Telugu Global
Cinema & Entertainment

ఒకే సినిమాలో 45 పాత్రలు నటించాడు!

మన సినిమాల్లో అభిమాన తారలు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం పోషించి ప్రేక్షకుల్ని అలరించడం సాధారణ విషయం. ఒకే సినిమాలో రెండు, లేదా మూడు పాత్రలు నటించిన నటుల్ని నాటి ఎన్టీఆర్ నుంచీ నేటి ప్రభాస్ వరకూ ఎందరినో చెప్పుకోవచ్చు.

ఒకే సినిమాలో 45 పాత్రలు నటించాడు!
X

ఒకే సినిమాలో 45 పాత్రలు నటించాడు!

మన సినిమాల్లో అభిమాన తారలు ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం పోషించి ప్రేక్షకుల్ని అలరించడం సాధారణ విషయం. ఒకే సినిమాలో రెండు, లేదా మూడు పాత్రలు నటించిన నటుల్ని నాటి ఎన్టీఆర్ నుంచీ నేటి ప్రభాస్ వరకూ ఎందరినో చెప్పుకోవచ్చు. ‘దానవీర శూర కర్ణ’ లో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తే, ఈనెల విడుదల కానున్న ‘సాలార్’ లో ప్రభాస్ రెండు పాత్రలు నటిస్తున్నాడు. అయితే మన దేశంలో తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన నటుడెవరు, ఆ సినిమా ఏది, ఎప్పడు విడుదలైందని చరిత్రని తడిమితే, 1913 లో తొలి భారతీయ చలన చిత్రం ‘రాజాహరిశ్చంద్ర’ నిర్మించిన దాదా సాహెబ్ ఫాల్కే, 1917 లో ‘లంకా దహన్’ నిర్మించినప్పుడు, అన్నా సాహెబ్ సలుంకే ద్విపాత్రాభినయం చేసిన తొలి నటుడయ్యాడు. ఇతను రాముడు, సీత రెండు పాత్రల్ని నటించాడు.

మరి త్రిపాత్రాభినయం చేసిన మొదటి నటుడెవరు? 1970 లో ‘హమ్‌జోలీ’ అనే హిందీ సినిమాలో కమెడియన్ మెహమూద్ త్రిపాత్రాభినయపు తొలి నటుడయ్యాడు. శివరాం, బలరాం, పరశురాం అనే మూడు కామెడీ పాత్రలు నటించాడు. 1991 లో ‘మైన్ ప్యార్ కియా’ ఫేమ్ హిందీ కమెడియన్ లక్ష్మీ కాంత్ బిర్డే 4 పాత్రలు వేసిన తొలి నటుడయ్యాడు. హీరో ఫ్రెండ్ పాత్రతో బాటు అమర్, అక్బర్, ఆంథోనీ అనే మరో మూడు కామెడీ పాత్రల్ని పోషించాడు.

1974 లో ప్రసిద్ధ గాయకుడు, నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, రచయిత, నిర్మాత కిషోర్ కుమార్ ‘బడ్తీకా నామ్ దాడీ’ తో 5 పాత్రలు నటించిన తొలి నటుడయ్యాడు. ప్రధాన పాత్రతో బాటు, థియేటర్ యజమాని, పోలీస్ కమీషనర్, సినిమా డైరెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ పాత్రల్ని నటించాడు. 2000 లో ‘హద్ కర్దీ ఆప్నే’ లో గోవిందా 6 పాత్రలు నటించిన తొలి నటుడయ్యాడు. ఈ కామెడీలో కొడుకు, ఇద్దరు తాతలు, మామయ్య, తల్లి, సోదరి పాత్రలు నటించాడు.

ఇక 6,7, 8 పాత్రలు పోషించిన నటులు లేరుగానీ, 9 పాత్రల్ని పోషించిన నటుడుగా తమిళంలో శివాజీ గణేశన్ స్థాపించిన రికార్డు వుంది. 1964 లో విడుదలైన ‘నవరాత్రి’ ఆ సినిమా. 1966 లో దీని రీమేక్ తెలుగు ‘నవరాత్రి’ లో అక్కినేని నాగేశ్వరరావు, 1974 లో హిందీ రీమేక్ ‘నయా దీన్ నయీ రాత్’ లో సంజీవ్ కుమార్ నవరసాలతో కూడిన 9 పాత్రల్ని నటించారు.

ఇక 2008 లో ‘దశావతారం’ లో కమల హాసన్ 10 పాత్రలు పోషించిన విషయం తెలిసిందే. 10 వ శతాబ్దపు పూజారి నుంచి యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యు బుష్, జపనీస్ మార్షల్ ఆర్టిస్ట్ వరకూ 10 పాత్రలు తానే నటించాడు.

