Telugu Global
Business

పేటీఎంను నమ్ముకొని భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు

గత దశాబ్ద కాలంలో వచ్చిన అతి పెద్ద ఐపీవో పేటీఎం కావడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో రూ. 2,150 వద్ద లిస్టయిన పేటీఎం షేర్.. గురువారం రూ. 441.15 వద్ద ముగిసింది.

పేటీఎంను నమ్ముకొని భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు
X

దేశీయ డిజిటల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీల్లో ఒకటైన పేటీఎం భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. పేటీఎంను నమ్మి స్టాక్ మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన మదుపర్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. డిజిటల్ పేమెంట్ మార్కెట్‌లోకి ఎర్లీగానే ఎంట్రీ ఇచ్చిన పేటీఎం మంచి లాభాలనే అర్జించింది. ఆ తర్వాత వచ్చిన ఫోన్ పే, గూగుల్ పేలు పేటీఎంను దాటేశాయి. పేటీఎంకు ఇతర పేమెంట్ల యాప్‌ల మాదిరిగా కాకుండా.. పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ కూడా ఉన్నది. దీంతో భవిష్యత్‌లో మరింతగా అభివృద్ధి చెందుతుందని అందరూ అంచనా వేశారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం ఐపీవోకు వెళ్లాలని నిర్ణయించింది.

గత దశాబ్ద కాలంలో వచ్చిన అతి పెద్ద ఐపీవో పేటీఎం కావడం గమనార్హం. నిరుడు నవంబర్‌లో రూ. 2,150 వద్ద లిస్టయిన పేటీఎం షేర్.. గురువారం రూ. 441.15 వద్ద ముగిసింది. కేవలం ఏడాది వ్యవధిలో పేటీఎం మార్కెట్ విలువ 75 శాతం మేర పడిపోయింది. లిస్టయిన నాటి నుంచి ఏనాడూ లాభపడని పేటీఎం.. మొత్తానికి 79 శాతం తగ్గిపోయింది. గత దశాబ్దంలోనే అత్యంత అధ్వాన్నంగా ముగిసిన ఐపీవోగా పేటీఎం నిలిచింది. యాంకర్ పెట్టుబడిదారుల లాకిన్ పిరియడ్ గతవారం ముగియడంతో జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్.. పేటీఎంలో ఉన్న తమ షేర్లను పూర్తిగా విక్రయించింది.

కీలక భాగస్వామి తమ షేర్లను అమ్మడంతో పేటీఎం షేర్ మరింతగా పడిపోయింది. మంగళవారం రూ. 477.55 వద్ద ముగిసిన షేరు.. గురువారం రూ. 441కు చేరుకుందంటే.. పేటీఎం షేర్ వాల్యూ ఎంత వేగంగా పతనం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ప్రీ-ఐపీవో ఇన్వెస్టర్లతో పాటు నాన్-ప్రమోటర్ ఇన్వెస్టర్లు కూడా షేర్లను భారీగా విక్రయిస్తుండటంతో సెంటిమెంట్ బలహీనపడిందని.. దీంతో చిన్న మదుపర్లు కూడా స్టాక్స్ అమ్మేస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ప్రతీ ర్యాలీలో మార్కెట్ మొత్తం ఏదో ఒక విషయంలో ఉత్సాహంగా ఉంటుందని కెనెరా రొబెకో అసెట్ మేనేజ్‌మెంట్ ఈక్విటీల హెడ్ శ్రీదత్తా భంద్వాల్దార్ అన్నారు. 2006 నుంచి 2008 మధ్య నిర్మాణ సంస్థలు, క్యాపిటల్ గూడ్స్ షేర్లు బాగా రాణించాయి. 2013 నుంచి 2014 వరకు మిడ్ క్యాప్‌లు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. 2017-19 మధ్య నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మంచి రాబడిని ఇచ్చాయి. గత రెండేళ్లుగా టెక్ కంపెనీలు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. కానీ, పేటీఎం షేర్ మాత్రం ఈ ఏడాది ఏ దశలోనూ పాజిటివ్ సెంటిమెంట్‌ను చూపించలేదు. ఇతర పేమెంట్ కంపెనీలు దూసుకొని పోతుండటంతోనే ఆ ప్రభావం ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ ఏడాది పేటీఎంను నమ్ముకొని పెట్టుబడిపెట్టిన వాళ్లు భారీగా నష్టపోయారని ఆయన తెలిపారు.

First Published:  24 Nov 2022 12:56 PM GMT
Next Story