Telugu Global
Cinema & Entertainment

2023 టాలీవుడ్ స్కోరు: 160 లో 17 విజయాలు

2023 లో కూడా తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ పానిండియా కలలతో ప్రయాణించింది.

2023 టాలీవుడ్ స్కోరు: 160 లో 17 విజయాలు
X

2023 లో కూడా తెలుగు చలన చిత్ర సీమ టాలీవుడ్ పానిండియా కలలతో ప్రయాణించింది. కానీ ప్రయాణపు బడలిక స్పష్టంగా కనిపించింది. ‘ఏ స్టార్లు’, ‘బీ స్టార్లు’ కలిసికట్టుగా పానిండియా మీద దండయాత్ర చేశారు. కానీ పల్లెకు పోదాం పారును చూద్దాం ఛలో ఛలో అని తిరిగొచ్చేశారు, ఒకరు తప్ప. మిగిలిన 8 మందీ బయల్దేరిన చోటుకే తిరిగొచ్చి, టౌను పక్కకెళ్ళొద్దురా డింగరీ డాంబికాలు పోవద్దురా అని లోకల్ గా సెటిలై పనులు చూసుకోసాగారు. రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, కళ్యాణ్ రామ్, రామ్ పోతినేని, నిఖిల్ సిద్ధార్థ, సమంతా ... నటించిన తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పానిండియా సినిమాలు తెలుగులోనే సక్సెస్ కి దూరంగా వుండిపోయాయి- ఒక్క నాని ‘దసరా’ తప్ప. తెలుగులో అదే పాత మూసని ఉత్పత్తిచేస్తూ దాన్ని పానిండియాలో విక్రయించాలనుకోవడం అత్యాశే అయింది. ఈ ప్రయాణంలో ఒక్క ప్రభాస్ కే ‘సాలార్’ తో పానిండియా పతకం దక్కింది.

రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’, నాని ‘దసరా’, విజయ్ దేవరకొండ ‘ఖుషీ’, కళ్యాణ్ రామ్ ‘డెవిల్’, రామ్ పోతినేని ‘స్కంద’, నిఖిల్ సిద్ధార్థ ‘స్పై’, సమంత ‘శాకుంతలం’ పానిండియా సినిమా స్థాయిని అందుకోలేక పోయాయి. పానిండియాకి ‘బాహుబలి’, ‘ట్రిపులార్’, ‘కేజీఎఫ్’, ‘విక్రమ్’, ‘పుష్ప’, ‘సాలార్’, ‘కల్కి 2898 ఏడీ’ లాంటి బిగ్ కాన్వాస్ మీద హై కాన్సెప్ట్ మాస్ యాక్షన్ కథలు కావాలి. హాలీవుడ్ లో హై కాన్సెప్ట్ సినిమాలు ఎలా తీస్తారో ఆ తీరుతెన్నుల్లో వుండాలి. లేదా తక్కువ రేంజిలో జనసామాన్యం సామూహిక చైతన్యాన్ని పట్టుకునే ‘కాంతారా’, ‘విరూపాక్ష’ లాంటి తాంత్రిక- జానపద కథాంశాలు కావాలి. 2022లో ‘కాంతారా’, 2023 లో ‘విరూపాక్ష’ అనే మీడియం బడ్జెట్లు పానిండియా స్థాయిలో ఇందుకే నిలబడ్డాయి.

ఇక పానిండియా + లోకల్ సినిమాలన్నీ కలిపి చూస్తే 2023 లో మొత్తం ‘ఏ స్టార్లు’ నటించినవి 17 పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో ఏడే హిట్టయ్యాయి. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’, ‘భగవంత్ కేసరి’, నాని ‘హాయ్ నాన్నా’, ‘దసరా’, ధనుష్ ‘సార్’, ప్రభాస్ ‘సాలార్’ 7 మాత్రమే హిట్టయి- చిరంజీవి నటించిన మరొకటి ‘భోళాశంకర్’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ ఒకటి నటిస్తే ఈ ఒకటీ, రవితేజ నటించిన ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ రెండూ, విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ ఒకటి నటిస్తే ఆ ఒకటీ, రామ్ పోతినేని ‘స్కంద’ ఒకటి నటిస్తే ఇదీ, కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’, ‘డెవిల్’ రెండు నటిస్తే రెండూ, నితిన్ ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ’ ఒకటి నటిస్తే ఈ ఒకటీ, సమంత ‘శాకుంతలం’ ఒకటి నటిస్తే ఇదీ, మొత్తం కలిపి 10 ఫ్లాపయ్యాయి. అంటే ఈ సంవత్సరం పవన్ కళ్యాణ్, రవితేజ, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, నితిన్, సమంతా ‘ఏ స్టార్లు’ ఏడు గురూ సక్సెస్ ని పట్టుకోలేకపోయారు. 7 హిట్లు, 10 ఫ్లాపులతో ‘ఏస్టార్లు’ 41 శాతం సక్సెస్ నిచ్చారు.

