Telugu Global
Business

రూ. 7 లక్షల కోట్లు ఆవిరి

భారీ నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

రూ. 7 లక్షల కోట్లు ఆవిరి
X

కొన్నిరోజులుగా మదుపర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు మరోసారి భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 900 పాయింట్లకుపైగా, నిఫ్టీ 300 పాయింట్ల పైగా నష్టపోయాయి. బలహీన త్రైమాసిక ఫలితాలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు భారీ నష్టాలకు కారణమవుతున్నాయి.

మధ్యాహ్నం 3 గంటల సమయంలో సెన్సెక్స్‌ 698 పాయింట్ల నష్టంతో 79,366 వద్ద, నిఫ్టీ 264.15 పాయింట్ల నష్టంతో 24,135.25 వద్ద ట్రేడవుతుననాయి. సెన్సెక్స్‌లో ఇండస్‌ ఇండ్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎన్టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, అదానీ పోర్ట్స్‌ షేర్లు ప్రధానంగా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్‌, నెస్లే ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు స్వల్ప లాభాల్లో కదలాడుతున్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ. 7.15 లక్షలు క్షీణించి రూ. 436 లక్షల కోట్లుగా ఉన్నది.

కారణాలివే..

బలహీన త్రైమాసిక ఫలితాలు మదుపర్లను నిరాశపరుస్తున్నాయి. పెద్ద, ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో మెరుపులు లేకపోవడం సూచీల పతనానికి కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే లాభం 40 శాతం క్షీణత నమోదు చేసిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌.. నేడు ఏకంగా 19 శాతం నష్టాల్లో కొనసాగుతున్నది. సెన్సెక్స్‌ 130 పాయింట్లు పడటంలో ఈ స్టాక్‌ది కీలక భూమిక. విదేశీ మదుపర్ల అమ్మకాలూ మన సూచీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. గత 19 సెషన్లుగా ఎఫ్‌ఐఐలు విక్రయదారులుగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఎన్నడూ లేనివిధంగా అమ్మకాలకు తెగబడుతున్నారు. గురువారం నాటి ట్రేడింగ్‌లో రూ. 5,062 కోట్ల విలువైన షేర్లను వీరు విక్రయింగా.. డీఐఐలు రూ. 3,620 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

అలాగే త్వరలో జరగనున్న అమెరికా ఎన్నికల ప్రభావం కూడా మన మార్కెట్లపై కనిపిస్తున్నది. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌ల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ.. ట్రంప్‌ వైపు మొగ్గు ఉందన్న అంచనాలు అమెరికాలో బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌ బలపడటానికి కారణమౌతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు.

First Published:  25 Oct 2024 9:53 AM GMT
Next Story