Telugu Global
Cinema & Entertainment

Adipurush: వివాదాల ఎఫెక్ట్ - 75 శాతం కలెక్షన్స్ ఫట్!

అనుకున్నదే జరిగింది... ‘ఆదిపురుష్’ బాక్సాఫీసు కలెక్షన్స్ సోమవారం 75 శాతం పతనమయ్యాయి.

Adipurush Box Office Collections: వివాదాల ఎఫెక్ట్ - 75 శాతం కలెక్షన్స్ ఫట్!
X

Adipurush: వివాదాల ఎఫెక్ట్ - 75 శాతం కలెక్షన్స్ ఫట్!

అనుకున్నదే జరిగింది... ‘ఆదిపురుష్’ బాక్సాఫీసు కలెక్షన్స్ సోమవారం 75 శాతం పతనమయ్యాయి. కొన్ని సినిమాలు మౌత్ టాక్ తో కలెక్షన్స్ పుంజుకుని హిట్టవుతాయి. ‘ఆదిపురుష్’ కలెక్షన్స్ మౌత్ టాక్ తోనే పడిపోయాయి. జూన్ 16న విడుదలైన రోజునుంచీ ప్రభాస్ నటించిన పానిండియా పౌరాణికం ‘ఆదిపురుష్’ వివాదాల సుడిగుండంలో చిక్కుకుని విలవిలలాడుతోంది.


సోషల్ మీడియా సైతం సినిమాని తూర్పారబడుతూ అట్టు డికింది. గోదీ మీడియా, ఐటీ సెల్ సినిమాకి సపోర్టుగా ముందుకి వచ్చే సాహసం చేయకపోవడంతో ‘ఆదిపురుష్’ అనాధలా మిగిలింది. నిర్మాతలు, దర్శకుడూ ఆత్మరక్షణలో పడిపోయారు. సినిమాకి పాజిటివ్ గా ప్రచారం చేసే మాధ్యమాలే లేకుండా పోయాయి.

మౌత్ టాక్ రామబాణం లాగే పనిచేసింది. సినిమాలో పానిండియా స్టార్ ప్రభాస్ ఎక్కుబెట్టిన ఒక్కో బాణం బాక్సాఫీసుకి ఒక్కో చిల్లు పెట్టేలా పనిచేసింది. బాగాలేని సినిమాలో బాణాలన్నీ బాక్సాఫీసు చచ్చుటకే అన్నట్టు తయారయ్యింది. రామాయణాన్ని పరమ దారుణంగా చూపించారన్న తిరుగులేని మౌత్ టాక్ దావానలంలా వ్యాపించడంతో ప్రేక్షకులు బాక్సాఫీసుకి దూరమయ్యారు.


శుక్ర -శని -ఆదివారాలు సహజంగానే అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి. విడుదల రోజునుంచే వివాదాలు చుట్టు ముట్టడంతో చాలా మంది అడ్వాన్స్ బుకింగులు చేసుకున్న ప్రేక్షకులు క్యాన్సిల్ చేసుకున్నారు కూడా. అలా వారాంతపు మూడు రోజుల నెట్ కలెక్షన్స్ రూ. 100 కోట్లు నెట్ కాగా, సోమవారం కేవలం రూ. 8.5 కోట్లు నెట్ మాత్రమే వసూలైంది. నాలుగు రోజుల మొత్తం నెట్ దాదాపు రూ. 108.5 కోట్లుగా వుంది. ఇక రాబోయే రోజుల్లో పెద్ద డ్రాప్‌లు కనిపించడం ఖాయం కన్పిస్తోంది.

