Telugu Global
Business

Tata Motors | డీజిల్ కార్ల‌పై తేల్చేసిన టాటా మోటార్స్.. ఏం చెప్పిందంటే..?!

Tata Motors | దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌.. క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా విద్యుత్ కార్ల త‌యారీలో దూకుడుగా దూసుకెళ్తున్న‌ది.

Tata Motors | డీజిల్ కార్ల‌పై తేల్చేసిన టాటా మోటార్స్.. ఏం చెప్పిందంటే..?!
X

Tata Motors | దేశీయ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్‌.. క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా విద్యుత్ కార్ల త‌యారీలో దూకుడుగా దూసుకెళ్తున్న‌ది. దేశీయ ఎల‌క్ట్రిక్ కార్ల మార్కెట్‌లో టాటా మోటార్స్ వాటా 70 శాతం. హ్యుండాయ్ మోటార్స్ ఇండియా, ఎంజీ మోటార్స్ ఇండియా, మెర్సిడెస్‌-బెంజ్‌, ఆడి, బీఎండ‌బ్ల్యూ సంస్థ‌లు ఎల‌క్ట్రిక్ కార్లను దేశీయ మార్కెట్లో విక్ర‌యిస్తున్నాయి. ఫోక్స్‌వ్యాగ‌న్‌, స్కోడా, రెనాల్ట్‌, నిసాన్ వంటి సంస్థ‌లు ఈవీ కార్ల‌ ఆవిష్క‌ర‌ణ‌కు సిద్ధం అయ్యాయి. ఇక దేశీయ కార్ల మార్కెట్‌లో ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్న మారుతి సుజుకి ఎలక్ట్రిక్ కారు వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రంలో మార్కెట్‌లోకి ఎంట‌ర్ అవుతుంద‌ని భావిస్తున్నారు.

క‌స్ట‌మ‌ర్ల ఆకాంక్ష‌లు, అభిరుచుల‌కు అనుగుణంగా సంప్ర‌దాయ పెట్రోల్‌, డీజిల్ కార్ల‌తోపాటు ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేస్తున్న టాటా మోటార్స్‌. బుల్లి కారు టియాగో.ఈవీ నుంచి ఎస్‌యూవీ మోడ‌ల్ నెక్సాన్.ఈవీ వ‌ర‌కూ దేశీయ మార్కెట్‌లో విక్ర‌యిస్తున్న‌ది. ఈ త‌రుణంలో టాటా మోటార్స్ ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ అండ్ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర ఇటీవ‌ల నెక్సాన్‌.ఈవీ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వినియోగ‌దారుల‌ నుంచి గిరాకీ ఉన్నంత వ‌ర‌కూ డీజిల్ కార్లను ఉత్పత్తి చేస్తామ‌ని తెగేసి చెప్పారు.

ఒకవైపు కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి డీజిల్ కార్లపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. కార్ల తయారీ దారులు స్వచ్ఛందంగా డీజిల్ కార్ల తయారీకి స్వస్తి పలుకాలని ఇటీవల సియామ్ సదస్సులో గడ్కరీ సూచించిన సంగతి తెలిసిందే. మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్ ఇండియా వంటి సంస్థ‌లు డీజిల్ కార్ల త‌యారీకి స్వ‌స్తి ప‌లికాయి. ఈ నేప‌థ్యంలో క‌స్ట‌మ‌ర్ల నుంచి గిరాకీ ఉన్నంత కాలం డీజిల్ కార్లు త‌యారు చేస్తామ‌ని టాటా మోటార్స్ ప్ర‌క‌టించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

అయితే, కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్ర ప్ర‌భుత్వం విధించిన‌ రెగ్యులేటరీ నిబంధనలు పాటిస్తూనే డీజిల్ కార్లు ఉత్పత్తి చేస్తామంటున్నారు టాటా మోటార్స్ ప్యాసింజ‌ర్ వెహిక‌ల్స్ అండ్ టాటా ప్యాసింజ‌ర్ ఎల‌క్ట్రిక్ మొబిలిటీ ఎండీ శైలేష్ చంద్ర. కేంద్ర‌ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి క‌ట్టుబడి ఎలక్ట్రిక్ కార్ల తయారీ కోసం స్పీడ్ పెంచుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

First Published:  18 Sep 2023 10:22 AM GMT
Next Story