Telugu Global
Business

రూ.2 వేల నోట్లలో 50 శాతం వ‌చ్చేశాయ్‌.. - ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్

2018 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల మేర రూ.2 వేల‌ నోట్లు చలామణిలో ఉన్నట్టు అంచనా. 2023 మార్చి 31 నాటికి కేవలం రూ.3.62 లక్షల కోట్లు మాత్రమే చలామణిలో ఉన్నట్టు ఆర్బీఐ అంచనా వేసింది. తాజాగా వీటిలో సగం ఇప్పటికే బ్యాంకులకు చేరిందని తెలిపింది.

రూ.2 వేల నోట్లలో 50 శాతం వ‌చ్చేశాయ్‌.. - ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్
X

రూ.2 వేల నోట్లలో 50 శాతం వ‌చ్చేశాయ్‌.. - ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత‌దాస్

ఇటీవల ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లలో 50 శాతం ఇప్పటికే బ్యాంకులకు చేరినట్టు రిజ‌ర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. వీటి విలువ రూ.1.80 లక్షల కోట్లని ఆయ‌న తెలిపారు. ఉపసంహరణ ప్రకటన చేసిన కేవలం 20 రోజుల్లోనే సగం నోట్లు వెనక్కి రావడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే దాదాపు 85 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలోనే బ్యాంకు ఖాతాల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. వీటిని మార్చుకునేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని, అయినా అప్ప‌టివ‌ర‌కు వేచి ఉండ‌వ‌ద్ద‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. మార్పిడి చేసుకునేందుకుగాను ఆర్బీఐ దగ్గర ఇతర కరెన్సీ ఉందని తెలిపారు.

రూ.500 నోట్ల రద్దు యోచ‌న లేదు..

రూ.2 వేల నోట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో రూ.500 నోట్ల‌ను కూడా రిజ‌ర్వ్ బ్యాంకు ఉప‌సంహ‌రించుకుంటుంద‌నే ఊహాగానాలు ఇటీవ‌ల ఎక్కువ‌య్యాయి. దీనిపై రిజర్వ్‌బ్యాంకు తాజాగా స్ప‌ష్ట‌త ఇచ్చింది. రూ.500 నోట్ల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డం, రూ.1000 నోట్ల‌ను తిరిగి ప్ర‌వేశ‌పెట్ట‌డం వంటి ఆలోచ‌న లేద‌ని తేల్చి చెప్పింది. ఇటువంటి ఊహాగానాల‌ను వ్యాప్తి చేయొద్ద‌ని ప్ర‌జ‌ల‌ను కోరింది.

2018 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల మేర రూ.2 వేల‌ నోట్లు చలామణిలో ఉన్నట్టు అంచనా. 2023 మార్చి 31 నాటికి కేవలం రూ.3.62 లక్షల కోట్లు మాత్రమే చలామణిలో ఉన్నట్టు ఆర్బీఐ అంచనా వేసింది. తాజాగా వీటిలో సగం ఇప్పటికే బ్యాంకులకు చేరిందని తెలిపింది.

మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2 వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది మే 19న ప్రకటించింది. వినియోగదారులకు రూ.2 వేల నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని, ఇప్పటికీ లావాదేవీలకు వీటిని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే.

First Published:  8 Jun 2023 9:42 AM GMT
Next Story