11 వ స్లాట్ ఖాళీగా వుంది. 12 వ స్లాట్ ని ప్రియాంకా చోప్రా భర్తీ చేసింది. ప్రియాంకా చోప్రా 2009 లో ‘వాటీజ్ యువర్ రాశి?’ లో జ్యోతిషంలోని 12 రాశుల్ని పాత్రలుగా నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కింది.

ఇలాగే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కిన నటుడున్నాడు. ఇతను ఐదు, పది, లేదా పదిహేను కాదు, ఒకే సినిమాలో 45 పాత్రలు పోషించాడు! ఒకే సినిమాలో అత్యధిక పాత్రలు చేసి ప్రపంచ రికార్డు సాధించిన భారతీయ నటుడుగా చరిత్ర కెక్కాడు. అతను మలయాళ నటుడు డాక్టర్ జాన్సన్ జార్జి. 2018 లో మలయాళ సినిమా ‘ఆరను నజన్’ (నేనెవర్ని?) లో 45 విభిన్న పాత్రల్ని పోషించాడు. మహాత్మా గాంధీ, జీసస్, లియోనార్డో డా విన్సీ, స్వామీ వివేకానంద, చార్లీ చాప్లిన్, అబ్దుల్ కలాం... మదర్ థెరిస్సా కూడా...మొత్తం కలిపి 45 మంది చారిత్రక పురుషుల పాత్రల్లో గంటా 47 నిమిషాల సినిమా పొడవునా కనిపిస్తూ పోయాడు!

దీనికి తనే నిర్మాత. పిఆర్ ఉన్నికృష్ణన్ దర్శకుడు. మేకప్ రాయ్ ఫణిస్సేరీ, కాస్ట్యూమ్స్ మీరా రాయ్, ఛాయాగ్రహణం కపిల్ రాయ్, సంగీతం వినోద్ వేణుగోపాల ఆచార్య.

డార్విన్ పరిణామ సిద్ధాంతంలో కోతి నుంచి మనిషి వరకూ, అట్నుంచి బుద్ధుడు, కృష్ణుడు, క్రీస్తు, గెలీలియో, లియోనార్డో డావిన్సీ, చార్లీ చాప్లిన్, చే గువేరా, గాంధీ, వివేకానంద, మదర్ థెరిస్సా, అబ్దుల్ కలాం ...మొదలైన వారితో గ్లోబల్ మ్యాన్ అనే ఫిలాసఫర్ చెప్పే కథ ఇది. గ్లోబ్‌మ్యాన్ ఆలోచనలు, పరిశోధనలు, పరిశీలనలు, ప్రయాణాలు ప్రధానంగా సాగే సినిమా ఇది. గ్లోబ్‌మ్యాన్ ఎప్పుడూ ‘నేనెవరు?’ అని ప్రశ్నించుకుంటూ భుజంపై భూగోళాన్ని మోస్తూ వుంటాడు. అతను ప్రపంచ యాత్రికుడు. అతడి ప్రయాణంలో గాంధీ విగ్రహం కనిపిస్తే, వెంటనే గాంధీ గురించి ఆలోచిస్తాడు. గాంధీజీగా రూపాంతరం చెందుతాడు. వీధుల్లో ప్రసంగిస్తాడు, 'మీరు నన్ను జాతిపితగా ప్రతిష్టించారు. రోడ్డు పక్కన మంచు, వాన, ఎండకి నన్ను వదిలేశారు. కాకులు నా తలపై కొడుతున్నాయి. అసలు నన్ను జాతిపితగానే భావిస్తున్నారా? ఇక్కడ మరో స్వాతంత్య్ర పోరాటం జరగొచ్చు.'

ఇలా 45 పాత్రలుగా రూపాంతరం చెందుతూ, ప్రజల్ని ప్రశ్నిస్తూ, ‘నేనెవరు’ అనే అన్వేషణలో భాగంగా సాగిపోతూంటాడు. గ్లోబ్‌మ్యాన్ కథ చెబుతూ సమకాలీన సంఘటనల్ని కూడా స్పృశిస్తాడు. ఈ యుగంలో మహానుభావులు జీవించి వుంటే ఏమవుతుంది, వారి రియాక్షన్‌ ఎలా వుంటుందనేది కూడా సినిమా ప్రజెంట్‌ చేస్తుంది.

ఇదీ జాన్సన్ జార్జి సాధించిన గిన్నీస్ రికార్డు 45 పాత్రల కథాకమామీషు!


First Published:  31 Aug 2023 8:43 AM GMT
Next Story