Telugu Global
Business

మీడియాలో రిలయన్స్‌కే ఎక్కువ ప్రధాన్యం.. ఆసక్తికరమైన రిపోర్ట్ విడుదల

మీడియాలో వచ్చే బిజినెస్/నాన్-బిజినెస్ వార్తల్లో రిలయన్స్ ప్రస్తావన ఎక్కువగా వస్తుంటుందని విజికీ న్యూస్‌మేకర్స్ వెలువరిచిన నివేదికలో వెల్లడైంది.

మీడియాలో రిలయన్స్‌కే ఎక్కువ ప్రధాన్యం.. ఆసక్తికరమైన రిపోర్ట్ విడుదల
X

ఇండియాలో రిలయన్స్ కంపెనీ గురించి తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ముఖేశ్ అంబాని నేతృత్వంలోని ఈ కంపెనీ ఎన్నో రకాల వ్యాపారలు చేస్తోంది. అది అడుగుపెట్టిన ప్రతీ రంగంలోనూ అగ్రస్థానంలో ఉండటానికి ప్రయత్నిస్తుంది. ఆదాయాలు, లాభాలు, మార్కెట్ విలువ పరంగా చూస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియాలోనే అత్యంత పెద్ద కంపెనీ. ఇక ఈ సంస్థ ప్రసార మాధ్యమాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది. మీడియాలో వచ్చే బిజినెస్/నాన్-బిజినెస్ వార్తల్లో రిలయన్స్ ప్రస్తావన ఎక్కువగా వస్తుంటుందని విజికీ న్యూస్‌మేకర్స్ వెలువరిచిన నివేదికలో వెల్లడైంది.

2022 ఏడాదికి గాను రూపొందించిన ఈ నివేదికలో రిలయన్స్ సంస్థే అగ్రస్థానంలో ఉన్నది. మీడియాలో వచ్చే వార్తల పరిమాణం, ఆయా వ్యక్తుల గురించి చెప్పే న్యూస్, బ్రాండ్లు, శీర్షికల ప్రాధాన్యం, హెడ్‌లైన్స్‌లో ఉండటం, వార్తలు ప్రచురితమైన పబ్లికేషన్స్‌ను చదివే పాఠకుల సంఖ్య వంటివి బేరీజు వేసుకొని 'విజికీస్ న్యూస్‌స్కోర్' ఇస్తారు. ఇలా వచ్చిన స్కోర్ ఆధారంగా ఇచ్చిన ర్యాంకుల్లో రిలయన్స్ టాప్ 1గా నిలిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్‌ లెర్నింగ్ వంటి సాంకేతికను ఉపయోగించుకొని 4000పైగా ఆన్‌లైన్ పబ్లికేషన్లలో ఇండియాకు సంబంధించిన కంపెనీలపై ప్రచురించబడిన 5 కోట్ల వార్తలను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించడం గమనార్హం.

విజికీ న్యూస్ మేకర్స్ విడుదల చేసిన ర్యాంకుల్లో రిలయన్స్ అగ్రస్థానంలో ఉన్నది. ఆ తర్వాత స్థానాల్లో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, వన్97 కమ్యునికేషన్స్ (పేటీఎం), ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ, మారుతి సుజుకీ ఇండియా, టాటా మోటార్స్ ఉన్నాయి. ఇక 11వ ర్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. తర్వాత వరుసగా జొమాటో, విప్రో, యాక్సిస్ బ్యాంక్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఐటీసీ, ఎల్ అండ్ టీకి చోటు దక్కింది.

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కి ఏకంగా 92.56 స్కోర్ దక్కింది. విజికీ న్యూస్‌మేకర్స్ నివేదికలో రిలయన్స్‌ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఇది మూడో సారి. అంతే కాకుండా 90 మార్కుల కంటే ఎక్కువ సాధించిన తొలి భారత కంపెనీగా కూడా ఇది రికార్డులకు ఎక్కింది. ఇటీవల రిలయన్స్ సంస్థ.. మాండరిన్ ఓరియంటల్, యాడ్‌వర్బ్ టెక్నాలజీస్, కంపా కోలా వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. అంతే కాకుండా దాదాపు రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు కూడా ప్రకటించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కువగా మీడియాలో వార్తాంశంగా మారింది.

కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ సాధించిన స్కోరులో జియో, ముంబై ఇండియన్స్, నెట్‌వర్క్ 18, మనీ కంట్రోల్, హామ్లేస్ వంటి ఇతర గ్రూపు బ్రాండ్ల స్కోరును కలపలేదు. రిలయన్స్ తర్వాత స్థానంలో ఎస్‌బీఐ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎస్‌బీఐ ఇటీవల పలు భాగస్వామ్య, అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నది. అలాగే రుణాల రద్దు, మౌలిక బాండ్ల ద్వారా రూ.10వేల కోట్ల సమీకరణతో రెండో స్థానం దక్కించుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

గిఫ్ట్ సిటీ క్లియరింగ్ కార్ప్, వర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్ఏఆర్‌సీఎల్‌లో వాటాలు కొనుగోలు చేయడంతోపాటు ఈఎస్ఓఎస్ కింద లక్ష షేర్లను కేటాయించడం, లాభాలు పెంచుకోవడంతో ఐసీఐసీఐ వార్తల్లో నిలిచింది. ఇక దేశంలో 10 లక్షల మంది వినియోగదారులకు 5జీ సేవలు అందించడం, కొత్త ఫీచర్ల, ప్లాన్లు, ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సేవలతో భారతి ఎయిర్‌టెల్ తర్వాత స్థానంలో ఉన్నది.

Next Story