Telugu Global
Cinema & Entertainment

Adipurush: 'ఆదిపురుష్' రన్ ముగింపుకొస్తోంది

Adipurush Movie: పానిండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతీ సానన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన భారీ విజువల్ డ్రామా ‘ఆదిపురుష్’ మొదటి వారాంతంలో అడ్వాన్స్ బుక్కింగుల కారణంగా భారీ వసూళ్ళని రాబట్టి- ఆ తర్వాత వూహించినట్టుగానే సోమవారం నుంచి తగ్గుముఖం పట్టింది.

ఆదిపురుష్
X

ఆదిపురుష్

పానిండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతీ సానన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కించిన భారీ విజువల్ డ్రామా ‘ఆదిపురుష్’ మొదటి వారాంతంలో అడ్వాన్స్ బుక్కింగుల కారణంగా భారీ వసూళ్ళని రాబట్టి- ఆ తర్వాత వూహించినట్టుగానే సోమవారం నుంచి తగ్గుముఖం పట్టింది. సోమవారం రూ 10.80 కోట్లతో 75 శాతానికి పడిపోయిన వసూళ్ళు, నిన్న మరింత తగ్గి రూ. 10 కోట్లు నమోదయ్యాయి. ఇందులో హిందీలో రూ. 5-6 కొట్లే వసూలయ్యాయి. నిన్న థియేటర్లలో దేశవ్యాప్త ఆక్యుపెన్సీ కూడా 11.16 శాతం మాత్రమే నమోదయింది. దీంతో పతనపు అంచుకి చేరుకున్న ‘ఆదిపురుష్’ వసూళ్ళు ఇక ఊర్ధ్వ ముఖం పట్టడం అసంభవమని తేలిపోయింది.

సోమవారానికి నాలుగు రోజుల్లో థియేట్రికల్ రన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 375 కోట్ల రూపాయలకి పైగా గ్రాస్ ని రాబట్టింది 'ఆదిపురుష్'. ఈ మేరకు టీ-సిరీస్ బ్యానర్ ముంబాయిలో అధికారిక కలెక్షన్ రిపోర్టుని విడుదల చేసింది. రిపోర్టు ప్రకారం దేశీయ బాక్సాఫీసుకి మంగళ వారం వరకు ఐదు రోజల మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 247.90 కోట్లకి చేరుకున్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారాంతంలో భారీ వసూళ్ళే నమోదయ్యాయి. నైజాం రూ. 34.31 కోట్లు, సీడెడ్, రూ. 10.17 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 9.03 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 5.35 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 4.35 కోట్లు, గుంటూరు రూ. 6.23 కోట్లు, కృష్ణా రూ. 4.16 కోట్లు, నెల్లూరు రూ. 2.10 కోట్లు... మొత్తం ఇలా 5 రోజుల్లో రూ. 75.7 కోట్లు రాబట్టింది.

'ఆదిపురుష్' బిజినెస్ 65 శాతం తగ్గుదలని అనుభవించిందని బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్-ఎగ్జిబిటర్ అక్షయ్ రాఠీ ఒప్పుకున్నారు. సినిమాని ప్రేక్ష‌కులు ఆదరించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఈ తగ్గుదల వ‌చ్చింద‌ని, ప్రేక్షకుల తీర్పుని గౌరవించక తప్పదనీ చెప్పారు. అయితే నెగెటివ్ మౌత్ టాక్ ప్రముఖులనుంచి కూడా ఎడతెరిపి లేకుండా వస్తూండడంతో 'ఆదిపురుష్' కి దెబ్బ మీద దెబ్బ మీద పడుతోంది. 'రామాయణ్' టీవీ సీరియల్ నటులు అరుణ్ గోవిల్, సునీల్ లహ్రీ, దీపికా చిక్లియాల నుంచీ, 'మహాభారత్' టీవీ సీరియల్ నటుడు ముఖేష్ ఖన్నా వరకూ ఎందరో విమర్శల బాణాల్ని రోజువారీ కార్యక్రమంగా సంధిస్తున్నారు. తాజాగా 'రామాయణ్' టీవీ సీరియల్ దర్శకుడు రామానంద్ సాగర్ కుమారుడు రవి సాగర్ కూడా గొంతు కలిపి, ఆదిపురుష్' ని ఖండ ఖండాలుగా నరికి పోగులు పెట్టారు. ఇక ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (ఏఐసీడబ్ల్యూఏ) 'ఆదిపురుష్' ని నిషేధించాలని ప్రధానికే లేఖ రాసింది. ఇక హిందీ యూట్యూబ్ ఛానెల్స్ లో జర్నలిస్టుల డిబేట్లయితే చెప్పనక్కర్లేదు.

