Telugu Global
Business

దీపావళి నుంచి జియో 5జీ సేవలు.. ప్రకటించిన ముఖేష్ అంబానీ

దీపావళికి కీలక నగరాల్లో ప్రారంభించి.. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తామని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ స్పష్టం చేశారు.

దీపావళి నుంచి జియో 5జీ సేవలు.. ప్రకటించిన ముఖేష్ అంబానీ
X

దేశంలో 5జీ మొబైల్ సేవలను ప్రారంభించడానికి రిలయన్స్ జియో సిద్దపడుతోంది. దీపావళి నాటికి మెట్రోలతో పాటు మొత్తం 14 నగరాల్లో జియో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ సోమవారం నిర్వహించిన 45వ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం)లో ప్రకటించారు. రాబోయే రోజుల్లో 5జీ కోసం పెట్టుబడులు, రిలయన్స్ భవిష్యత్ ప్రణాళికలను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను నెలకొల్పేందుకు రిలయన్స్ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. దీపావళికి కీలక నగరాల్లో ప్రారంభించి.. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు.

దేశంలోని ప్రతీ జిల్లా, పట్టణం, మండల కేంద్రానికి జియో 5జీ సేవలు విస్తరిస్తామని ఆయన చెప్పారు. గత నెలలో జరిగిన వేలంలో జియో టెలికాం రూ.88,078 కోట్ల విలువైన 5జీ స్పెక్ట్రమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దేశంలో టాప్ టెలికాం ఆపరేటర్‌గా ఉన్న జియో.. 5జీలో కూడా అగ్రస్థానంలో నిలబడటానికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు అంబానీ తెలిపారు. ఇప్పటికే క్వాల్‌కామ్‌తో జట్టు కట్టామని.. త్వరలో గూగుల్‌తో కలసి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తీసుకొని రానున్నట్లు ముఖేశ్ వెల్లడించారు. జియో 5జీ నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద 5జీ నెట్‌వర్క్‌గా మారబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జియో 5జీ కోసం రూ.2 లక్షల కోట్లు వెచ్చిస్తున్నట్లు అంబానీ తెలిపారు.

ఫైబర్ నెట్‌వర్క్‌లో కూడా జియో ముందు వరుసలో ఉందని అంబానీ తెలిపారు. ప్రస్తుతం జియో ఫైబర్‌కు 11 లక్షల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్ వర్క్ ఉందని.. ప్రతీ ముగ్గురు ఫైబర్ టూ హోమ్ కస్టమర్లలో ఇద్దరు జియోనే సెలెక్ట్ చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ విషయంలో ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియా 138వ ర్యాంకులో ఉందని.. ఈ విషయంలో ఇండియా టాప్ 10లో నిలపడమే జియో లక్ష్యమని అన్నారు. రాబోయే రోజుల్లో రిలయన్స్ సంస్థ రూ. 2.75 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

ఎఫ్ఎంసీజీ రంగంలో కూడా అగ్రగామిగా నిలవడానికి రిలయన్స్ భారీ ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ రంగంలో టాప్ ప్లేయర్‌గా ఉన్న హిందూస్తాన్ లివర్ లిమిటెడ్‌ను అధిగమించాలని భావిస్తున్నారు. అలాగే అదానీ విల్మర్‌తో పోటీ పడబోతున్నట్లు పరోక్షంగా తెలిపారు.


First Published:  29 Aug 2022 2:56 PM GMT
Next Story