Telugu Global
Cinema & Entertainment

గత వారం కూడా 4 సినిమాలు గల్లంతు!

ఫిబ్రవరి చివరి వారం కూడా విడుదలైన 4 ప్రధాన సినిమాలూ ఫ్లాపయ్యాయి.

గత వారం కూడా 4 సినిమాలు గల్లంతు!
X

ఫిబ్రవరి చివరి వారం టాలీవుడ్ బాక్సాఫీసు ఫలితాల్లాగే మార్చి మొదటి వారం ఫలితాలూ తేలాయి. విడుదలైన 4 ప్రధాన సినిమాలూ ఫ్లాపయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం కూడా విడుదలైన 4 ప్రధాన సినిమాలూ ఫ్లాపయ్యాయి. చిన్నా చితకా సినిమాలు కలుపుకుంటే ఫిబ్రవరి చివరి వారం ఏడుకి ఏడూ, మార్చి మొదటి వారం ఎనిమిదికి ఎనిమిదీ ఫ్లాపయ్యాయి. ఫిబ్రవరి చివరి వారం సుందరం మాస్టార్, సిద్ధార్థ్ రాయ్, మస్త్ షేడ్స్ వున్నాయిరా, ముఖ్యగమనిక అనే 4 ప్రధాన సినిమాలతో బాటు, ప్రేమలో ఇద్దరు, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ, గ్రౌండ్ అనే 3 చిన్నా చితకా; మార్చి మొదటి వారం ఆపరేషన్ వాలంటైన్, భూతద్దం భాస్కర్ నారాయణ, వ్యూహం, చారి 111 అనే 4 ప్రధాన సినిమాలు, ఇంటి నంబర్ 13, మా ఊరి రాజా రెడ్డి, రాధా మాధవం, ఎస్ -99 అనే 4 చిన్నా చితకా ఫ్లాపుల లిస్టులో చేరాయి.

మార్చి ఫస్టున ఆశ్చర్య పర్చిందేమిటంటే, వరుణ్ తేజ్ నటించిన ‘ఆపరేషన్ వాలంటైన్’ అట్టర్ ఫ్లాప్ అవడం. దీనికి పూర్తి బాధ్యుడు దర్శకుడే. రజనీకాంత్ నటించిన ‘లాల్ సలాం’ లో రెండు కథలు కలిపేసి ఒక సినిమా తీసినట్టే, ‘ఆపరేషన్ వాలంటైన్’ లో మూడు కథలు కలిపేసి ఒక భారీ సినిమా తీశాడు. ఉద్దేశం ఫుల్వామా దాడి గురించి సినిమా తీయడమైతే, ఫుల్వామాకి ముందు ఏదో ఏర్ ఫోర్స్ టెస్ట్ అంటూ కల్పిక కథ నడిపి, తర్వాత ఫుల్వామా కథ నడిపి, మళ్ళీ ఆ తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్ కి పాక్ ప్రతీకార దాడి అంటూ మరో కల్పిత కథ కలిపాడు. పూర్తి నిడివి ఫుల్వమా దాడి మీద సినిమా తీయరాక పోతే వూరుకోవాలి. అతుకుల బొంత చేసి యుద్ధ విమానాల విన్యాసాలతో హాలీవుడ్ యాక్షన్ చూపిస్తే ప్రేక్షకులు ఈ రోజుల్లో ఫూల్స్ కారు.

మరొక ఆశ్చర్య పర్చే అంశమేమిటంటే, ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఫ్లాప్ అవడం. మీడియా మంచి రేటింగ్స్ ఇచ్చినా ప్రేక్షకులు ఉపేక్షించడం. దీని ఫస్టాఫ్ బలహీనమే నిజమే, కానీ సెకండాఫ్ దిమ్మదిరిగే విషయముందిగా? ప్రేక్షకుల కింకేం కావాలి? కాకపోతే ప్రతీ మూడో సినిమాలో మైథాలజీ కలపడం, క్లయిమాక్స్ లో హీరో- ‘కాంతార’ లో హీరో రిషభ్ శెట్టి క్లయిమాక్సులో దేవుడు పూని భూతకోల నృత్యం చేసినట్టు- నృత్యం చేయడం ప్రతీ మూడో తెలుగు సినిమాలో మామూలైపోయింది. ఎన్ని సార్లు ఇవే చూపిస్తారు. రానున్న ‘పుష్ప 2’ లో కూడా ఇదే నాట్యం చేసే వేషంలో అల్లు అర్జున్ స్టిల్స్ కన్పిస్తున్నాయి. ఇదొక అంటు వ్యాధిలా సోకింది తెలుగు సినిమాలకి.

ఇక ఇద్దరు కమెడియన్లు హీరోలుగా నటించారు. ‘చారి 111’ లో వెన్నెల కిషోర్, ‘మస్తు షేడ్స్ వున్నాయిరా లో అభినవ్ గోమఠం. ఇవేం సినిమాలో ఎవరికైనా అర్ధమైతే ఐన్ స్టీన్ అవార్డుతో సన్మానించ వచ్చు. కమెడియన్లు హీరోలైతే ఇంత కంగాళీ చేస్తారేమో?

రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఇక హిట్టవుతాయని ఎవరూ అనుకోరు. ఆయనకి ప్రేక్షకులు వున్నారా అన్నది కూడా సందేహమే. అయినా క్రమం తప్పకుండా సినిమాలు వస్తూంటాయి. రాజకీయ సినిమాలు. ఇంకో రాజకీయ సినిమా ‘వ్యూహం’ అదేదో ఆయన రెగ్యులర్ గా ట్విట్టర్ లో ట్వీట్లు చేసినట్టు వుంది. సినిమా క్రాఫ్ట్ ని పూర్తిగా పక్కన పెట్టేసి ఇలా డాక్యుమెంటరీల్లాంటి ట్వీట్లు చూపించడమే. సోషల్ మీడియాలో బిజీ అయిపోయి సినిమాలకీ గతి.

జనవరి నుంచి చూసుకుంటే ఒక్క ‘హనుమాన్’ తప్ప ఏదీ హిట్ కాలేదు. మహేష్ హేశ్ బాబు ‘గుంటూరు కారం’, నాగార్జున ‘నా సామి రంగా’ , వెంకటేష్ ‘సైంధవ్’, రవితేజ ‘ఈగల్’, ఇప్పుడు వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ ... ఇలా విడుదలైన స్టార్ సినిమాలన్నీ ఫ్లాపయ్యాయి. సుహాస్ అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’, సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవ కోన’ చిన్న హీరోల సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి. ఒక్క ‘హనుమాన్’ మాత్రనే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇప్పుదూ మార్చి రెండవ వారం, రేపు శుక్రవారం పాత మూస సినిమాలతో ఫ్లాపుల్లో వుంటున్న గోపీచంద్ ‘భీమా’, విశ్వక్ సేన్ ప్రయోగాత్మకం ‘గామి’, మలయాళం సూపర్ హిట్ తెలుగు డబ్బింగ్ ‘ప్రేమలు’ మూడు ప్రధాన సినిమాలు, ఇంకో చిన్నా చితక విడుదలవుతున్నాయి. వీటి ఫలితం రేపు తేలిపోతుంది.

First Published:  7 March 2024 9:49 AM GMT
Next Story