్రతీకారం తీర్చుకోవడాన్ని చార్ట్ చేస్తుంది. పోరాట సన్నివేశాలు భయంకరంగా వుంటాయి. గృహహింస నేపథ్యంగా వుంటుంది. లైంగిక వేధింపుల దృశ్యాలు విశృంఖలంగా వుంటాయి’ అని సమీక్షించింది. ఇంకా ఇలా పేర్కొంది : ఒక వ్యక్తి మరొకరి గొంతుని కోసేందుకు కత్తిని ఉపయోగిస్తాడు. ఇద్దరు ఖైదీలని హత్య చేయడానికి మాంసం క్లీవర్లని ఉపయోగిస్తాడు. ఉన్మాదంగా కత్తిపోట్లు పొడుస్తాడు. స్త్రీ పురుషుల్ని, పిల్లల్ని కొట్టడం, అవమానించడం, బలాత్కారం చేయడం, గల్లంతు చేయడం వంటి అనేక గృహ హింస దృశ్యాలు వున్నాయి. తుపాకీలని, బ్లేడ్లని, పిడికిళ్ళని ఉపయోగించిన పోరాట సన్నివేశాలు తీవ్ర రక్తపాతంతో కూడుకుని వున్నాయి.

కంటెంట్ గురించి మరింత పెద్ద లీకీజీ నిస్తూ, రక్తపాత పిపాసి అయిన నెత్తురోడుతున్న హంతకుడు పెళ్ళికి వచ్చిన అతిథుల ముందు తన కొత్త భార్య పైన పడుకుంటాడని, మరొక స్త్రీని రేప్ చేస్తున్న అర్ధంలో ఈ దృశ్యం వుందనీ, ఒక పురుషుడు ఒక స్త్రీని తనతో ప్రేమలో పడేలా చేయడానికి ఉపాయంగా ఆమెతో సెక్స్ చేస్తాడనీ, తర్వాత ఆమెని కించ పరుస్తాడనీ, డైలాగులు తీవ్ర పదజాలంతో వున్నాయనీ పేర్కొంది.

ఇదంతా చూస్తే ఈ జంతువు అంటే ‘యానిమల్’ సందీప్ రెడ్డి తీసిన ‘అర్జున్ రెడ్డి’ కి రాక్షస రూపం అన్నట్టు అనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్ల జడివాన కురుస్తోంది. సిబి ఎఫ్ సి దీనికి 'A' (పెద్దలకు మాత్రమే) సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే బ్రిటిష్ సెన్సార్ రిపోర్టు షాకింగ్ గా వుండడంతో కొందరు నెటిజన్లు ఫిదా కూడా అవుతున్నారు. తమ అభిమాన హీరోని కరుగుగట్టిన నెగెటివ్ పాత్రలో చూడబోతున్నందుకు ఆనందపడుతున్నారు.

ఇంతేకాదు, ఈ హింసాత్మక సినిమా నిడివి అక్షరాలా 3 గంటల 21నిమిషాల 23 సెకన్ల 16 ఫ్రేమ్స్! ఇంతసేపూ ఈ రాక్షసానందాన్ని అనుభవించవచ్చు. ‘యానిమల్’ కథని మొదట మహేష్ బాబుకి వినిపిస్తే తిరస్కరించాడు. ట్రైలర్ చూశాక మహేష్ ఫ్యాన్స్ తప్పుచేశాడని బాధపడుతున్నారు. సందీప్ రెడ్డి మాత్రం ప్రేక్షకుల నాడిని బాగా పట్టుకున్నాడు. సినిమా ఇలా తీస్తేనే చూసి తరిస్తారు ప్రేక్షకులు మరి! యానిమల్ గా మహేష్ బాబుని వూహిస్తేనో? బ్రిటిష్ సెన్సార్ బోర్డు గజగజ వణికిపోయేది.

First Published:  27 Nov 2023 8:30 AM GMT
Next Story