Telugu Global
Business

వర్క్– లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదా? మాంక్ మోడ్ ట్రై చేసి చూడండి!

మాంక్ మోడ్ పని విధానం వల్ల వర్క్– లైఫ్ బ్యాలెన్స్‌తో పాటు వర్క్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.

వర్క్– లైఫ్ బ్యాలెన్స్ ఉండట్లేదా? మాంక్ మోడ్ ట్రై చేసి చూడండి!
X

పని చేసే ప్రతి ఒక్కరికీ వర్క్– లైఫ్ బ్యాలెన్స్ ఉండడం అవసరం. సమయాన్నంతా పనికే కేటాయించి పర్సనల్ లైఫ్ పట్టించుకోకపోతే జీవితానికి అర్థం ఉండదు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలామంది పని ఒత్తిడిలో పడి లైఫ్‌ను పక్కనపెట్టేస్తున్నారు. ఆరోగ్యానికి, ఫ్యామిలీకి కూడా తగినంత టైం కేటాయించలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే దీన్ని సరిచేసేందుకు ఓ కొత్త విధానాన్ని కనిపెట్టారు నిపుణులు. అదే మాంక్ మోడ్. ఇదెలా ఉంటుందంటే..

మాంక్ మోడ్ పని విధానం వల్ల వర్క్– లైఫ్ బ్యాలెన్స్‌తో పాటు వర్క్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. రోజంతా కాల్స్, కాన్ఫరెన్స్‌లతో మునిగిపోతున్న చాలామంది ఫ్యామిలీ కోసం సమయం కేటాయిద్దామన్నా దానికి తగిన మైండ్‌సెట్ ఉండట్లేదని వాపోతున్నారు. పనిలో భాగంగా వాడే యాప్స్, వెబ్‌సైట్స్ వల్ల డిజిటల్ డిస్ట్రాక్షన్ కలిగి ఇటు పని, అటు పర్సనల్ లైఫ్ దెబ్బతింటోందట.

2022లో చేసిన హార్వర్డ్ బిజినెస్ స్టడీ ప్రకారం ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో చాలామంది వర్కర్లు సుమారు 1200 సార్లు వెబ్‌సైట్స్, యాప్స్ మధ్య స్విచ్ అవుతున్నారట. తమ వర్కింగ్ టైంలో సుమారు 9 శాతం డిజిటల్ డిస్ట్రాక్షన్‌కే పోతుందని ఆ స్టడీ ద్వారా వెల్లడైంది. దీనివల్ల పనిలో చికాకు, ప్రొడక్టివిటీ తగ్గడంతో పాటు పని తర్వాత నీరసించడం, బర్న్ అవుట్, ఒత్తిడిగా ఫీలవ్వడం వంటివి పెరుగుతున్నాయి.

ఈ తరహా వర్క్ టెన్షన్స్‌లో మునిగిపోతున్న చాలామంది ఇప్పుడు ‘మాంక్ మోడ్’ అనే కొత్త పని విధానాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇది పాపులర్ అవుతోంది. పనికీ, పర్సనల్ లైఫ్‌కు మధ్య బ్యాలెన్స్ తీసుకొచ్చేందుకు ఈ మోడ్ బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి పరధ్యానం లేకుండా ఒకే పనికి కట్టుబడి ఉండడం ఈ మోడ్ ముఖ్య విధానం. ఏకాంతంగా పని చేసుకోవడం, నిర్దిష్టమైన క్రమశిక్షణ కలిగి ఉండడం ఇందులో భాగం. దీన్ని బౌద్ధ సన్యాసుల లైఫ్‌స్టైల్ నుంచి ప్రేరణగా తీసుకుని రూపొందించారు. అందుకే దీన్ని ‘మాంక్ మోడ్’ అని పేరు పెట్టారు. మనదేశంలో 47 శాతం మంది ఉద్యోగులు ఈ మాంక్ మోడ్‌ను ప్రయత్నిస్తున్నారని ఇటీవల లింక్డ్‌ఇన్ సర్వే వెల్లడించిది.

లాభాలివే..