బీ స్టార్లు 40/6

‘బీ స్టార్లు’ పదండి ముందుకు పదండి తోసుకు అంటూ 40 సినిమాలూ నటించి, 6 దాటి పైకి పోలేక 34 సినిమాల్నీ ఢామ్మనిపించారు. వీళ్ళల్లో ఈ సంవత్సరం కూడా మోస్ట్ వాంటెడ్ ఫ్లాప్ హీరోగా సంతోష్ శోభన్ నమోదయ్యాడు. నటించిన నాలుగూ (కళ్యాణం కమనీయం, శ్రీదేవీ శోభన్ బాబు, అన్నీ మంచి శకునములే, ప్రేమ్ కుమార్) ఫ్లాపయ్యాయి. రెండో స్థానాన్ని కిరణ్ అబ్బవరమే ఆక్రమించాడు. నటించిన మూడూ (వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్, రూల్స్ రంజన్) ఫ్లాప్స్ తో.

మెగా క్యాంపు స్టార్లు సాయి ధరమ్ తేజ్ (పవన్ తో కలిసి ‘బ్రో’), వైష్ణవ్ తేజ్ (ఆది కేశవ) వరుణ్ తేజ్ (గాండీవ ధారి అర్జున) లు మూడు నటిస్తే మూడూ ఫ్లాపయ్యాయి. నాగార్జున వారసులు నాగచైతన్య (కస్టడీ), అఖిల్ (ఏజెంట్) రెండు నటిస్తే రెండూ ఫ్లాపయ్యాయి. సుధీర్ బాబు నటించిన (హంట్, మామా మశ్చీంద్ర) రెండూ ఫ్లాపయ్యాయి. విశ్వక్ సేన్ నటించిన (దాస్ కా ధమ్కీ, బూ) రెండూ ప్లాపయ్యాయి. శ్రీసింహా కోడూరి రెండు నటిస్తే (భాగ్ సాలే, ఉస్తాద్ ) రెండూ ఫ్లాపయ్యాయి.

ఇక ఒక్కొక్కటి నటిస్తే ఫ్లాపయిన హీరోలు : నాగశౌర్య (రంగబలి), జగపతిబాబు (రుద్రాంగి), కార్తికేయ (బెదుర్లంక), నిఖిల్ సిద్ధార్ధ (స్పై), సందీప్ కిషన్ (మైకేల్), గోపీచంద్ (రామబాణం), అల్లరి నరేష్ (ఉగ్రం), సునీల్ (భువన విజయం), నరేష్ (మళ్ళీ పెళ్ళి), ఆది (సి ఎస్ ఐ సనాతన్), అజయ్ (చక్రవ్యూహం), బెల్లంకొండ గణేష్ (నేను స్టూడెంట్ ని సార్), తిరువీర్ (పారేషాన్), రాహుల్ రామకృష్ణ (ఇంటింటి రామాయణం), నవీన్ చంద్ర (మంత్ ఆఫ్ మధు), మై నేమ్ ఈజ్ శృతి (హన్సిక).

ఇలా 26 మంది ‘బీ స్టార్లు’ 34 ఫ్లాపులిస్తే, ఒకటి నటించి ఆ ఒకటి హిట్టిచ్చిన ‘బీ స్టార్లు’ ఆరుగురు - శ్రీవిష్ణు (సామజవర గమన), నవీన్ పోలిశెట్టి -అనూష్కా శెట్టి (మిస్ శెట్టి- మిస్టర్ పోలిశెట్టి), సాయి ధరమ్ తేజ్ (విరూపాక్ష), శ్రీకాంత్ (కోట బొమ్మాళి), తరుణ్ భాస్కర్ (కీడా కోలా), పాయల్ రాజ్పుత్ (మంగళవారం). అంటే 6 హిట్లు, 34 ఫ్లాపులతో 32 మంది ‘బీ స్టార్లు’ 15 శాతం సక్సెస్ నిచ్చారు.

ఇక చిన్న సినిమాలు 113 విదుదలయ్యాయి. వీటిలో 95 శాతం కొత్త వాళ్ళతో వూరూ పేరూ లేనివే. మొత్తం 113 చిన్న సినిమాల్లో ‘బలగం’, బేబీ’, ‘మ్యాడ్’, ‘మావూరి పొలిమేర 2’ అనే 4 మాత్రమే హిట్టయ్యాయి. సక్సెస్ రేటు 3.5 శాతమే. మొత్తం అన్ని సినిమాలూ కలిపి 160 విడుదలైతే, 7 ‘ఏ స్టార్’ హిట్లు, 6 ‘బీ స్టార్’ హిట్లు, 4 చిన్న హిట్లు తేలాయి. సక్సెస్ రేటు 10 శాతం.

ఈ పది శాతం సక్సెస్ దశాబ్దాలుగా మెయింటైన్ అవుతున్నదే టాలీవుడ్ లో. ఇంతకి మించి ఎదగడానికి ప్రయత్నించడం లేదు. అనూహ్యంగా అందివచ్చిన పానిండియా అవకాశాలతో కూడా. ‘ఏ సినిమాలు’ పానిండియా’ వైపు చూస్తూంటే, ‘బీ సినిమాలు’ ఆ ఖాళీలో ‘ఏ సినిమాలు’ గా ఎదగాలి. ‘బీ సినిమాల’ ఖాళీలోకి ‘సి సినిమాలు’ చేరుకోవాలి. ఈ అభివృద్ధి ప్రణాళిక ఎవరి దగ్గరా లేదు.

First Published:  2 Jan 2024 10:00 AM GMT
Next Story