సోమవారం నాటి కలెక్షన్లు తుది అంకానికి తూట్లు పొడవడంతో వసూళ్ళు ప్రాణవాయువు కోసం ప్రాకులాడ వచ్చు. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల రూపాయల కంటే తక్కువ జీవిత కాల వసూళ్ళతో సరిపెట్టుకోవాల్సి వుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. దేశంలో ‘ఆదిపురుష్’ రోజువారీ నెట్ కలెక్షన్లు ఇలా వున్నాయి -మొదటి రోజు: రూ. 34 కోట్లు, 2వ రోజు: రూ. 33 కోట్లు, 3వ రోజు: రూ. 34 కోట్లు, 4వ రోజు: రూ. 8.50 కోట్లు. మొత్తం రూ. 109.5 కోట్లు. తొలి మూడు రోజుల గ్రాస్ కలెక్షన్స్ రూ. 340 కోట్లు. గ్రాస్ అంటే మొత్తం టికెట్ అమ్మకాలపై వసూలైన వసూలైన మొత్తం. నెట్ అంటే పన్నులు, ఇతర నిర్వహణ ఖర్చులు తీసివేయగా మిగిలిన మొత్తం.

అయితే ఒకసారి కలెక్షన్లు పడిపోయిన సినిమాని మునుపటి వసూళ్ళ స్థాయికి తీసుకురావడం కష్టమైన పని. సోమవారం రూ. 8.50 కోట్ల రూపాయలు షాకింగ్ కలెక్షన్లు. ఈ వారం దీన్ని పెంచడమన్నది ఎలాగో ఎవరూ చెప్పలేకపోతున్నారు.


వారం రోజుల్లో సినిమాలో అభ్యంతరకర డైలాగుల్ని సంస్కరిస్తామని ఈ సినిమా రచయిత మనోజ్ ముంతసిర్ శుక్లా చెప్పినా, జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇంకే మరమ్మత్తులు పని చేయకపోవచ్చు. పైగా పరస్పర విరుద్ధ ప్రకటనలిచ్చాడు. దీంతో విశ్వసనీయత కోల్పోయాడు. గతంలో రామాయణం ఆధారంగా తీశామని చెప్పి- ఇప్పుడు కేవలం రామాయణం ప్రేరణతో తీశామని చెప్పడంతో ప్రేక్షకుల ఆసక్తి చచ్చిపోయింది.

ఇక నేపాల్ లో ఎదురైన సంకటం ఎటూ కాకుండా చేస్తోంది. సీతని నేపాల్ పుత్రిక అనకుండా, భారత పుత్రిక అనడంతో, నోటీసు పంపినా వినకపోవడంతో, నేపాల్ ప్రభుత్వం ‘ఆదిపురుష్’ ని నేపాల్ లో నిషేధించింది. నేపాల్ పుత్రికగా మారిస్తే భారత ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో తెలీదు. నేపాల్ ప్రదర్శనల వరకూ నేపాల్ పుత్రికగా మార్చుదామంటే, లేదు మొత్తం ఇండియా ప్రదర్శనల్లో కూడా నేపాల్ పుత్రికగా వుండాల్సిందేనని కండిషన్ పెట్టింది నేపాల్ ప్రభుత్వం. పైగా ‘ఆదిపురుష్’ తో బాటు మొత్తం హిందీ సినిమాల్నీ నిషేధించింది. ఈ చిక్కు ముడి కూడా ఎలా విప్పి ‘ఆదిపురుష్’ కి పునర్జన్మ కల్పిస్తారో తెలీదు. పునర్జన్మతో బాక్సాఫీసులు నిండుతాయన్న నమ్మకమూ లేదు.

ఈ మొత్తం వ్యవహారంలో సెన్సార్ బోర్డు గురించి ఎవరూ చర్చించడం లేదు. మేకింగ్ పరంగా, రైటింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా ఇంత అవమానకరంగా వున్న సినిమాని, భారత సంస్కృతికి ఏకైక హక్కుదారైన ప్రభుత్వానికి చెందిన సెన్సార్ బోర్డు ఎలా ఆనుమతించిందన్న ప్రశ్నకి ఒకటే సమాధానం- దర్శకుడు, రచయిత మనవాళ్ళే, మన భక్తులే. ఇతరులెవరైనా ఈ సినిమా తీసి వుంటే దేశ ద్రోహుల కింద మారిపోయి, సెన్సార్ బోర్డు చుట్టూ తిరుగుతూ వుండేవాళ్ళు!

First Published:  20 Jun 2023 6:57 AM GMT
Next Story