Telugu Global
Cinema & Entertainment

పైరసీకి సినిమా బడ్జెట్ లో 5 శాతం ఫైన్!

రాజ్యసభ ఆమోదించిన సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు 2023 పైరసీదార్ల ఆట కట్టు చేస్తుందని సినిమా పరిశ్రమ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

పైరసీకి సినిమా బడ్జెట్ లో 5 శాతం ఫైన్!
X

పైరసీకి సినిమా బడ్జెట్ లో 5 శాతం ఫైన్!

రాజ్యసభ ఆమోదించిన సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు 2023 పైరసీదార్ల ఆట కట్టు చేస్తుందని సినిమా పరిశ్రమ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా పైరసీ పెద్ద బెడదగా మారింది. గత సంవత్సరం పైరసీ సైట్లలో 215 బిలియన్ల అక్రమ వ్యూస్ నమోదైనట్టు గ్లోబల్ పైరసీపై నిఘా పెట్టే బ్రిటన్ లోని యాంటీ పైరసీ టెక్నాలజీ కంపెనీ మూసో వెల్లడించింది. 2021 - 2022 లలో 480,000 సినిమాలు, టీవీ షోలతో పైరసీ 18 శాతం పెరుగుదలని చూపుతోందని పేర్కొంది. ఈ కంపెనీ 2017లో ఏర్పడిన అలయన్స్ ఫర్ క్రియేటివిటీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ (ఏస్) లో కీలక సభ్యత్వం పొందింది.

ఏస్ ఘరానా పైరసీ ఆపరేటర్‌లని ట్రాక్ చేయడానికి, పోలీసుల్ని అప్రమత్తం చేయడానికీ గ్రౌండ్ వర్క్ చేస్తుంది. 2023 లోనే స్పెయిన్, బ్రెజిల్, జర్మనీ, వియత్నాం, ఈజిప్ట్, ట్యునీషియాలో ఆపరేటర్‌లని మూసివేయడంలో ఏస్ సహాయపడింది. ఈ ఆపరేటర్లు నిర్వహించే పైరసీ వెబ్ సైట్లలో మిలియన్ల కొద్దీ నెలసరి చందాలు కట్టే వినియోగదారులున్నారు.

నేపథ్యంలో రాజ్య సభ ఆమోదించిన సినిమాటోగ్రాఫ్ (సవరణ) బిల్లు 2023 తో కేంద్రం కఠినమైన పైరసీ నిరోధక నిబంధనల్ని ప్రవేశ పెట్టింది. ఈ సవరణ చట్టం ప్రకారం, అనధికారిక రికార్డింగ్, ఎగ్జిబిషన్ శిక్షార్హమైన నేరాలు. ఈ నేరాలకు 3 నెలల నుంచి 3 సంవత్సరాల మధ్య జైలు శిక్ష, 3 లక్షల రూపాయలు జరిమానా తో బాటు, ఈ సినిమా లేదా టీవీ షో ఉత్పత్తి చేయడానికి అయిన వ్యయంలో 5 శాతం పైరసీకి పాల్పడిన వ్యక్తి నుంచి వసూలు చేస్తారు.

ఇంకా సెన్సార్‌షిప్, కాపీరైట్‌లని కూడా కవర్ చేయడానికి చట్టం పరిధిని విస్తరించారు. వయసు ఆధారిత సెన్సార్ సరిఫికెట్ల వర్గీకరణని కూడా నిర్వచించించారు. ‘యూ’ సర్టిఫికేట్ తో బాటు, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వున్న పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పర్యవేక్షణలో వీక్షించేందుకు ‘యూఏ’ సర్టిఫికేట్, పెద్దలకు మాత్రమే అనుమతిగల ‘ఎ’ సర్టిఫికేట్, ఏదైనా వృత్తి లేదా వ్యక్తుల తరగతి సభ్యులకి మాత్రమే వర్తించే ‘ఎస్’ సరిఫికేట్ జారీ చేస్తారు. ‘యూఏ’ కేటగిరీని మూడు వర్గాలుగా విభజించారు : యూఏ 7+, యూఏ 13+, యూఏ 16+.

ఈ చట్టం ప్రకారం సెన్సార్ బోర్డు జారీ చేసే సర్టిఫికేట్ ప్రస్తుతమున్న 10 సంవత్సరాల చెల్లుబాటు కాల పరిమితిని తొలగించి, శాశ్వతంగా చెల్లుబాటయ్యే సవరణ చేశారు. సవరణలు ప్రస్తుత కాలానికి అనుగుణంగా ధృవీకరణ ప్రక్రియని మరింత ప్రభావవంతంగా మారుస్తాయని, సినిమా పైరసీని సమగ్రంగా అరికట్టగలవనీ, తద్వారా చలనచిత్ర పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందడానికీ, ఈ రంగంలో ఉద్యోగాల కల్పనని పెంచడానికీ సహాయపడతాయనీ, స్పాట్ బాయ్ నుంచీ నిర్మాతల వరలూ ప్రతి ఒక్కరి హక్కుల్ని కాపాడతాయనీ కేంద్రం పేర్కొంది.

అయితే ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్ ని ఈ చట్టం కవర్ చేయదు. అప్పుడు సెన్సార్ చేయని సినిమాని ఓటీటీల్లో ప్రసారం చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

సవరణ చట్టం రూపకల్పన కోసం 2017 లో శ్యామ్ బెనెగల్ కమిటీని ఏర్పాటు చేశారు. సెన్సార్ ధృవీకరణ ప్రక్రియని క్రమబద్ధీకరించే, వర్గీకరణని మెరుగుపరచే లక్స్యలతో ఈ కమిటీ ఏర్పాటయింది. దీంతో బాటు కంటెంట్ ని అనధికార రికార్డింగ్ చేయడం, కాపీ చేయడం, ప్రసారం చేయడం మొదలైన వాటిని నిరోధించడం లక్ష్యంగా ఈ కమిటీ సిఫార్సులు చేసింది.

పైరసీ ముప్పు వల్ల సినిమా పరిశ్రమ ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు నష్టపోతోందని ప్రభుత్వం తెలిపింది. ఇక పైరసీపై ఉక్కుపాదంగా ఈ చట్టం పైరసీకి పాల్పడిన వారితో పాటు, అనధికార రికార్డింగ్‌ కి సహకరించే లేదా ప్రయత్నించిన వారికి జరిమానాలతో బాటు, జైలు శిక్ష మాత్రమే గాక, సినిమా బడ్జెట్ లో 5 శాతం అదనపు జరిమానా తప్పవు.

ఇంతకి ముందు థియేటర్‌లో క్యామ్‌కార్డర్ పైరసీ మాత్రమే యాంటీ పైరసీ చట్టాల పరిధిలోకి వచ్చింది. ప్రస్తుత చట్టం అమల్లోకి వస్తే, ఇంటర్నెట్ పైరసీ కూడా చట్టపరమైన శిక్ష పరిధిలోకి వస్తుంది. అనధికార కాపీలు ప్రసారం చేసే వెబ్‌సైట్‌లని బ్లాక్ చేయడానికి కూడా ఈ చట్టం అనుమతిస్తుంది.

First Published:  29 July 2023 11:20 AM GMT
Next Story