మాంక్ మోడ్ అనేది కేవలం కార్పొరేట్ ఉద్యోగులకే కాదు, స్టూడెంట్స్, బిజినెస్ పర్సన్స్, క్రియేటివ్ ఫీల్డ్‌లో పనిచేసేవాళ్లు.. ఇలా ఎవరైనా ఫాలో అవ్వొచ్చు. ఉదాహరణకు పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థి మాంక్ మోడ్‌ ఫాలో అవ్వడం ద్వారా పరధ్యానం లేకుండా షెడ్యూల్‌కు కట్టుబడి చదువుకోగలడు. తద్వారా మెరుగైన రిజల్ట్స్ సాధించొచ్చు. అలా ఇది ఏ రంగంలోని వారికైనా వర్తిస్తుంది. ఈ మోడ్‌లో వర్క్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ, క్రియేటివిటీ పెరుగుతోంది.

టెక్నిక్స్ ఇవే..

స్పష్టమైన లక్ష్యాలు: మాంక్ మోడ్‌లో పని చేసేందుకు కొన్ని టెక్సిక్స్ ఫాలో అవ్వాలి. వాటిలో మొదటిది స్పష్టమైన గోల్‌ను సెట్ చేసుకోవడం. ముందుగా మీ లక్ష్యం ఏంటో స్పష్టంగా తెలుసుకోగలగాలి. అది రోజువారీ లక్ష్యమైనా, లాంగ్ టర్మ్ గోల్ అయినా దాన్ని మీరు ఎరుకతో తెలుసుకుని పని మొదలుపెట్టాలి.

టైం మేనేజ్‌మెంట్: మాంక్ మోడ్‌లో ముఖ్యమైన స్టెప్ టైం మేనేజ్‌మెంట్. మీ లక్ష్యం కోసం ఎడతెరపి లేకుండా పనిచేయొచ్చు. కానీ, దానికంటూ ఒక షెడ్యూల్ కేటాయించుకోవాలి. రోజులో కొన్ని టైం స్లాట్స్‌ను కేటాయించుకుని ఆయా గంటల్లో నిరంతరాయంగా పనిచేయాలి.

నో డిస్ట్రాక్షన్స్: టైం మేనేజ్‌మెంట్ లేకపోవడం వల్ల పరధ్యానం ఏర్పడుతుంది. అందుకే పర్టిక్యులర్ టైం స్లాట్స్ కేటాయించుకుని ఆ టైంలో మరే ఇతర డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకుంటే పని మరింత త్వరగా ముందుకు సాగుతుంది.

రెగ్యులర్ బ్రేక్స్: ఈ మోడ్‌లో అత్యంత కీలకమైన అంశం ఇదే. ఇంటెన్స్ ఫోకస్‌తో పనిచేస్తూనే సమయానికి తగిన బ్రేక్స్ కూడా తీసుకోవాలి. దీనివల్ల మనసు అలసిపోకుండా ఉంటుంది. దానికి కావాల్సిన విశ్రాంతి దొరుకుతుంది. దీనికోసం పోమోడోరో టెక్నిక్‌ ఉపయోగించొచ్చు. అంటే 25 నిమిషాల పని తర్వాత ఐదు నిమిషాల బ్రేక్. ఇలా మీరు ఎంత సేపయినా పనిచేసుకుంటూ పోవచ్చు.

ఇలా మాంక్ మోడ్‌లో పనిచేస్తూ వర్క్– లైఫ్ బ్యాలెన్స్‌ను సరిచేసుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. ఈ విధానంలో పనిచేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరగడంతో పాటు పని వల్ల కలిగే అలసట తగ్గుతంది. ఫలితంగా పర్సనల్ టైంలో బర్న్ అవుట్, యాంగ్జైటీ వంటివి తగ్గుతాయి. కుటుంబం లేదా స్నేహితులతో గడిపే సమయం కూడా ఒత్తిడి లేకుండా హాయిగా సాగుతుంది. అయితే ఈ మోడ్‌లో కూడా కొన్ని సవాళ్లు ఉంటాయి. కానీ, ప్రయత్నం చేసి క్రమశిక్షణ అలవరచుకుంటే ఫలితం తప్పక ఉంటుంది.

First Published:  2 April 2024 2:44 AM GMT
Next Story