Telugu Global
Business

ట్విట్ట‌ర్‌ బాటలోనే మెటా.. భారీగా ఉద్యోగుల తొలగింపు

Meta Facebook Layoffs: మెటా ఇంటికి పంపించే ఉద్యోగుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. బుధవారం నుంచే ఈ తొలగింపులను ప్రారంభించనున్నట్టు మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు.

ట్విట్ట‌ర్‌ బాటలోనే మెటా.. భారీగా ఉద్యోగుల తొలగింపు
X

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజాలన్నీ ఉద్యోగుల తొలగింపులో బిజీబిజీగా ఉన్నారు. ట్విట్ట‌ర్ బాటలోనే మెటా కూడా పయనిస్తోంది. బుధవారం ఉదయం నుంచి తమ సంస్థలో పని చేసే ఉద్యోగులను తొలగించడం ప్రారంభిస్తుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. జుకర్‌బర్గ్ మంగళవారం వందలాది మంది సంస్థ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా ద్రవ్యోల్బణ ప్రభావంతో పెద్ద సంఖ్యలో సంస్థ ఉద్యోగుల్ని తొలగించాలని మెటా భావిస్తోంది.

మెటా ఇంటికి పంపించే ఉద్యోగుల సంఖ్య వేలల్లోనే ఉంటుందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. బుధవారం నుంచే ఈ తొలగింపులను ప్రారంభించనున్నట్టు మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. అయితే ఎంత మందికి ఉద్వాసన ఉంటుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతం మెటా నిర్వహణలోని ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా 87,000 మందికిపైగా పని చేస్తున్నారు. కంపెనీ 18 సంవత్సరాల చరిత్రలో తొలగింపులు అనేవి అత్యంత కీలకమైన పరిణామంగా మారాయి.

ఉద్యోగుల తొలగింపునకు కారణమేంటంటే..

ప్రస్తుతం అమెరికా ధరల సెగతో అల్లాడుతోంది. దీనిని అరికట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే వడ్డీ రేట్లు పెంచినా ఫలితం శూన్యం. ఈ ధరల ప్రభావం టెక్‌ కంపెనీలను సైతం తాకింది. దీంతో వెంటనే పలు కంపెనీలు తమ ప్రకటనల బడ్జెట్‌కు కోతపెట్టాయి. మెటా కూడా బడ్జెట్‌కు కోత పెట్టిన కంపెనీల జాబితాలో ఉంది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో గత ఏడాదితో పోలిస్తే మెటా నికర లాభం సగానికి పైగా తగ్గింది. పైగా ఇప్పట్లో పరిస్థితుల్లో దారికొచ్చేలా కనిపించడం లేదు. వీటన్నింటినీ అధిగమించాలంటే ఉద్యోగుల తొలగింపు ఒక్కటే సంస్థకు ప్రత్యామ్నాయ మార్గంగా కనిపిస్తోంది. దీంతో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్‌ల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది.

తొలగించిన ఉద్యోగులకు 4 నెలల వేతనం..

ఉద్యోగాలు కోల్పోతున్న నిర్దిష్ట ఉద్యోగులకు బుధవారం ఉదయం మెటా యాజమాన్యం సమాచారం అందించనుంది. అయితే ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నవారికి కనీసం నాలుగు నెలల జీతాన్ని ఇస్తామని మెటా మానవ వనరుల అధిపతి లోరీ గోలెర్ చెప్పారు. అయితే ఎలన్ మస్క్ టేకోవర్ తర్వాత ట్విట్టర్ కమ్యూనికేషన్స్, కంటెంట్ క్యూరేషన్ నుంచి ప్రోడక్ట్, ఇంజినీరింగ్ వరకు ఉన్న టీమ్‌లలో సగం మంది ఉద్యోగులను తొలగించింది. మరి ట్విట్ట‌ర్ మాదిరిగానే మెటా తొలగింపులు ఉంటాయో.. లేదంటే మరోలా ఉంటాయా? అనేది తెలియాల్సి ఉంది.

First Published:  9 Nov 2022 2:30 PM GMT
Next Story