ఇక ఈ సినిమా రచయిత కూడా వెనుకబడి పోలేదు- అతను కూర్చున్న కొమ్మని రోజువారీ తనే నరుక్కుంటున్నాడు. సినిమాపై ఇంత వివాదంలో దర్శకుడు, నిర్మాతలు ఎక్కడున్నారో కనిపించడం లేదు. రచయిత మనోజ్ ముంతసిర్ శుక్లా మాత్రమే హల్చల్ చేస్తున్నాడు. ఒకదాన్ని మించొకటి కామెంట్లతో వివాదంలో లోతుగా ఇరుక్కుంటున్నాడు. చివరికి చంపుతామని బెదిరింపు కాల్స్ వచ్చేదాకా, పోలీసు రక్షణ పొందేదాకా వెళ్ళింది పరిస్థితి.

ఎవరీ మనోజ్ ముంతసిర్ శుక్లా? ఇతను పదో తరగతి చవుతున్నప్పుడు రేడియో పాటలో ముంతసిర్ అని ఉర్దూ పదం విని, తన పేరులో శుక్లాకి వెయిట్ లేదని తీసేసి, ముంతసిర్ పెట్టుకున్నాడు. ముంతసిర్ అంటే విజేత అని అర్ధం. దీన్ని కలం పేరుగా పెట్టుకుని కవిత్వం రాయడం మొదలెట్టాడు. ఇంగ్లీషు, ఉర్దూ కవిత్వాలు చోరీ చేసి తన సొంత కవిత్వంగా వేసుకున్నాడు. బాలీవుడ్ వెళ్ళిపోయి గీత రచయితగా సెటిలైపోయాడు మనోజ్ ముంతసిర్ పేరుతో. అవార్డులు తీసుకున్నాడు.

అప్పట్లో మంచి సెక్యులరిస్టుగా వుండేవాడు. అలహాబాద్ పేరు ప్రయాగ్ రాజ్ గా మారిస్తే తల్లిపేరు మార్చినట్టుగా తల్లడిల్లిపోయాడు. అలాటిది సడెన్ గా భక్తుడుగా మారిపోయి మొగల్ రాజుల్ని తిట్టడం మొదలెట్టాడు. వెయిట్ లేదనుకున్న 'శుక్లా' పేరుని మనోజ్ ముంతసిర్ పక్కన చేర్చి భక్తుడికి తగ్గ తిరుగులేని వెయిట్ తెచ్చుకున్నాడు. భక్తుడయ్యాక తనని ఎవరేం చేస్తారు? అందుకే ఈ ఆత్మ (సినిమా) వినాశక ప్రేలాపనలు. నిర్మాతలు, దర్శకుడు ఇతడి నోర్మూయించి ఎందుకు కూర్చోబెట్టరో అర్ధం గాదు.

'పఠాన్' వివాదంలో షారూఖ్, దర్శకుడు, నిర్మాత అందరూ నోర్మూసుకుని వుండిపోయారు. సినిమా వెయ్యి కోట్లు వసూలు చేసింది.

First Published:  21 Jun 2023 8:55 AM GMT
Next Story