Telugu Global
Business

యూట్యూబర్ల మీద చర్యలు తీసుకునే సెబీకి.. అదానీ బాగోతాలు కనపడటం లేదా?

యూట్యూబ్, సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా అబద్దపు ప్రచారం చేయడం వల్ల సదరు స్క్రిప్ట్ వాల్యూ పెంచి లాభపడినట్లు సెబీ చెప్తోంది.

యూట్యూబర్ల మీద చర్యలు తీసుకునే సెబీకి.. అదానీ బాగోతాలు కనపడటం లేదా?
X

అదానీ ఎంటర్‌ప్రైజస్ షేర్లు గత నెలన్నరలో ఎంత దారుణంగా పతనం అయ్యాయో తెలిసిందే. అదానీ గ్రూప్‌కు చెందిన కంపెనీల్లో చాలా వరకు డొల్ల కంపెనీల పెట్టుబడులు ఉన్నాయని.. కావాలనే వాటి షేర్లను అసలైన విలువ కంటే ఎక్కువగా పెంచారంటూ హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల చేసింది. అప్పటి వరకు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదాని.. కొన్ని రోజుల్లోనే 30వ స్థానం కంటే దిగువకు పడిపోయాడు. ఇంత జరుగుతున్నా ఆ సంస్థపై సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మదుపర్ల ప్రయోజనాలు కాపాడటానికి కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు.

కాగా, ఇదే సమయంలో స్టాక్ మార్కెట్‌లో ఒక షేర్ ధరను కావాలని యూట్యూబ్ ద్వారా ప్రచారం చేసి.. పెంచారంటూ కొంత మందిపై ఫిర్యాదులు అందాయి. సాధనా బ్రాడ్‌కాస్టింగ్ షేర్ విలువను అబద్దపు ప్రచారాల ద్వారా పెంచి బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి, ఆయన భార్య మరియా గోరెట్టి, మరో 29 మంది రూ.41.85 కోట్ల మేర లబ్ది పొందారని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులపై రంగంలోకి దిగిన సెబీ.. సదరు స్క్రిప్ట్ విషయంలో వాళ్లందరూ అవకతవకలు పాల్పడిన విషయం నిజమేనని తేల్చడంతో పాటు రూ.41.85 కోట్ల పెనాల్టీని విధించింది.

కేవలం జరిమానా విధించడమే కాకుండా.. ఈ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయిన ప్రతీ ఒక్కరు ఎలాంటి స్టాక్స్ కొనుగోలు, అమ్మకం, లేదా మధ్యవర్తులుగా వ్యవహరించడం చేయవద్దని సెబీ ఆదేశించింది. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని సెబీ పేర్కొన్నది. కాగా, ఈ స్టాక్స్ అమ్మకాలు, కొనుగోలు ద్వారా అర్షద్ వార్సి రూ.29.43 లక్షలు, ఆయన భార్య రూ.37.56 లక్షల మేర లబ్ది పొందినట్లు సెబీ తెలిపింది. యూట్యూబ్, సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా అబద్దపు ప్రచారం చేయడం వల్ల సదరు స్క్రిప్ట్ వాల్యూ పెంచి లాభపడినట్లు సెబీ చెప్తోంది.

కాగా, సెబీ తీసుకున్న చర్య సరైనదే అయినా.. ఇతరుల విషయంలో దాని వ్యవహార తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. యూట్యూబ్ ద్వారా మోసం చేసి రూ.41 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిందితులపై చర్యలు తీసుకోవడాన్ని హర్షిస్తున్నాము. కానీ అదానీ స్కామ్ ఇంతకు వెయ్యి రెట్లు పెద్దదే కదా.. మరి ఆయన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ స్టేట్ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వై. సతీశ్ రెడ్డి ట్వీట్ చేశారు.


First Published:  5 March 2023 11:44 AM GMT
Next Story